బరువు తగ్గాలనుకునే వారికి ఇన్‌స్పిరేషన్: 5 నెలల్లో 30 కిలోలు కరిగించాడు!

ఓవర్ వెయిట్.. కూర్చుంటే లేవలేరు. లేస్తే కూర్చోలేరు. వాళ్ల శరీరమే వారికి బరువు అనుపిస్తుంటుంది కొందరికి. స్థూలకాయం వల్ల కీళ్ల నొప్పులు, షుగర్, ఇంకా చాలా లైఫ్ స్టైల్ డిసీజెస్ చిన్న వయసులోనే వచ్చేస్తుంటాయి. రోగాల పోడు కాక.. మోటూ, బండ అంటూ ఫ్రెండ్స్, తెలిసినోళ్లు, తెలియనోళ్లు అనే మాటల పోటు తట్టుకోలేక కుమిలిపోతుంటారు చాలా మంది. ఎలాగైనా బరువు తగ్గాలని నానా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ సాధ్యం కాక తలలు పట్టుకుంటుంటారు. అలాంటి వారందరికీ ఈ కుర్రాడు ఒక ఇన్‌స్పిరేషన్ అనే చెప్పారు. కేవలం 5 నెలల టైమ్‌లో 30 కిలోల బరువు తగ్గాడు. ‘రొటీన్ లైఫ్ స్టైల్‌లో పెద్దగా మార్పులేమీ చేయలేదు. కానీ రోజూ కనీసం 20 వేల అడుగులు నడిచి కొంచెం డైట్‌లో మార్పులు చేశా అంతే’ అని తెలిగ్గా చెప్పేస్తున్నాడతను.

చెన్నైలో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న 25 ఏళ్ల కుర్రాడు నరసింహన్ 5 నెలల క్రితం 115 కిలోల బరువు ఉండేవాడు. ప్రస్తుతం అతడి బరువు 85 కిలోలు. తన తోటి వారి సూటిపోటి మాటలే తనలో బరువు తగ్గాలన్న కసి పెంచాయంటున్నాడు ఈ యువ ఇంజినీర్. 5.11 ఫీట్ ఎత్తు ఉన్న తనకు భారీ శరీరంతో ఎటు వెళ్లాలన్న ఇబ్బందిగా అనిపించేదని, తన నడక చూసి కొలీగ్స్ ఎగతాళి చేసేవారన్నడు. ‘స్నేహితులే పది మందిలో సెటైర్లు వేయడం, ఆర్టీసీ బస్సుల్లో సీటులో కూర్చోవడం ఇబ్బందిగా అనిపించడం వంటివి నాలో ఆలోచన పెంచాయి. ఆ మాటలతో విసిగిపోయి ఎలాగైనా బరువు తగ్గాలని ఫిక్స్ అయ్యా’ అని అతడు తెలిపాడు.

ఫాలో అయిన డైట్

  • ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా మూడు బ్రెడ్ స్లైస్‌లు, రెండు ఉడకబెట్టిన గుడ్లు (లోపలి పసుపు సొన తీసేసి).
  • మధ్యాహ్నం కొంచెం రైస్‌తో భోజనం, ఆ తర్వాత పచ్చికూరగాలు తినడం.
  • రాత్రికి రోజూ రెండు చపాతీ లేదా ఓట్స్ మాత్రమే తినేవాడినని నరసింహన్ చెప్పాడు.
    నెలలో ఒకసారి మాత్రమే బిర్యానీ ఇష్టంగా తినేవాడినంటున్నాడు.
  • రెగ్యులర్ టీ, కాఫీలు, జంక్ ఫుడ్ పూర్తిగా బంద్. రోజులో ఒకసారి గ్రీన్ టీ, ఫ్రూట్ సాలడ్.

వ్యాయామం ఇలా..

‘ప్రతి రోజూ ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి వ్యాయామం మొదలు. ట్రెడ్‌మిల్, సైక్లింగ్ చేసేవాడిని. రాత్రి త్వరగా భోజనం పూర్తి చేసి కనీసం 2 కిలోమీటర్ల నడిచేవాడిని. మొత్తంగా ప్రతి రోజూ 20 వేల అడుగులు నడిచేలా చూసుకునేవాడిని. స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ సాయంతో ఎంత నడిచింది చెక్ చూసుకుంటూ ఉండేవాడిని. ప్రతి రోజూ ఉదయం వ్యాయామానికి ముందు కొన్ని వాల్‌నట్స్, బాదం పప్పులు తినేవాడిని. ఒక కప్పు నీళ్లలో సబ్జా గింజలు నానబెట్టి ఉంచి, వర్కౌట్ పూర్తయ్యాక తాగేసేవాడిని’ అని చెప్పాడు నరసింహన్.

ముఖ్యంగా పాటించాల్సింది ఇదే

చాలా మంది నేరుగా జిమ్ చేసేస్తే బరువు తగ్గిపోతాం అనుకుంటారు. కానీ అలా అనుకోవడం పొరబాటు. జిమ్ ఆపేసిన కొన్నాళ్లకే బాడీలో మార్పు వచ్చేస్తుంది. సో, ముందు మన లైఫ్ స్టైల్‌పై దృష్టి పెట్టాలి. ఎక్కువగా కూర్చుని ఉండేవాళ్లు మధ్య మధ్యలో నడవడం చాలా ముఖ్యం. మన బాడీ మెటబాలిజాన్ని అర్థం చేసుకోవాలి. రోజూ ఒకే టైమ్‌కి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. జంక్ ఫుడ్ పూర్తిగా వదిలేయాలి. ఎక్కువ కేలరీలు వచ్చే ఫుడ్ తగ్గించాలి. అలా అని పూర్తిగా మనం రెగ్యులర్‌గా తీసుకునే భోజనం ఆపేయకూడదు. క్వాంటిటీ తగ్గించి.. కూరగాయలు, ఫ్రూట్స్‌తో సలాడ్స్ తీసుకోవాలి. శారీరక శ్రమ ఉండేలా చూసుకుంటూ ఫిట్ అవ్వాలనే మోటివేషన్ పోకుండా చూసుకోవాలి. కొద్ది రోజులు పక్కాగా అనుకున్న డైట్, వర్కౌట్స్ ఫాలో అయిన తర్వాత విసిగిపోయి ఇక మనవల్ల కాదులే అనుకోవడమే చాలా మంది చేసే పొరబాటు. వీకెండ్స్‌లో కూడా బద్ధకంగా లైట్ తీసుకోవద్దని నరసింహన్ సలహా ఇస్తున్నాడు. కచ్చితంగా ప్రతి 15 రోజులకోసారి వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండేవాడినని చెబుతున్నాడు.

Latest Updates