కరోనా టైంలో పెరిగిన పూనావాలా సంపద

  • ఫుల్‌ గా పెరిగిన సంపద
  •  85వ స్థానం నుంచి 57వ స్థానానికి జంప్
  •  ఇండియన్లలో టాప్‌‌లో ముకేశ్
  • హురున్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడి

వ్యాక్సిన్ కింగ్ సైరస్ పూనావాలా సంపద ఈ కరోనా మహమ్మారి కాలంలో బాగా పెరిగింది. ఇండియన్ బిలీనియర్స్‌ లో ఈయన సంపద ఫుల్‌‌గా పెరిగినట్టు హురున్ రీసెర్చ్ తెలిపింది. ఈయన కంపెనీ సెరమ్‌‌ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాపారాలు చాలా బలంగా ఉండటంతో, కరోనా ధాటిని కూడా తట్టుకుని సంపదను పెంచుకోగలిగారని హురున్ రీసెర్చ్ తెలిపింది. పూనావాలా మే 31 నాటికి ప్రపంచంలో అత్యంత ధనికుల్లో 85వ స్థానం నుంచి 57వ స్థానానికి ఎగబాకారు. కరోనా మహమ్మారి ఉన్న ఈ నాలుగు నెలల కాలంలో ఆయన నికర సంపద 25 శాతానికి పైగా పెరిగినట్టు హురున్ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. పుణేకు చెందిన సెరమ్ ఇన్‌‌స్టిట్యూట్, మార్కెట్‌‌లో లిస్ట్ కాలేదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ మాన్యుఫాక్చరర్‌‌‌‌గా ఉంది. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్, మాన్యుఫాక్చరింగ్‌‌తో ఆయన నెట్‌‌వర్త్ బాగా పెరిగింది. ఇటీవలే సెరమ్ ఇన్‌‌స్టిట్యూట్ ఆస్ట్రా జెనికాతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ కింద ఆక్స్‌‌ఫోర్డ్ యూనివర్సిటీ డెవలప్‌‌ చేసిన వంద కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్‌‌లను ఇది తయారు చేయాల్సి ఉంది.

మరోవైపు దేశంలో అత్యంత ధనికుడిగా పేరు తెచ్చుకున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన స్థానాన్ని కొనసాగిస్తున్నారు. కరోనా మహమ్మారితో తొలి రెండు నెలలు సంపద బాగా పడిపోయినా.. తర్వాత రెండు నెలలు మాత్రం ముకేశ్ సంపద 18 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆయన టెలికాం కంపెనీ జియో ప్లాట్‌‌ఫామ్స్‌‌లో వాటాలు అమ్మడం ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌కు రూ.1.69 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడుల వరదతో ముకేశ్ సంపద దూసుకుపోయింది. అయినప్పటికీ, మొత్తంగా ఆయన సంపద ప్రీ కరోనా స్థాయిల కంటే 1 శాతం తగ్గినట్టు హురున్ రీసెర్చ్ రిపోర్ట్‌‌లో తేలింది. ముకేశ్ తన సంపదలో ‘వీ–సేప్ రికవరీని’ పొందారు. తొలి రెండు నెలలు ఫుల్‌‌గా లాస్ అయితే, ఆ తర్వాత రెండు నెలలు బాగా సంపదను పెంచుకున్నట్టు హురున్ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. ఆయన నికర సంపద స్వల్పంగా తగ్గినప్పటికీ, అంబానీ ప్రపంచ ధనికుల్లో ఎనిమిదో స్థానానికి ఎగబాకినట్టు హురున్ రీసెర్చ్ రిపోర్ట్ చెప్పింది.

వరల్డ్ ‌లో బెజోస్ టాప్ ప్లేస్….

ప్రపంచపు టాప్ 100 ధనికుల లిస్ట్‌‌లో జెఫ్ బెజోస్ టాప్‌‌ ప్లేస్‌‌లో ఉన్నారు. ఈయన సంపద ఈ నాలుగు నెలల కాలంలో 14 శాతం పెరిగి 160 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన తర్వాత బిల్‌‌గేట్స్ 100 బిలియన్ డాలర్లతో(6 శాతం డౌన్) రెండో స్థానంలో, బెర్నార్డ్ అర్నాల్ట్ 89 బిలియన్ డాలర్లతో(17 శాతం డౌన్)తో మూడో స్థానంలో ఉన్నారు.

ఇతర ఇండియన్ బిలీనియర్లకు తగ్గిన సంపద…

ఇతర ఇండియన్ బిలీనియర్లతో పోలిస్తే.. అంబానీ సంపద చాలా తక్కువగా తగ్గినట్టు హురున్ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. టాప్ 100 లిస్ట్‌‌లోని ఇతర బిలీనియర్స్ హెచ్‌‌సీఎల్‌‌ శివ్ నాడార్‌‌‌‌ సంపద 16 శాతం, గౌతమ్ అదానీ, ఆయన ఫ్యామిలీ సంపద 18 శాతం తగ్గిపోయినట్టు పేర్కొంది. అంబానీ, పూనావాలా, అదానీ, నాడార్‌‌‌‌లు కాకుండా.. మిగిలిన వారెవరూ టాప్ 100 లిస్ట్‌‌లో లేరు. కరోనా వైరస్ కాలంలో రంగాల వారీగా చూసుకుంటే, బిగ్గెస్ట్ విన్నర్లుగా ఆన్‌‌లైన్ రిటైలర్స్, ఫార్మా, హోమ్ ఇంప్రూవ్‌‌మెంట్ రిటైలర్లు, పోర్క్ ప్రొడ్యూసర్లు, సోయా సాస్‌‌ తయారీదారులు నిలిచారు. టాప్ 100 వెల్త్ ఓనర్లలో అమెరికా, చైనాలు స్వల్పంగా లాభపడ్డాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్  ఈ మహమ్మారి కాలంలో 20 శాతం వరకు తగ్గిపోయింది. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే మార్కెట్ కోలుకుంటోంది. రూపాయి వాల్యు 5.6 శాతం పడిపోయినట్టు హురున్ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది.

Latest Updates