
వర్షాకాలానికి ముందే నగరంలో ఉన్న మ్యాన్ హోళ్లను శుద్ధి చేసేలా జలమండలి చర్యలు తీసుకుంది. ఇప్పటికే నూతన మ్యాన్ హోళ్ల నిర్మాణం, ఆధునీకరణ పనులను చేపట్టగా, తాజాగా బ్లాకేజీలను తొలగించేలా సర్కిల్ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డివిజన్ల వారీగా ఉన్న మ్యాన్ హోళ్లు, ఎక్కువగా మురుగు నీరు ఉప్పొంగే పాయింట్లు, నీరు నిలిచిపోయే ప్రాంతాలపై దృష్టి పెట్టింది. నగరంలో దాదాపు 2.85 లక్షల మ్యాన్ హోళ్లు, క్యాచ్ పిట్ లు ఉండగా, ఇటీవల 2 వేల కి.మీ పొడవునా రోడ్లపై 17 వేల మ్యాన్ హోళ్లకు మరమ్మతులు, ఆధునీకరణ పనులను చేపట్టింది. వీటి ద్వారా ప్రతిరోజు దాదాపు 1350 ఎంజీడీల మురుగు బయటకు వస్తుండగా, ఇందులో సగానికి పైగా సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేసి మూసీలోకి వదులుతోంది.
లోతట్టు ప్రాంతాల్లో యాక్షన్ టీమ్లు…
అయితే వచ్చేది వానాకాలం కావడంతో సీవరేజీ హోళ్లలో చెత్త చెదారం చేరి మురుగు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. గతంలోనూ స్థానికుల నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో రానున్న 15 రోజుల్లోనూ మ్యాన్ హోళ్ల శుద్ధికి చర్యలు తీసుకోవాలని సెక్షన్ స్థాయి సిబ్బందికి జలమండలి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో సీవరేజీ పైపులైన్ల పక్కనే మంచినీటి పైపు లైన్ ఉండగా, లీకేజీ కారణంగా మంచినీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా సిటీలో లోతట్టు ప్రాంతాల్లో మురుగు నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, మ్యాన్ హోళ్లను ఎయిర్ టెక్ మిషన్లతో శుభ్రం చేస్తోంది. అదేవిధంగా నీరు నిలిచిన వెంటనే మూతలు తీసి, మురుగు నిలిచిపోకుండా ఉండేలా జలమండలి ఆధ్వర్యంలోనూ యాక్షన్ టీంలను సిద్ధం చేసింది.
600 ప్రాంతాల్లో డ్రైనేజీ ఓవర్ఫ్లో…
కోర్ సిటీ పరిధిలో దాదాపు 600లకు పైగా ప్రాంతాల్లో డ్రైనేజీ ఓవర్ ఫ్లో అయ్యే ప్రాంతాలు ఉండగా, ఇప్పటికే ఆయా హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సమస్య పరిష్కారానికి జలమండలి మినీ జెట్టింగ్ మిషన్లు వినియోగించుకోవాలని సూచించారు. వర్షాకాలంలో వాటర్ బోర్డుకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించేలా సెక్షన్ స్థాయి అధికారులకు పక్కా ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది. ఏటా మురుగు నీటి నిర్వహణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా వర్షాకాలాన్ని ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది అలర్ట్ గా ఉండాలని ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో జలమండలి ఎండీ దానకిశోర్ సూచించారు.