సొంత స్థలంలో ఇళ్లు కట్టుకుంటే డబ్బులిస్తాం

  • ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు,ఇతరులకు రూ.5 లక్షలు
  • మొత్తంగా అలాంటివారు ఎందరున్నారో చెప్పని ఆర్థికమంత్రి
  • రాష్ట్రం లో ఏడు లక్షల మందికే ఇండ్లు లేవన్న సీఎం కేసీఆర్

సొంత స్థలం ఉండి, ఇల్లు నిర్మించుకోలేని వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.వచ్చే ఆర్ధిక సంవత్సరంలో లక్ష మంది లబ్ధిదారులకు వారి సొంత స్థలాల్లో ఇండ్లు కట్టుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తుంది. అని మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఆర్థిక సాయం చేస్తామని.. ఎస్సీ,ఎస్టీలకు రూ.6 లక్షలు, ఇతరులకు రూ.5 లక్షలు ఇస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కేసీఆర్ ప్రకటించారు. అయితే 2019 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్, 2019 సెప్టెంబర్ లో ప్రవేశపెట్టిన ఫుల్ బడ్జెట్ లో ఆ అంశాన్ని ప్రస్తావిం చలేదు. నిధులు కేటా యించలేదు. నిధుల కొరత, ఆర్థిక మాంద్యం వల్ల ఈ పథకాన్ని అమల్లోకి తేలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

జాగా ఉండి ఇల్లు లేనోళ్లు ఎంత మంది?

బడ్జెట్ ప్రసంగం సందర్భంగా సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేస్తామని మంత్రి ప్రకటించారు. కానీ‘రాష్ట్రంలో సొంత స్థలం ఉండి ఇల్లు లేని వాళ్లు ఎంత మంది ఉన్నారు? 2018లో హామీ ఇచ్చిన విధంగా రూ.6 లక్షలు, రూ.5 లక్షలు ఇస్తారా లేదా తగ్గిస్తారా?’ అన్న దానిపై స్పష్ట త ఇవ్వలేదు. ఈ సాయం కోసం ప్రత్యే కంగా నిధులేమీ కేటా యించలేదు. గృహ నిర్మాణ శాఖకు బడ్జెట్ లో రూ.11,917 కోట్లు కేటా యించారు. అందులోంచి ఖర్చు చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

డబుల్ ఇండ్లపై తగ్గనున్న భారం

సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో డబుల్ ఇండ్లపై భారం తగ్గనుంది. రాష్ట్రవ్యాప్తంగా సొంత స్థలం ఉండి , ఇల్లు లేని వారు చాలా మంది డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వారు సాయం వైపు మొగ్గితే.. డబుల్ ఇండ్లకు పోటీ కొంత తగ్గనుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షా 80 వేల డబుల్ ఇండ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్రంలో 22 లక్షల మందికి ఇల్లు లేనట్టుగా తేలిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ వాదనను సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే ఖండిం చారు. రాష్ట్రంలో ఇండ్లు లేని వాళ్లు 7లక్షల మంది ఉన్నట్టు ప్రకటించారు.

త్వరలో సర్వే

రాష్ట్రంలో లక్షలాది మందికి సొంతంగా స్థలం ఉన్నా ఇల్లు కట్టుకునేందుకు పైసల్లేని పరిస్థితి. ఇప్పటి పరిస్థితుల్లో స్థలం కాకుండా కేవలం ఇంటి నిర్మాణానికి గ్రామాల్లోనే రూ.10 లక్షల వరకు అవుతుందని అంచనా.ఈ నేపథ్యంలో ప్రభుత్వ సాయం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తాజా బడ్జెట్ లో ఆర్థిక సాయం అంశాన్ని ప్రస్తావించింది. త్వరలో గృహనిర్మాణ శాఖ అధికారులు సర్వే చేసి.. సొంత స్థలం ఉండి , ఇల్లు లేని వారి సంఖ్య తేల్చనున్నట్టు తెలుస్తోంది.

Latest Updates