లెక్కసరిచేశారు..రెండో టీ20లో విండీస్ విన్

  • రెండో టీ20లో విండీస్‌ గెలుపు
  • రాణించిన సి మ్మన్స్‌,
  • దూబే శ్రమ వృథా

ధనాధన్‌‌లో ఆటలో కరీబియన్లు దంచి కొట్టారు..! తమ స్థాయి, తెగువకు ఏమాత్రం తగ్గకుండా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు..! ఫలితంగా టీమిండియా వరుస విజయాలకు ఎట్టకేలకు బ్రేక్‌‌ వేస్తూ.. రెండో టీ20లో ఘన విజయం సాధించారు..! సిమ్మన్స్​ (45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 నాటౌట్‌‌), లూయిస్‌‌ (35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40), పూరన్‌‌ (18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 నాటౌట్‌‌) గర్జన ముందు.. యంగ్‌‌ గన్‌‌ శివమ్‌‌ దూబే (30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 54)  మెరుపులు చిన్నబోయాయి..! దీంతో చేజారిందనుకున్న సిరీస్‌‌లో ఆశలు సజీవంగా నిలుపుకున్న విండీస్‌‌ లెక్క సరి చేసింది..! ఇక సిరీస్‌‌ గెలిచేదెవరో తేలాలంటే ముంబై దాకా వెళ్లాల్సిందే..!!

తిరువనంతపురం: సిరీస్‌‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌లో వెస్టిండీస్‌‌ జూలు విదిల్చింది. ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొడుతూ..  ఇండియాను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంతో పాటు టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో వీరోచిత బ్యాటింగ్‌‌ పెర్ఫామెన్స్‌‌తో అదరగొట్టింది. దీంతో ఆదివారం జరిగిన రెండో టీ20లో విండీస్‌‌ 8 వికెట్ల తేడాతో టీమిండియాపై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 1–1తో సమం చేసింది. ముందుగా బ్యాటింగ్‌‌ చేసిన ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 రన్స్‌‌ చేసింది. శివమ్‌‌ దూబే తొలి ఫిఫ్టీతో చెలరేగగా, రిషబ్‌‌ పంత్‌‌ (22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 33 నాటౌట్‌‌) ఫర్వాలేదనిపించాడు. తర్వాత వెస్టిండీస్‌‌ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసింది. సిమ్మన్స్​కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 ముంబైలో బుధవారం జరుగనుంది.

దూబే దంచాడు..

