పుష్కర స్నానాలకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో విషాదం

అలంపూర్, వెలుగు: పుష్కర స్నానాలకు వెళ్లి నీట మునిగి ఇద్దరు చిన్నారులు చనిపోయిన విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం గొందిమల్ల గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన నర్సమ్మ తన పిల్లలు మానస, మైథిలి, మధుప్రియ, అన్న కూతుళ్లు చంద్రకళ, దీక్షితతో కలిసి పుష్కర స్నానం చేసేందుకు పాతగొందిమల్ల దగ్గర ఉన్న మోర్సు ప్రాంతానికి వెళ్లారు. నర్సమ్మ బట్టలు సర్దుకుంటుండగా.. దీక్షిత, మానస, చంద్రకళ, మైథిలి నదిలోకి దిగి గల్లంతయ్యారు. గమనించిన నర్సమ్మ కేకలు వేయడంతో పొలం పనులకు వచ్చిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించారు. చంద్రకళ(11), మానస(14) ప్రాణాలతో బయటపడగా.. దీక్షిత(9), మైథిలి(11) చనిపోయారు.

కర్నూలు జిల్లాలోని అత్తారింటి నుంచి నర్సమ్మ.. పుష్కరాల కోసం పిల్లల్ని తీసుకుని సొంతూరు వచ్చిందని, ఇంతలోనే దారుణం జరిగిపోయిందని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. నదిలో గుంతలను అంచనా వేయకపోవడం వల్లే ఘోరం జరిగిందని స్థానికులు అంటున్నారు. గొందిమల్లలో పుష్కర ఘాట్ ఏర్పాటు చేయలేదని, అక్కడి కృష్ణా బ్యాక్ వాటర్​లో బట్టలు ఉతికేందుకు వెళ్లగా.. పిల్లలు ఆడుకుంటూ నదిలో పడి చనిపోయారని అలంపూర్ తహసీల్దార్ మదన్ మోహన్  చెప్పారు. అయితే పుష్కరాలలో అలంపూర్ లో పోలీసుల అంక్షలు, స్నానాలకు సౌకర్యాలు లేవని గొందిమల్ల, బుక్కాపూరం, ఉట్కూర్, లింగనవాయి  తదితర గ్రామాలకు చెందినవారు పాతగొందిమల్ల వద్ద ఉన్న మోర్సు ప్రాంతంలో పుష్కర స్నానాలు, పూజలు చేస్తూవస్తున్నారు. గొందిమల్ల శివారులో 20 ఏండ్లుగా ఎర్రమట్టి కోసం తవ్వకాలు చేపడుతున్నారని, శ్రీశైలం బ్యాక్ వాటర్ తో క్వారీలు కొన్ని మునిగి ఉండగా.. అది గమనించకుండానే పుష్కర స్నానాలకు భక్తులు నీళ్లలోకి దిగడంతో ప్రమాదాల బారిన పడుతున్నారని, అధికారులెవరూ జాగ్రత్తలు తీసుకోవట్లేదని  స్థానికులు అంటున్నారు.

 

 

Latest Updates