రైతులకు పంట నష్టం కేంద్రమిస్తేనే.. మేమిస్తం

మక్కలు మీ రిస్కే.. ఈసారే లాస్ట్.. మళ్లీ కొనం
మంత్రి నిరంజన్ రెడ్డి

యాదాద్రి, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తేనే తామింత కలిపి నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తామని వ్యవసాయ, మార్కెటింగ్​శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడైతే తాము చేయగలిగింది వరి, పత్తి మద్దతు ధరకు కొనుగోలు చేయడమేనని అన్నారు. మంగళవారం యాదాద్రి జిల్లాకు వచ్చిన ఆయన లక్ష్మి నర్సింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తారా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు పైవిధంగా జవాబిచ్చారు. గడిచిన 50 ఏళ్లలో  కురవనంత వర్షం ఇటీవల కురిసి జల సంపద పెరిగిందన్నారు. అయితే ఈ వర్షం కారణంగా 5 లక్షల పైచిలుకు ఎకరాల్లో రూ. 5 వేల కోట్ల పంట నష్టపోయారని చెప్పారు. దీన్ని జాతీయ విపత్తు కింద గుర్తించినందున కేంద్రానికి నివేదిక పంపించామన్నారు.

జాతీయ విపత్తు కింద 75 శాతం పరిహారం కేంద్రం ఇస్తే..  రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం కలిపి రైతులకు అందజేస్తుందన్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంగా తాము రైతుల పట్ల సానుభూతితో కూపన్ల పద్ధతిలో వడ్లు, పత్తి కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తుందని, నాణ్యత లోపిస్తే రైతులే ఇబ్బంది పడతారని చెప్పారు. వడ్లను కొనుగోలు చేయడానికి 6,400 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మొక్కజొన్నను ఈ ఒక్కసారికి మాత్రమే కొంటామని, ముందు ముందు ప్రభుత్వం కొనదని స్పష్టం చేశారు. వచ్చే యాసంగిలో మొక్కజొన్నలు వేస్తే అది రైతు రిస్కే అని తేల్చి చెప్పారు. మక్కలు వేయొద్దని చెప్పినా.. రైతులు వినకపోవడం వల్ల ప్రభుత్వానికి గత యాసంగి సీజన్​లో రూ. 853 కోట్ల నష్టం వచ్చిందన్నారు. కంది పంటను 20 నుంచి 25 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని కోరినా రైతులు 11 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారన్నారు. మొక్కజొన్నలు వేయొద్దని, వరిసాగును తగ్గించాలని సూచించిన ఆయన ఆయిల్​పామ్, కందుల సాగు పెంచాలని కోరారు. ఉత్తర, దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తయితే మరో ఏడాదిన్నరలో 1.25 కోట్ల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు. ఈ ఏడాది 1.35 కోట్ల ఎకరాల్లో పంటలను సాగు చేశారని మంత్రి వెల్లడించారు.

For More News..

నిమ్స్​‌లో నర్సుల ఆందోళన

యాసంగిలో ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేయాలో చెప్పిన ప్రభుత్వం

జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఎవరైనా భూములు కొనొచ్చు

Latest Updates