లక్ష ఫుట్ బాల్స్ పంపిణీ చేసిన మమత

లక్ష ఫుట్ బాల్స్ పంపిణీ చేసిన మమత
  • 25 వేల ఫుట్ బాల్ క్లబ్బులకు రూ.5 లక్షల చొప్పున నిధులు మంజూరు
  • ‘ఖేలాహోబే’ నినాదం దేశమంతా అనుసరిస్తుందని మమతా బెనర్జీ ధీమా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జి కొత్త జోష్ తో దూసుకెళ్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలన్న ఆకాంక్షతో కనిపిస్తున్న ఆమె యువతకు దగ్గరయ్యేందుకు ప్రపంచంలో నెంబర్-1 క్రీడ అయిన ఫుట్ బాల్ ను ప్రోత్సహించే దిశలో వరాలు ప్రకటించారు. కోల్‌కతాలోని నేతాజి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో స్టేజీపై నుంచి తన ఫుట్‌ బాల్‌ నైపుణ్యం ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆమె లక్ష జోయీ ఫుట్‌బాల్ లను పంపిణీ చేశారు. గత ఎన్నికల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన 'ఖేలా హోబే' కార్యక్రమాన్ని ఆమె ఇవాళ ప్రారంభించారు. 
ఆగస్టు 16న ప్రతి ఏటా ఖేలా హోబే దివస్‌ నిర్వహిస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. 1980లో ఈడెన్‌ గార్డెన్ లో జరిగిన మ్యాచ్‌లో తొక్కిసలాట జరిగి 16 మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆగస్టు 16న ఖేలా హోబే దివస్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాపులర్ అయిన  ‘ఖేలాహోబే’ నినాదాన్ని దేశమంతా అనుసరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారత దేశానికంతటికీ మార్గనిర్దేశకత్వం వహించడానికి తామెంతో గర్వపడతామన్నారు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఖేలాహోబే చాలా పాపులర్ నినాదం, ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్‌లలో కూడా ఈ నినాదం విస్తరించిందని మమతా బెనర్జీ పేర్కొన్నారు.