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియాకు ఓపెనర్లు రోహిత్‌‌ (15), రాహుల్‌‌ (11) శుభారంభం ఇవ్వలేదు. నాలుగో ఓవర్‌‌ తొలి బంతికి రాహుల్‌‌  స్లాగ్‌‌ స్వీప్‌‌ చేయబోయి హెట్‌‌మయర్‌‌కు చిక్కాడు. అప్పటికి టీమ్‌‌ స్కోరు 24 రన్స్‌‌. ఈ దశలో దూబే శివమెత్తాడు. ఆరంభంలో సింగిల్స్‌‌, డబుల్స్‌‌తో మెల్లగా ఆడినా.. ఎనిమిదో ఓవర్‌‌లో ఒక్కసారిగా గేర్‌‌ మార్చాడు. హోల్డర్‌‌ వేసిన ఈ ఓవర్‌‌లో వరుసగా 6, 4తో రెచ్చిపోయాడు. కానీ మూడో బాల్‌‌కు రోహిత్‌‌  ఔట్‌‌కావడంతో ఇన్నింగ్స్‌‌ తడబడింది. రెండో వికెట్‌‌కు 32 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కోహ్లీ (19) తో కలిసిన దూబే ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పొలార్డ్‌‌ వేసిన 9వ ఓవర్‌‌లో మూడు సిక్సర్లతో 26 రన్స్‌‌ రాబట్టి జోరును మరో మెట్టు ఎక్కించాడు. అదే ఊపులో విలియమ్స్‌‌ బాల్‌‌ను లెగ్‌‌సైడ్‌‌ ఫ్లిక్‌‌ చేసి సింగిల్‌‌తో కెరీర్‌‌లో తొలి హాఫ్‌‌ సెంచరీ సాధించాడు. పవర్‌‌ప్లేలో 42 రన్స్‌‌ చేసిన ఇండియా తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 93/2 స్కోరుకు చేరింది. వాల్ష్‌‌ వేసిన 11వ ఓవర్‌‌ తొలి బంతిని దూబే అంతే వేగంతో లాంగాన్‌‌లోకి లేపగా పొలార్డ్‌‌ క్యాచ్‌‌ మిస్‌‌ చేశాడు. దీనిని గ్రహించిన వాల్ష్‌‌ తర్వాతి బంతిని పూర్తి ఔట్‌‌సైడ్‌‌ సంధించాడు. షాట్‌‌ను సరిగ్గా కనెక్ట్‌‌ చేయలేకపోయిన దూబే.. కవర్స్‌‌లో హెట్‌‌మయర్‌‌ చేతికి చిక్కాడు. మూడో వికెట్‌‌కు 41 రన్స్‌‌ సమకూరడంతో ఇన్నింగ్స్‌‌ తేరుకుంది. వచ్చి రాగానే ఎక్స్‌‌ట్రా కవర్స్‌‌లో భారీ సిక్సర్‌‌ కొట్టన పంత్‌‌ ఇన్నింగ్స్‌‌ చివరి వరకు క్రీజులో ఉన్నాడు. కానీ డెత్‌‌ ఓవర్లలో దాటిగా పరుగులు చేయకపోవడంతో భారీ స్కోరు సాధ్యంకాలేదు. కోహ్లీ 14వ ఓవర్‌‌లో విలియమ్స్‌‌కు వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. పంత్‌‌తో జతకలిసిన శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (10) కాసేపు సమన్వయంతో ఆడాడు. 17వ ఓవర్‌‌లో అయ్యర్‌‌ ఔట్‌‌కాగా, చివర్లో  జడేజా (9), పంత్‌‌, సుందర్‌‌ (0) భారీ షాట్లు కొట్టలేకపోయారు.

సిమ్మన్స్​ సూపర్‌‌ .

టార్గెట్‌‌ ఛేజ్‌‌లో విండీస్‌‌ ఓపెనర్లు సిమ్మన్స్‌‌, లూయిస్‌‌ దాటిగానే ఆడారు. దీంతో తొలి నాలుగు ఓవర్లలో 23 రన్స్‌‌ వచ్చాయి. అయితే భువనేశ్వర్‌‌ వేసిన ఐదో ఓవర్‌‌లో సిమ్మన్స్‌‌ క్యాచ్‌‌ను మిడాఫ్‌‌లో సుందర్‌‌, లూయిస్‌‌ క్యాచ్‌‌ను కీపర్‌‌ పంత్‌‌ డ్రాప్‌‌ చేశారు. దీని నుంచి గట్టెక్కిన లూయిస్‌‌ తర్వాతి ఓవర్‌‌లో రెండు భారీ సిక్సర్లు బాదడంతో పవర్‌‌ప్లేలో విండీస్‌‌ 41 రన్స్‌‌ చేసింది. చహల్‌‌, సుందర్‌‌ను టార్గెట్‌‌గా చేసుకుని ఈ ఇద్దరు మూడు సిక్స్‌‌లు, ఓ ఫోర్‌‌ బాదారు. చివరకు 10వ ఓవర్‌‌లో సుందర్‌‌ బంతిని ముందుకొచ్చి ఆడబోయిన లూయిస్‌‌ లైన్‌‌ మిస్‌‌కావడంతో పంత్‌‌ స్టంపౌట్‌‌ చేశాడు. తొలి వికెట్‌‌కు 73 రన్స్‌‌ సమకూరాయి. హెట్‌‌మయర్‌‌ కూడా సిక్సర్లతో చెలరేగడంతో  పరుగుల వేగం ఎక్కడా తగ్గలేదు. రెండో వికెట్‌‌కు 39 రన్స్‌‌ జోడించిన హెట్‌‌మయర్‌‌ను.. కోహ్లీ ఓ సూపర్‌‌ క్యాచ్‌‌తో పెవిలియన్‌‌కు పంపాడు. 36 బంతుల్లో 58 రన్స్‌‌ చేయాల్సిన దశలో సిమ్మన్స్‌‌, పూరన్‌‌ దంచికొట్టారు. 15వ ఓవర్‌‌లో రెండు సిక్సర్లతో 12, తర్వాతి ఓవర్‌‌లో మూడు ఫోర్లతో 15 పరుగులు రావడంతో సమీకరణం 24 బాల్స్‌‌లో 29 రన్స్‌‌గా మారింది. 17వ ఓవర్‌‌లో పూరన్‌‌ క్యాచ్‌‌ను డ్రాప్‌‌ చేసి అయ్యర్‌‌ మూల్యం చెల్లించాడు. ఆఖరి బాల్‌‌ను సిమ్మన్స్‌‌ సిక్సర్‌‌గా మల్చితే, తర్వాత పూరన్‌‌ ఓ ఫోర్‌‌, రెండు సిక్సర్లతో మ్యాచ్‌‌ను ముగించాడు.

