ఏ అంశంపై చర్చించడానికైనా మేం సిద్ధం

కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తామని బీజేపీ చెప్పలేదు

హైదరాబాద్‌ని రెండో రాజధాని చేయాలనే ప్రతిపాదన లేదు

రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలుకాబోతున్న సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘శీతాకాల సమావేశాలు రేపటి నుండి మొదలు కానున్నాయి. ప్రతిపక్షాలు ఏ అంశంపై చర్చించాలన్నా దానికి మేము సిద్ధంగానే ఉన్నాము. గత పార్లమెంట్ సమావేశాల్లో 370 ఆర్టికల్ రద్దు, త్రిబుల్ తలక్ బిల్లులు తీసుకవచ్చాము. 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ ప్రశాంతంగా మారింది. పార్లమెంట్‌లో మా ఎజెండా‌ను దేశ ప్రజల ముందు ఉంచుతాం. విద్యావిధానం, వైద్య విధానం, నదుల అనుసంధానం మొదలైన అంశాలపై చర్చ జరుపుతాం. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి నీరు, వైద్యం, విద్య వంటి మౌళిక వసతుల కల్పనే మా ప్రధాన ధ్యేయం. హైదరాబాద్‌ని దేశానికి రెండో రాజధాని చేయాలనే ప్రతిపాదన ఏదీ మా దగ్గర లేదు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ పని చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని పని చేస్తాం. ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్రభుత్వం పరిదిలోని అంశం. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి కార్మికులతో ఇప్పటికైనా చర్చలు జరపాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కాంగ్రెస్ కానీ.. బీజేపీ కానీ చెప్పలేదు. ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చాము. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని పునర్విభజన చట్టంలో ఎందుకు పెట్టించలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి’ అని అన్నారు.

Latest Updates