ఇండియా ఎక్కడుంది?: గూగుల్‌లో వెతుకుతున్న అమెరికన్స్

భారత్‌ పర్యటనకు రావడం అద్భుతం.. మీ దేశమంటే అమెరికన్లకు ఎంతో అభిమానం.. మిమ్మల్ని మేం ప్రేమిస్తున్నాం అంటూ చాలా గొప్పగా చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ‘ఇండియా గ్రేట్’ అని చెబుతూ మన పండుగలు, సినిమాలు మొదలు మనం అభిమానించే, ఆరాధించే అన్ని విషయాల గురించి మోతెరా స్టేడియంలో నిన్న (సోమవారం) ప్రసంగించారాయన. మత సామరస్యం గురించి గొప్పగా చెప్పారు. వివేకానందుడిని గుర్తు చేస్తూ విశ్వమానవుడిలా ప్రతి ఒక్కరిలోనూ దేవుడిని చూడాలని అన్నారు. ‘మీ ప్రధాని మోడీ నా బెస్ట్ ఫ్రెండ్’ అంటూ ఆయన చాయ్ వాలా నుంచి ప్రధాని దాకా ఎదగడం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి అని, ఆయనో టఫ్ మ్యాన్ అని పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే  ట్రంప్ ఇక్కడ భారత్‌ను ఆకాశానికి ఎత్తేస్తుంటే.. అమెరికన్లు గూగుల్‌లో సెర్చ్ చేసిన ట్రెడింగ్ కీవార్డ్స్ కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి.  అమెరికాలో దాదాపు ప్రతి సిటీలోనూ ఇండియన్స్ ఉన్నారు. ఆ దేశానికి చెందిన దిగ్గజ కంపెనీలకు మనోళ్లు సీఈవోలుగా ఉండి లీడ్ చేస్తున్నారు. అయినా ఇండియా ఎక్కడుంది? ఇండియా అంటే ఏంటి అని తెలియనట్లుగా ట్రంప్ పర్యటన సందర్భంగా అమెరికన్స్ గూగుల్‌లో వెతకడం గమనార్హం.

"What is India" and "Where is India": Americans search on Google as Donald Trump visits country

గూగుల్‌లో వెతుకులాట

నిన్నంతా ఇంత గ్రాండ్‌గా ట్రంప్ ఈవెంట్స్‌ను జరుగుతుంటే ఇండియన్స్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం భారత్‌ వైపు ఆసక్తికరంగా చూశాయి. అమెరికాలోనూ ఇంట్రెస్ట్ నెలకొంది. కానీ, యూఎస్‌లోని చాలా రాష్ట్రాల వాళ్లు విచిత్రంగా అసలు ‘భారత్ ఎక్కడుంది?’, ‘భారత్ అంటే ఏంటి?’ అని గూగుల్‌లో వెతుకుతున్నారు. నిన్నటి గూగుల్ ట్రెండ్స్‌ పరిశీలిస్తే ఈ విషయం బయటపడింది. ఇండియానా, న్యూజెర్సీల్లో ఉన్న అమెరికన్స్ అత్యధికంగా “Where is India” అనే కీవార్డ్‌తో సెర్చ్ చేశారు. భారత్ ఎక్కడుందని వెతికిన స్టేట్స్‌లో ఇవి ఒకటి, రెండు స్థానాల్లో ఉండగా.. ఓక్లహోమా, సౌత్ డకోటా, కన్సాస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇక “What is India” అని వెతికిన స్టేట్స్‌లో న్యూజెర్సీ తొలిస్థానంలో, ఇండియానా రెండో స్థానంలో ఉన్నాయి. జార్జియా, కాలిఫోర్నియా, కనెక్టికట్ వాటి తర్వాతి ప్లేస్‌లలో భారత్ అంటే ఎంటో తెలసుకుకోవడానికి సెర్చ్ చేశారు.

"What is India" and "Where is India": Americans search on Google as Donald Trump visits country

గ్రాండ్ వెల్‌కం.. స్పెషల్ ఆతిథ్యంతో మధురమైన వీడ్కోలు

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మూడేళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. నిన్న (సోమవారం) తొలి రోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అగ్రరాజ్యాధినేతకు దాదాపు లక్ష మందికి పైగా రోడ్డు వెంట నిలబడి అదిరిపోయే గ్రాండ్ వెల్‌కం చెప్పారు. ఎయిర్‌పోర్టు నుంచి మోతెరా స్టేడియం వరకు భారీ రోడ్ షో సాగింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన మోతెరా గ్రౌండ్‌లో లక్షా 25 వేల మందికి పైగా జనం ‘నమస్తే ట్రంప్’ అంటూ స్వాగతం పలికారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా సహా అతిరథ మహారథులతో కొలువుదీరిన ఆ భారీ బహిరంగ సభలో ప్రసంగం తర్వాత ట్రంప్ ఆగ్రా వెళ్లారు. తాజ్‌మహల్‌ను సందర్శించి ట్రంప్, మెలనియా జంట, ఇవాంకా, కుష్నర్‌ల జంట సుమారు గంటపైగా ఆ ప్రేమ సౌధం దగ్గర విహరించారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిన ట్రంప్‌ మంగళవారం పలు అధికారిక కార్యక్రమాలు చూసుకున్నారు. ఇవాళ రాత్రి 10 గంటలకు అమెరికా తిరుగు ప్రయాణం అవుతున్న ఆయనకు వీడ్కోలు చెప్పే ముందు.. రాష్ట్రపతి భవన్‌లో బోలెడన్ని వెరైటీస్‌తో మధురమైన విందు ఏర్పాటు చేసింది భారత్.

Latest Updates