పెళ్లిలో విషాదం: మందు తాగి ఇద్దరు మృతి

కల్తీ మద్యం వల్ల వివాహ వేడుక విషాదంగా మారింది. పెళ్లికి వచ్చిన ఇద్దరు బంధువులు లిక్కర్ తాగిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు సంబరంగా ఉన్న కల్యాణ వేదిక ఒక్కసారిగా వెలవెలబోయింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నాగాలా చతుర్భానుపూర్ ప్రాంతంలో జరిగింది.

సోమవారం ఉదయం పెళ్లి జరుగుతుండగా బంధువులంతా సంతోషంగా గడుపుతున్నారు. ధూమ్ ధామ్‌గా చుట్టాలంతా మందు తాగుతూ జల్సా చేస్తున్నారు. వివాహం ముగిశాక అందరూ భోజనాలకు వెళ్లారు. విందు భోజనం చేశాక ఇద్దరికి వాంతులు మొదలయ్యాయి. వాళ్లని బంధువులు వెంటనే హాస్పిటల్‌కి తరలించగా.. అప్పటికే వారిద్దరూ మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే పెళ్లి వేడుకలో చాలా మంది లిక్కర్ తాగారని, వారెవరికీ ఏమీ కాలేదని తెలిపారు ఎస్పీ యమునా ప్రసాద్. ఆ ఇద్దరు మరణించడానికి కారణం వాళ్లు బయట కల్తీ మద్యం కొనుక్కొని తాగడమేనని అనుమానిస్తున్నామన్నారు. వారి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపామని, రిపోర్ట్ వస్తేగానీ అసలు కారణం తెలియదని అన్నారు. అయితే పెళ్లికొడుకు బంధువులైన టౌకీ సింగ్ అనే వ్యక్తి కూడా ఆ ఇద్దరు పెళ్లిలో మందు తాగలేదని, స్థానికంగా ఉన్న షాపులో కల్తీ మద్యం అమ్ముతున్నారని, దాని వల్లే వారు మరణించి ఉండొచ్చని చెప్పారు.

Latest Updates