పాక్ ఉగ్రవాదుల అడ్డా: మోడీ

ముంబై: వీర సైనికుల త్యాగాలను వృథా కానివ్వబోమని ప్రధాని మోడీ మరో సారి స్పష్టం చేశారు. ముష్కరులపై ప్రతీకార దాడికి బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని చెప్పారు. మహారాష్ట్రలోని యవత్మల్ లో ఆయన పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడారు. పుల్వామాలో ఉగ్ర దాడిపై ప్రజల్లో ఉన్న ఆగ్రహావేశాలను తాను అర్థం చేసుకోగలనన్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వీర సైనికులు భరత మాత సేవలో తమ ప్రాణాలను త్యాగం చేశారని మోడీ చెప్పారు. వీర జవాన్లను కోల్పోవడంతో ప్రజలంతా విషాదంలో ఉన్నారని అన్నారు. జవాన్ల త్యాగాలను వృథాకానివ్వమని అన్నారు.

పాకిస్థాన్ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందని మోడీ అన్నారు. ఆ దేశం ఉగ్రవాదానికి మారు పేరు అని, ముష్కరులకు అది అత్యంత సురక్షిత స్థావరంలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ వారికి స్వర్గధామమని అన్నారు.

పుల్వామా దాడికి పాల్పడిన ఉగ్ర సంస్థలు ఎక్కడ దాగినా వదిలే ప్రసక్తే లేదని మోడీ చెప్పారు. ఎంత ప్రయత్నించినా మన సైనికుల గురి నుంచి తప్పించుకోలేరని అన్నారు. ప్రతీకారం తీర్చుకునేందుకు మన జవాన్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని అన్నారు.

అమరులైన జవాన్లకు సభలో మోడీ, భారీగా హాజరైన జనం నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Latest Updates