సిటీ పోలీసులకు.. స్వీట్ న్యూస్

వీక్లీ ఆఫ్​కి లైన్ క్లియర్

వారం రోజుల్లో అమలు

ఖుషీ ఖుషీగా

వారం రోజుల్లో అమలు

హైదరాబాద్, వెలుగు: సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీక్లీ ఆఫ్ అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీక్లీ ఆఫ్ ను అమలు చేస్తామని గతంలో పోలీస్ కుటుంబాలకు సీపీ అంజనీకుమార్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తను ఇచ్చిన హామీ ప్రకారం కమిషనరేట్ పరిధిలోని ఉద్యోగులందరికీ వీక్లీ ఆఫ్ ఇస్తామని సీపీ స్పష్టం చేశారు. ఈ నెల 11 నుంచి 23(ఆదివారం) వరకు సెలవులపై వెళ్లిన హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సోమవారం తిరిగి రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేసిన వెంటనే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రధానంగా సిబ్బంది వీక్లీ ఆఫ్ గురించి అధికారులతో చర్చించారు. ఐదు జోన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు…వాళ్ళందరికీ వీక్లీ ఆఫ్ సాధ్యాసాధ్యాలపై సూచనలు జారీ చేశారు. మరో వారం రోజుల్లో ప్రక్రియ పూరి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పాటు వర్షాలకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలపై సమీక్షించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా లా అండ్ ఆర్డర్, -ట్రాఫిక్ పోలీసులు కలిసి పనిచేయాలని సూచించారు. సిటీలో నమోదవుతున్న మిస్సింగ్ కేసులు, పారదర్శకమైన దర్యాప్తు, డ్రగ్స్, గంజాయి ముఠాలపై నిఘా పెట్టాలని ఆదేశించారు. మూడు గంటల పాటు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో డీసీపీ, ఏసీపీలకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సమీక్షలో సీపీ అంజనీకుమార్ తో పాటు అదనపు సీపీ ట్రాఫిక్ అనిల్ కుమార్, జాయింట్​సీపీ, స్పెషల్ బ్రాంచ్ తరుణ్ జోషి పాల్గొన్నారు.

నేను మాట ఇచ్చా..
‘‘ నేను మా సిబ్బంది కుటుంబాలకు మాట ఇచ్చాను. వీక్లీ ఆఫ్ ను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పోలీస్ ఫ్యామిలీస్ కోరిక నెరవేరబోతోంది. వారం రోజుల లోపు వీక్లీ ఆఫ్ ను అమలు చేస్తాం. అందుకు సంబందించిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నాం. దీంతో పోలీసుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది’’  -అంజనీకుమార్, సీపీ

Latest Updates