స్కోరు బోర్డు

ఇండియా: రోహిత్‌‌ (బి) హోల్డర్‌‌ 15, రాహుల్‌‌ (సి) హెట్‌‌మయర్‌‌ (బి) పైర్​ 11, దూబే (సి) హెట్‌‌మయర్‌‌ (బి) వాల్ష్‌‌ 54, కోహ్లీ (సి) సిమ్మన్స్‌‌ (బి) విలియమ్స్‌‌ 19, పంత్‌‌ (నాటౌట్‌‌) 33, శ్రేయస్‌‌ (సి) కింగ్‌‌ (బి) వాల్ష్‌‌ 10, జడేజా (బి) విలియమ్స్‌‌ 9, సుందర్‌‌ (సి అండ్‌‌ బి) కొట్రెల్‌‌ 0, చాహర్‌‌ (నాటౌట్‌‌) 1, ఎక్స్‌‌ట్రాలు: 18, మొత్తం: 20 ఓవర్లలో 170/7. వికెట్లపతనం: 1–24, 2–56, 3–97, 4–120, 5–144, 6–164, 7–167. బౌలింగ్‌‌: కొట్రెల్‌‌ 4–0–27–1, పైర్​  2–0–11–1, హోల్డర్‌‌ 4–0–42–1, విలియమ్స్‌‌ 4–0–30–2, పొలార్డ్‌‌ 2–0–29–0, వాల్ష్‌‌ 4–0–28–2.

వెస్టిండీస్‌‌: సిమ్మన్స్​ (నాటౌట్‌‌) 67, లూయిస్‌‌ (స్టంప్‌‌) పంత్‌‌ (బి) సుందర్‌‌ 40, హెట్‌‌మయర్‌‌ (సి) కోహ్లీ (బి) జడేజా 23, పూరన్‌‌ (నాటౌట్‌‌) 38, ఎక్స్‌‌ట్రాలు: 5, మొత్తం: 18.3 ఓవర్లలో 173/2. వికెట్లపతనం: 1–73, 2–112. బౌలింగ్‌‌: చాహర్‌‌ 3.3–0–35–0, భువనేశ్వర్‌‌ 4–0–36–0, సుందర్‌‌ 4–0–26–1, చహల్‌‌ 3–0–36–0, దూబే 2–0–18–0, జడేజా 2–022–1.

Latest Updates