రెండేళ్లలో కొత్త పార్లమెంటు బిల్డింగ్

  • 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు అందులోనే

మరో రెండేళ్లలో కొత్త పార్లమెంటు బిల్డింగ్‌ నిర్మించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘2022 నాటికి భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ (వజ్రోత్సవ) వేడుకల్ని జరుపుకోబోతోంది. ఆ సమయానికి  కొత్త పార్లమెంటు భవనంలో ఉభయ సభల సమావేశాలు జరగాలి’ అని అన్నారు స్పీకర్. ఈ ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారాయన. ప్రధాని మోడీ ఆమోదం కూడా తెలిపారని, కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి ప్రాసెస్ మొదలు పెడుతున్నామని చెప్పారు ఓం బిర్లా.

యూపీఏ-2 టైమ్‌లోనే ప్రతిపాదన

కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి యూపీఏ-2 హయాంలోనే ప్రతిపాదన వచ్చింది. నాటి స్పీకర్ మీరా కుమారి దీనిపై సూచనలు కోరుతూ ఓ కమిటీని కూడా నియమించారు. 85 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలనలో నిర్మించిన పార్లమెంటు బిల్డింగ్ ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదన్న కారణంతో పాటు పురాతన భవనాల్ని కాపాడుకోవాలని నాటి ప్రభుత్వం  అభిప్రాయపడింది. మరోవైపు ప్రపంచ  వారసత్వ సంపదగా భారత పార్లమెంటుకు గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని చెక్కు చెదరకుండా భావి తరాలకు అందించేందుకు కొత్త భవనం నిర్మించి అందులో కార్యకలాపాలు చేపట్టాలని 2019 ఆగస్టు 5న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. ప్రధాని మోడీకి ప్రతిపాదించారు.

నాడు నిర్మాణానికి ఆరేళ్లు

భారత్‌ను ఢిల్లీ రాజధానిగా పాలించాలని బ్రిటిషర్లు నిర్ణయించాక.. ఇక్కడ పరిపాలన బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. సర్ ఎడ్డిన్ లూటెన్స్, సర్ హెర్బెర్ట్ అనే ఇద్దరు బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ దీనికి ప్లాన్ ఇచ్చారు. చౌసత్ యోగిని ఆలయం ఆకారంలో పార్లమెంట్ బిల్డింగ్ నిర్మాణానికి డిజైన్ రూపొందించారు. 1921లో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆరేళ్లలో నిర్మాణం పూర్తయింది. 1927 జనవరి 18న నాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ భవన ప్రారంభోత్సవం చేశారు. గుండ్రంగా కట్టిన ఈ బిల్డింగ్‌ కాంప్లెక్స్‌లో మధ్యన ఉన్న భవనాన్ని నాడు చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్‌గా వాడుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత దాన్ని భారత ప్రభుత్వం పార్లమెంటు లైబ్రరీ హాల్‌గా మార్చింది. నాటి స్టేట్ కౌన్సిల్‌ను రాజ్యసభగా, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని లోక్‌సభగా వినియోగిస్తోంది.

Latest Updates