డబ్బు మాత్రమే సంపాదిస్తే చాలా కోల్పోతారు..!

వెలుగు లైఫ్- ఆధ్యాత్మికం

‘డబ్బుంటే కొండమీద కోతి కూడా దిగొస్తుంద’ని అంటారు. కానీ ‘డబ్బుతో కొనలేనివి చాలానే ఉంటాయ’ని మరికొందరు అంటారు. ఎవరెలా అన్నా డబ్బు లేకపోతే ఈ రోజుల్లో బతకడం కష్టం. అలాగని డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకుంటే చాలా వాటిని కోల్పోవాల్సి వస్తుంది.

డబ్బు ఎలా సంపాదించాలి? ధనానికున్న ప్రాధాన్యత ఏంటి? ధనం అంటే మనుషులు తయారు చేసిన నాణేలు, నోట్లేనా? సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు వేదాలు, పురాణాల్లో చాలా చోట్ల సమాధానాలున్నాయి.

ప్రకృతే అసలైన ధనం..

గాలి, నీరు, సూర్యుడి నుంచి వచ్చే వేడి.. లాంటి ప్రకృతి శక్తులు లేకపోతే మనిషి బతకడం కష్టం. అందుకే వేదాల్లో ప్రకృతి శక్తులనే ధనమని చెప్పారు. ఆరోగ్యంగా బతకాలంటే ప్రకృతిలోని అన్ని విషయాలు సహకరించాలి. అందుకే రుషులు కూడా ప్రకృతిలోని అంశాలనే ధనంగా భావించమన్నారు. మనుషులు తయారుచేసుకున్న డబ్బు అవసరాలు తీర్చుకోవడానికి, సుఖంగా బతకడానికి ఉపయోగపడుతుంది. ప్రకృతి సహకరించకపోతే ఎంత డబ్బు ఉన్నా ఏమీ చేయలేరు. శ్రీ సూక్తంలో కూడా మనిషి ఆయురారోగ్యాలతో బతకడానికి ప్రకృతిలోని సహజశక్తులే కారణమని, వాటినే ధనంగా భావించాలని ఉంది.  ప్రకృతిని మించిన ధనం లేదు. ఆ ధనాన్ని మర్చిపోతే విపత్తులు సంభవిస్తాయి. మానవుల్ని సర్వనాశనం చేస్తుంది. అందుకే, ప్రకృతిని వాడుకోవడమే కాదు, కాపాడుకోవాలని చెప్పడానికే ప్రకృతి శక్తులను ధనంగా భావించాలని చెప్పాయి ఆధ్యాత్మిక గ్రంథాలు. ఈ విషయాన్ని మర్చిపోయి  ప్రకృతిని అభివృద్ధి పేరుతో నాశనం చేస్తున్నారు. ప్రకృతిని కాదని మనుషులు, తాము తయారుచేసుకున్న నోట్లు, నాణేలతో సంతోషంగా బతకుతారా?

ఎవరూ దోచుకోలేరు

ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే అని అనుకోకూడదు. డబ్బు వస్తుంది.. పోతుంది. అంతేకానీ తమ దగ్గరే ఉండాలనుకోవడం, మనకు మాత్రమే సొంతం అనుకోవడం స్వార్థం. డబ్బు కేవలం అవసరాలకోసం మాత్రమే. లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకరి దగ్గరే ఉండదు. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు సన్యాసం తీసుకుంటూ తన భార్యలిద్దరిని పిలిచి ‘ఏం కావాలో కోరుకో’మంటాడు. ఒక భార్య తనకు ‘ధనం కావాల’ని కోరుకుంటుంది. రెండో భార్య ‘జ్ఞానం కావాల’ని అడుగుతుంది. అందుకు యాజ్ఞవల్య్కుడు ‘జ్ఞానమే నిజమైన ధనం’ అని చెప్తాడు. ‘మనిషి ఎంత సంపాదించినా, ఎన్ని సుఖాలు కోరుకున్నా చివరకు సంతోషంగా ఉండాలనుకుంటాడు. సంతోషం అనేది కేవలం జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది. ‘నాది, నేను, నా డబ్బు, నా వాళ్లు’ అనుకున్నంత కాలం ప్రశాంతత ఉండదు. అలాంటి అహం హద్దులు దాటితే మనిషి పూర్తిగా స్వార్థపరుడైపోతాడు. నిజమైన జ్ఞానం అంటే ధనం సంపాదించడం కాదు. ఎవరూ దోచుకోవడానికి వీలులేని జ్ఞానాన్ని సంపాదించడమే’ అని చెప్తాడు. అందుకే జ్ఞానమే నిజమైన ధనం.

ఎక్కువైనా కష్టమే..

పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ధనానికి ప్రధాన దేవత. ఆమె పుట్టుక గురించిన ఓ కథ ఉంది.  దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతారు. అందుకు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే పామును తాడుగా చేసుకుంటారు. విష్ణుమూర్తి మందర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా ఉండేందుకు తాబేలు రూపంలో ఆ పర్వతం కింద ఉంటాడు. పాలసముద్రంలోంచి అనేక జీవులు, వస్తువులతోపాటు లక్ష్మీదేవి కూడా పుడుతుంది. ఆమెను విష్ణుమూర్తి భార్యగా స్వీకరిస్తాడు. పాలు అవసరమైన వరకు తాగితే ఆరోగ్యం, అంతకు మించి తాగితే అనారోగ్యం. అలాగే ధనం కూడా అవసరమైన వరకు ఉంటే మంచిదే. అంతకు మించి సంపాదించి కూడబెడితే కష్టాలు వస్తాయి.

మంచి గుణాలుంటేనే..

డబ్బు సంపాదిస్తే సరిపోదు. దాన్ని కాపాడుకునే తెలివితేటలు ఉండాలి. చాలామంది కోట్లు సంపాదించినా, అవి వాళ్ల దగ్గర ఉండవు. చెడు అలవాట్లు, అతిగా దానధర్మాలు చేయడం, గొప్పలకు పోయి ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల సంపాదించిందంతా పోగొట్టుకుంటారు. మహాభారతంలో ధృతరాష్ట్రుడితో దుర్యోధనుడు ‘పాండవులు ఎలా సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో తులతూగుతున్నార’ని అడుగుతాడు. అందుకు ధృతరాష్ట్రుడు ‘వాళ్లు నీతినియమాలతో బతుకుతారు అందుకే వాళ్లు ఎన్ని కష్టాల్లో ఉన్నా, లక్ష్మీదేవి వాళ్లను ఏదో ఒకవిధంగా కాపాడుతూనే ఉంటుంది’ అని చెప్తాడు. అలాగే ఇంద్రుడు సంతోషంగా ఎలా బతకాలో తెలుసుకోవడానికి ప్రహ్లాదుడి దగ్గర శిష్యుడిగా చేరతాడు. అతడి సేవలకు మెచ్చి ప్రహ్లాదుడు  ‘సంతోషంగా ఉండాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు మంచి ప్రవర్తన గలవాళ్ల దగ్గరే ఉంటుంద’ని చెప్తాడు. ‘నాకూ అలాంటి ప్రవర్తన కావాల’ని ఇంద్రుడు అడగుతాడు. ప్రహ్లాదుడు వరం ఇస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడిలోని నీతి నియమాలు, ధర్మం, నైతిక ప్రవర్తన, నిజం, అధికారం.. లాంటివన్నీ జ్యోతుల రూపంలో ఇంద్రుడిలోకి వెళ్తాయి. చివరిగా వాటన్నింటితో ముడిపడిన లక్ష్మీదేవి ‘అవన్నీ లేని చోట నేను ఉండను. కాబట్టి నేను కూడా ఇంద్రుడి దగ్గరకు వెళ్తున్నాన’ని చెప్తుంది. అంటే దీనర్థం.. ధర్మం, నీతి, అధికారం, మంచి ప్రవర్తన ఉన్న వాళ్ల దగ్గరే డబ్బు ఉంటుంది.

అదుపులో పెట్టినవాడే దేవుడు

‘మనిషే ధనాన్ని తయారుచేశాడు. కానీ తనకు తెలియకుండానే ధనానికి దాసుడయ్యాడు. ధనాన్ని అదుపులో పెట్టుకున్నవాడే ధనవంతుడు, గుణవంతుడు, భగవంతుడు’ అని ప్రముఖ కవి ఆరుద్ర ‘లక్ష్మీకటాక్షం’ సినిమాలోని ఓ పాటలో చెప్పాడు. ఈ వాక్యాలు ఆధ్యాత్మిక భావనలో ధనానికి సంబంధించిన మూల సూత్రాన్ని వివరిస్తాయి. డబ్బు లేనివాళ్లను ఎందుకూ పనికిరాని వాళ్లుగా చూస్తుంది సమాజం. ఎంత తెలివి ఉన్నా డబ్బు లేకపోతే ఎవరూ పట్టించుకోరు. అందుకని, ధనం సంపాదించాలి. దాని వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పొందాలి. ఇంటి బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి. అవసరమైతే ఇతరులకు చేతనైన సాయం చేయాలి. అలాగే ఆకలేసినప్పుడు ఎంత తినాలో అంతే తినాలి. తక్కువ తిన్నా, ఎక్కువ తిన్నా ఆరోగ్యం చెడిపోతుంది. ధనం కూడా అలాంటిదే. ఎక్కువగా కూడబెడుతూ పోతే.. దాని వల్ల వాళ్లు సుఖపడలేరు. చివరకు మరొకరి సొంతం అవుతుంది. ఎక్కువగా దాచిపెట్టి, లోభిలా ప్రవర్తిస్తే ఎవరికీ ఆ డబ్బు వల్ల ప్రయోజనం ఉండదు. అందుకే ఎక్కువగా సంపాదించాలి, కూడబెట్టాలి.. అనే  అత్యాశను అదుపులో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న వాళ్లే సంతోషంగా ఉంటారు.

 

Latest Updates