హర్భజన్ ను కొడదామని హోటల్ రూమ్ కు వెళ్లా

వెటరన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్

న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ యుద్ధ రంగాన్నే తలపిస్తుందనడంలో సందేహం లేదు. గెలిస్తే ఈలలు, గోలలతో సంబురాలు చేసే అభిమానులు ఓడిపోతే సహనం కోల్పోయి అదే స్థాయిలో విమర్శలూ చేస్తుంటారనేది నిజమే. అయితే ఫ్యాన్స్ అంత కాకపోయినా కొన్ని సార్లు ప్లేయర్లు కూడా పేషెన్స్ కోల్పోతుంటారు. ఇందుకు ఉదాహరణగా పాక్ వెటరన్ పేసు గుర్రం షోయబ్ అక్తర్, ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ కు మధ్య జరిగిన గొడవను చెప్పొచ్చు. 2010లో ఏషియా కప్ లో భాగంగా దంబుల్లాలో ఇండియా, పాక్ మ్యాచ్ లో దూస్రా స్పెషలిస్ట్ భజ్జీ, రావల్పిండి ఎక్స్ ప్రెస్ అక్తర్ మధ్య గొడవ జరిగింది. దీని గురించి అక్తర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు.

‘హర్భజన్ తో గొడవ పడదామని అతడు ఉండే హోటల్ రూమ్ లో వెతికాను. లాహోర్ లో అతడు మాతోనే తిరిగాడు, భోజనం కూడా చేశాడు. మా ఇద్దరి సంప్రదాయాలు ఒకేలా ఉంటాయి. భజ్జీ పంజాబీ బ్రదర్ అయి ఉండి మాతో అలా తప్పుగా ప్రవర్తించొచ్చా? భజ్జీ గదికి వెళ్లి అతడితో గొడవపడాలని నేను భావించా. నేను వస్తున్నానని భజ్జీకి తెలుసు. కానీ నేను అతణ్ని పట్టుకోలేకపోయా. దీంతో తర్వాతి రోజు కామ్ గా ఉండిపోయా.. హర్భజన్ కూడా వచ్చి సారీ చెప్పాడు’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ ఘటనపై గతంలో భజ్జీ కూడా మాట్లాడాడు. ‘షోయబ్ ఓసారి నా గదికి వచ్చి నన్ను కొడతానని బెదిరించాడు. సరే, ఎవరు ఎవరిని కొడతారో చూద్దాం అని నేనూ బదులిచ్చా. కానీ నేను చాలా భయపడ్డా. అతడు భారీకాయుడు. ఒకసారి నన్ను, యువరాజ్ ను ఓ గదిలో అక్తర్ కొట్టాడు. భారీకాయుడు కావడంతో అతణ్ని పట్టుకోలేకపోయాం’ అని హర్భజన్ చెప్పాడు.

Latest Updates