ఎక్కడ చూసినా కబ్జాలే.. హఫీజ్‌పేట నుంచే భూపరిరక్షణ పోరాటం ప్రారంభిస్తాం

హైదరాబాద్ ​చుట్టూ భూకబ్జాలే..

తెలంగాణ భూపరిరక్షణ సమితి మీటింగ్‌లో వక్తలు

హైదరాబాద్, వెలుగు: హఫీజ్‌పేట నుంచే భూపరిరక్షణ పోరాటాన్ని స్టార్ట్‌ చేస్తామని, రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను కాపాడుకునే వరకు ఉద్యమం ఆగదని తెలంగాణ భూపరిరక్షణ సమితి నాయకులు ప్రకటించారు. ఈ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసిరావాలని పిలుపునిచ్చారు. భూకబ్జాలు లేని తెలంగాణను కోరుకున్నామని, కానీ కబ్జాల రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూరికార్డుల ప్రక్షాళన పేరుతో కబ్జాదారులకు, దొరలకు భూములు కట్టబెట్టారని ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సుప్రీంకోర్టు సీనియర్​న్యాయవాది నిరూప్​రెడ్డి అధ్యక్షతన తెలంగాణ భూపరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్​నేత, మాజీ ఎంపీ మధుయాష్కితోపాటు భూపరిరక్షణ సమితి నాయకులు గాదె ఇన్నయ్య, పాశం యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కె.నారాయణ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనే సర్కారు భూములను ల్యాండ్ మాఫియా కబ్జా చేసిందన్నారు. భూములు కబ్జా కాకుండా పోరాడుమని, అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉండాలన్నారు. మియాపూర్, హఫీజ్‌పేట్ ప్రాంతాలకే కబ్జాలు పరిమితం కాలేదని, రాష్ట్రంలో చాలా చోట్ల కబ్జాదారుల అక్రమాలు బయటపడుతున్నాయని సీనియర్‌‌ లాయర్ నిరూప్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని 1200 ఎకరాల వక్ఫ్​భూములను ఇండస్ట్రియలిస్టులకు పంచిపెట్టారని ఆరోపించారు. సీనియర్​జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొంగలు పడ్డారని, తెలంగాణ ప్రజలు మేల్కొనాలని పిలుపునిచ్చారు. భూ కబ్జాదారులను కఠినంగా శిక్షించాలని, హఫీజ్‌పేట్ భూబాధితులకు సర్కారు న్యాయం చేయాలని, ప్రభుత్వ భూముల వివాదాలను పరిష్కరించడానికి సీజే ఆధ్వరంలో స్పెషల్ బెంచ్‌ ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి మఠంపల్లి మండలం గుర్రంబోడు తండా భూబాధితులు, గజ్వేల్​ మండలం ముట్రాస్​పల్లి, లింగరాజుపేట, నాదర్ గుల్, హఫీజ్​పేట, మియాపూర్, బీబీ నగర్ భూబాధితులు హాజరై తమ గోడు వెల్లబోసుకున్నారు.

Latest Updates