కొత్త మోడల్స్ తో కరెంట్​ స్కూటర్లు మరిన్ని..

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌‌ వాహనాల వాడకం నానాటికీ పెరగడంతోపాటు తాజాగా వీటిపై పన్నుల భారం కూడా తగ్గడంతో ఈ పరిస్థితిని అవకాశంగా మల్చుకోవాలని హీరో ఎలక్ట్రిక్‌‌ నిర్ణయించింది. కంపెనీని మరింత వేగంగా విస్తరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం నిధులు సమీకరించడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి ఏటా లక్ష యూనిట్ల ఎలక్ట్రిక్‌‌ స్కూటర్లను తయారు చేసే సామర్థ్యం ఉంది. దీనిని ఐదు లక్షల యూనిట్లకు పెంచడానికి, ప్లాంట్ల సామర్థ్యాన్ని విస్తరించడానికి రాబోయే మూడేళ్లలో రూ.700 కోట్ల దాకా ఖర్చు చేయనుంది. ‘‘మేం అన్ని రకాలుగా ఎదుగుతున్నాం. వెనక్కి తిరిగి అవకాశమే లేదు. డీలర్‌‌ నెట్‌‌వర్క్‌‌, ఉద్యోగులను, ప్రొడక్ట్‌‌ పోర్ట్‌‌ఫోలియోను, ఉత్పత్తిని పెంచుతున్నాం. ఇందుకోసం నిధులను సేకరిస్తాం’’ అని హీరో ఎలక్ట్రిక్‌‌ ఎండీ నవీన్‌‌ ముంజాల్‌‌ చెప్పారు. ఎన్ని నిధులను సేకరిస్తారన్న ప్రశ్నకు స్పందిస్తూ..దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. రాబోయే కొన్నేళ్లలో ఉత్పత్తి పెంపునకు భారీగా ఖర్చు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అల్ఫా క్యాపిటల్‌‌ నుంచి ఈ కంపెనీకి నిధులు అందుతున్నాయి.

భవిష్యత్‌‌ ప్లాన్స్‌‌ ఇవి…

ఉత్పత్తి, ప్రొడక్ట్ డెవలప్‌‌మెంట్‌‌, ఆర్ అండ్‌‌ డీ, మార్కెటింగ్‌‌ల కోసం రాబోయే కొన్నేళ్లలో రూ.500–రూ.700 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. దీనివల్ల సప్లై చైన్‌‌, డీలర్‌‌ నెట్‌‌వర్క్‌‌, ట్రెయినింగ్‌‌ వంటివి బలోపేతమవుతాయి. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూనే ఉంటామని ముంజల్‌‌ ప్రకటించారు. ఎలక్ట్రిక్‌‌ వాహనాలకు మోజు బాగా పెరుగుతోందన్నారు. తాము మరింత వేగంగా పనిచేయాల్సి ఉందని, వాహనాలను ఇంకా మెరుగుపర్చుతామని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 600 డీలర్షిప్‌‌లు ఉండగా, వచ్చే ఏడాదిలోపు వీటిని వెయ్యి దాకా తీసుకెళ్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్‌‌ టూవీలర్లు, వాటి వేరియెంట్లను అమ్ముతోంది. వచ్చే సంవత్సరం కొన్ని కొత్త మోడల్స్‌‌ను ప్రవేశపెడతామని, ప్రస్తుత మోడల్స్‌‌ను ఆధునీకరిస్తామని హీరో ఎలక్ట్రిక్‌‌ తెలిపింది. ఎలక్ట్రిక్‌‌ వాహనాల వాడకాన్ని పెంచడానికి వీటిపై జీఎస్టీని 12 శాతం నుంచి ఐదుశాతానికి తగ్గిస్తున్నట్టు జీఎస్టీ మండలి శనివారం ప్రకటించింది.

 

Latest Updates