భారత్ – పాక్ అణు యుద్ధం వస్తే.. ఏమవుతుంది?

వారంలోపే కల్లోలం.. కోట్లాది చావులు

ఆరేళ్లపాటు జరిగిన రెండో ప్రపంచ యుద్ధానికి మించి తీవ్రత

పర్యావరణంలోనూ ప్రళయం

సూర్య కిరణాలూ భూమిని తాకలేవు

అమెరికా పరిశోధకుల అంచనా

న్యూయార్క్: కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు ఆకాశాన్నంటాయి. త్వరలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ని కూడా స్వాధీనం చేసుకుంటాం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. కశ్మీర్ లోయను కనీవినీ ఎరుగని రీతితో అభివృద్ధి చేసి చూపిస్తాం అని చెబుతున్నారు. ఉగ్రవాదులను ఏరిపారేసి శాంతి స్థాపన చేస్తామని చెప్పారాయన.

‘కశ్మీరీల హక్కులను భారత్ హరిస్తోంది. వారి ఇష్టాలకు  వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. నిర్భందంతో హింస పెడుతోంది. కశ్మీరీల హక్కుల కోసం పాక్ పోరాడుతుంది. వారికి అండగా పోరాడుతాం. అవసరమైతే అణు యుద్ధానికైనా రెడీ’ అంటూ రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేస్తున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

పాక్ మాటలతో భారత్ సైతం పాలసీ మార్చుకుంటోంది. అవసరమైతే ముందుగా అణు దాడి చేయకూడదన్న విధానంపై ఆలోచిస్తామని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ ప్రకటించారు.

ఈ నేఫథ్యంలో భారత్, పాక్ లలోనే కాదు మొత్తం ప్రపంచమంతా హీట్ పుడుతోంది. ఈ సమయంలో భారత్ – పాక్ ల మధ్య అణు యుద్ధం వస్తే ఏంటి పరిస్థితి అని ఆందోళన చెందుతోంది.

దీనిపై అమెరికాలోని కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ, రుట్గర్స్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. దాయాది దేశాల మధ్య అణు యుద్ధం వస్తే పరిస్థితులు ఎంతటి విషమ పరిస్థితులు ఎదుర్కోవాలన్నదానిపై స్టడీ చేసి.. తమ అంచనాను ప్రపంచం ముందుంచారు. 2025 నాటికి రెండు దేశాల వద్ద కలిపి ఐదు వందలకు పైగా అణు బాంబులు ఉంటాయని అంచానా వేశారు. ఆ సమయంలో యుద్ధం జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపై పరిశోధించారు.

పరిణామాలివీ:

  • ఇప్పటికే కశ్మీర్ విషయంలో భారత్ – పాక్ మధ్య పలు యుద్ధాలు జరిగాయి. కానీ ఈ సారి అణు యుధం వస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది.
  • రెండు దేశాల దగ్గరా కలిపి కనీసం 300కి పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిని ప్రయోగిస్తే వారంలోపే ప్రపంచం ప్రళయాన్ని చూస్తుంది.
  • ఆరేళ్ల పాటు జరిగిన రెండో ప్రపంచ యుద్ధం కన్నా.. భారత్ – పాక్ మధ్య వారం పాటు అణు యుద్ధం చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. నాటి మృతుల కన్నా భారీ సంఖ్యలో 5 నుంచి 12.5 కోట్ల మంది మరణిస్తారు.
  • అణు బాంబులు పడే ప్రాంతంలోనే కాదు.. ప్రపంచం మొత్తం కల్లోలం తప్పదు. పర్యావరణ పూర్తిగా నశనం అవుతుంది. బాంబుల వల్ల 36 టన్నుల కార్బన్ వాతావరణంలోకి రిలీజ్ అయి.. కొద్ది వారాల్లోనే ప్రపంచమంతా కమ్మేస్తుంది.
  • ఆకాశాన్నంతా కర్బన వ్యర్థాలు కమ్మేస్తాయి. కొద్ది రోజులకే సూర్య కిరణాలు కూడా భూమిని తేకలేని పరిస్థతి ఏర్పడుతుంది. 35 శాతం వరకు భూమిపైకి వచ్చే సూర్యకాంతి తగ్గుతుంది. క్రమంగా భూమి ఉపరితలం 5 డిగ్రీల సెల్సియస్  చల్లబడుతుంది.
  • దాదాపు 30 శాతం వర్షాలు తగ్గిపోతాయి.
  • మొత్తంగా అణు యుద్ధం ప్రభావం నుంచి ప్రపంచం బయట పడడానికి పదేళ్లకు పైగా పడుతుంది.
  • ప్రపంచంలో ఏ దేశమూ అణు బాంబులను వాడకపోవడం మంచిదని ఈ అధ్యయనం తేల్చింది. అది జరగకూడదంటూ అన్ని దేశాలూ వాటి దగ్గరున్న అణు బాంబులను నిర్వీర్యం చేసేయాలని సూచించింది.

Latest Updates