అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇంటర్‌ బోర్డు ముట్టడి

ఇంటర్ బోర్డు, గ్లోబరినా సంస్థ తప్పిదాల్ని కమిటీ తేల్చినా…సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా ఇవాళ(సోమవారం) అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇంటర్‌ బోర్డు ముట్టడి కార్యక్రమాన్నినిర్వహించనుంది. ఇంటర్‌ బోర్డు ముట్టడికి బయల్దేరిన TJS అధ్యక్షుడు కోదండరాం ను తార్నాకలో పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. శాంతియుతంగా నిరసన చేస్తామని చెప్పినా..అరెస్ట్ చేయడం దౌర్భాగ్యమన్నారు కోదండరాం. ప్రైవేట్ కంపెనీ కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఏవిధంగా న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము పోరాటాల్లో పుట్టాం…పోరాటాల్లోనే కొనసాగుతున్నామన్నారు కోదండరాం. ఇవాళ TJS ఆవిర్భావ దినోత్సవమని… పార్టీ జెండాను ఎగురవేసేందుకు కూడా కార్యకర్తలు బయటికి రాకుండా భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. అఖిలపక్ష మహాధర్నాకు ఎవరూ రాకుండా అరెస్ట్ చేస్తున్నారన్నారు.

ఇంటర్‌ బోర్డు ముట్టడికి బయల్దేరిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ నేత అంజన్‌కుమార్‌ యాదవ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. పలువురు సీపీఐ, టీజేఎస్‌, కాంగ్రెస్‌ నాయకులను ముందస్తు అరెస్ట్‌ చేశారు. ముందస్తు అరెస్ట్‌లను ఉత్తమ్‌, పొన్నం, సీపీఐ నేత చాడ ఖండించారు.

Latest Updates