ఆబ్కారీకి ఆయుధం

  • ఇక సివిల్‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌ మాదిరే ఎక్సైజ్‌‌‌‌ డిపార్ట్​మెంట్
  • ఆబ్కారీ పోలీసులకూ వెపన్స్‌‌‌‌, వెహికిల్స్‌

హైదరాబాద్‌ , వెలుగు: ఆబ్కారీ శాఖను పాలనాపరంగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సర్కిళ్ల పరిధిని సర్దుబాటు చేసి అన్ని స్టేషన్లకు సమాన పని ఉండేలా చూడాలని భావిస్తోంది. అధికారుల విధుల నిర్వహణ సహా బదిలీల సమయంలో రాజకీయ ఒత్తిళ్లు తగ్గించాలని చూస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎక్సైజ్‌‌‌‌ స్టేషన్లను  ఆధునీకరించడంతో పాటు కొత్త వాటిని నిర్మించనున్నారు. సాధారణ పోలీసులతో పాటు ఎక్సైజ్‌‌‌‌ పోలీసులకు కూడా ఆయుధాలు, ప్రత్యేక వాహనాలు ఇవ్వనున్నారు. ప్రతీ స్టేషన్‌ కు ప్రస్తుతమున్న అలవెన్స్‌ పెంచనున్నారు. ఇందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇక అన్నీ సొంత భవనాలే..
రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు, దాదాపు 800 బార్లు, క్లబ్‌ లున్నాయి. వాటన్నింటికీ కలిపి
139 ఎక్సైజ్‌‌‌‌ స్టేషన్లు ఉన్నాయి. వాటిలో కేవలం ఆరు స్టేషన్లే సొంత భవనాలు. మిగతా 133 స్టేషన్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వాటిలోనూ చాలా వరకు అధ్వానంగా ఉన్నాయి. సొంత భవనాల కోసం గతేడాది రూ.30 కోట్లు మంజూరు చేసినా స్థలాల కేటాయింపులో జాప్యం వల్ల ఇంకా ప్రారంభం కాలేదు. ఉమ్మడి జిల్లాల ఉప కమిషనర్లు, ఆయా జిల్లాల కలెక్టర్లను కలిసి స్థల సేకరణను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పుడున్న భవనాలను ఆధునీకరించడంతో పాటు అన్ని స్టేషన్లను సొంత భవనాల్లోకి తీసుకురానున్నారు. స్టేషన్ల నిర్వహణకు ప్రస్తుతం ఇస్తున్న రూ.20 వేల అలవెన్సును పెంచనున్నట్టు తెలుస్తోంది. సివిల్​ పోలీస్​స్టేషన్​కు ఇచ్చినన్ని నిధులనే ఇచ్చేందుకు నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.

వెపన్స్‌‌‌‌పై ప్రతిపాదనలు రెడీ
ఆబ్కారీ పోలీసులకూ ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. చాలా సందర్భాల్లో ఎక్సైజ్‌‌‌‌ పోలీసుల వద్ద ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో, గుడుంబా తయారీదారులపై దాడులు చేసినప్పుడు,
సరిహద్దు ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీసులపై దాడులు జరుగుతున్నట్టు ఇటీవల జరిగిన ఎక్సైజ్ కార్యాచరణ సమావేశంలో అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎక్సైజ్‌‌‌‌ అధికారులకూ ఆయుధాలిచ్చే విషయంపై సర్కారు సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది. సివిల్ పోలీసుల్లాగే వాళ్లకూ వాహనాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు ప్రతిపాదనలు కూడా రెడీ అయినట్టు చెబుతున్నారు.

Latest Updates