కమిటీని కించపరుస్తారా?.. రైతు సంఘాలపై సుప్రీం సీరియస్

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల సమస్యను పరిష్కరించడం కోసం సుప్రీం కోర్టు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీకి వ్యతిరేకంగా పలు రైతు సంఘాల నేతలు, విపక్ష నాయకులు కామెంట్లు చేస్తున్నారు. కమిటీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అత్యున్నత ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీలో నియమించిన వ్యక్తుల విషయంలో తమకు ఎలాంటి ప్రత్యేక ఆసక్తులు లేవని స్పష్టం చేసింది. రాజ్యాంగాన్ని కాదని తాము ఏమీ చేయలేదని తెలిపింది. ఆ కమిటీకి ఎలాంటి ప్రత్యేక అధికారాలు ఇవ్వలేదని, వాళ్లు సుప్రీంకు అన్ని విషయాలను రిపోర్టు చేస్తారని పేర్కొంది.

ఈ విషయంలో పక్షపాతానికి చోటులేదని, ఎవరికైనా ఆ కమిటీ ముందు హాజరవ్వాలని లేకపోతే రావొద్దని కానీ కమిటీని కించపరిస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించింది. సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీలో భూపీందర్ సింగ్ మాన్, ప్రమోద్ కుమార్, అశోక్ గులాటి, అనిల్ ఘన్వత్ ఉన్నారు. అయితే ఈ కమిటీని కొందరు రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. వీరంతా ప్రభుత్వానికి అనుకూల వ్యక్తులని, సాగు చట్టాలను సమర్థిస్తూ గతంలో ఆర్టికల్స్ రాశారని ఆరోపించారు. అలాంటి కమిటీ ముందు తాము హాజరు కాబోమని తేల్చి చెప్పారు. అయితే కమిటీపై వస్తున్న విమర్శలపై చీఫ్ జస్టిస్ ఎస్‌‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సీరియస్ అయ్యింది.

Latest Updates