ఒలింపిక్స్ జరగకపోతే.. వాట్‌ ఈజ్‌ ప్లాన్‌-బి?

టోక్యో :  ‘ఒలింపిక్స్‌‌‌‌కు ఉన్న శాపం వల్లే ప్రతీ 40 ఏళ్లకు ఓసారి ఇలాంటి పరిస్థితి వస్తోంది’ జపాన్‌‌‌‌ ఆర్థిక మంత్రి టారో  ఏసో చేసిన వ్యాఖ్యలివి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఈ మాటల్లో నిజం ఉందనే అనిపిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం వల్ల 1940 ఒలింపిక్స్‌‌‌‌ రద్దు అవ్వగా.. 1980 మాస్కో ఒలింపిక్స్‌‌‌‌ను బాయ్‌‌‌‌కాట్‌‌‌‌ చేశారు. కరోనా దెబ్బకు ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌‌‌‌ పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే మారింది. ప్రపంచమంతా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ దిశగా అడుగులు వేస్తున్న వేళ టోక్యో ఒలింపిక్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ నిర్వాహకులు మెట్టు దిగినట్లు సమాచారం. అథ్లెట్లు, స్పోర్ట్స్‌‌‌‌ అసోసియేషన్ల నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గిన ఇంటర్నేషనల్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ కమిటీ(ఐఓసీ) తదుపరి చర్యలపై దృష్టి సారించింది. షెడ్యూల్‌‌‌‌ ప్రకారం గేమ్స్‌‌‌‌ నిర్వహించలేకపోతే తర్వాత ప్లాన్‌‌‌‌ ఏంటనే దానిపై  కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలిసింది. కానీ  ఆతిథ్య దేశం జపాన్‌‌‌‌ మాత్రం ఒలింపిక్స్‌‌‌‌ నిర్వహణ విషయంలో పట్టు విడవడం లేదు. ఒలింపిక్స్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ ప్రకారమే జరిగి తీరుతాయని జపాన్‌‌‌‌ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికీ కచ్చితంగా చెబుతున్నారు. గేమ్స్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌లో ఎలాంటి మార్పులు జరిగినా జపాన్‌‌‌‌ భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావడమే వారి పట్టుదలకు కారణం.  అలాగని ఆతిథ్య దేశాన్ని కాదని గేమ్స్‌‌‌‌ను ఎక్కువ కాలం వేయిదా వేస్తే అథ్లెట్లకు, స్పాన్సర్లకు సమస్యలు తప్పవు. ఈ క్షిష్ట పరిస్థితిని ఐఓసీ ఎలా అధిగమిస్తుందో చూడాల్సి ఉంది.

ఏం చేస్తే బెటర్‌‌‌‌ ?

టోక్యో ఒలింపిక్స్‌‌‌‌పై అధికారిక ప్రకటనలు లేకపోయినా.. బయటికొస్తున్న లీకుల ప్రకారం గేమ్స్‌‌‌‌ వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది.  గేమ్స్‌‌ను ఒకవేళ  వాయిదా వెయ్యాల్సి వస్తే.. ఆ తర్వాత ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనే దానిపై ఐఓసీ ప్లాన్స్‌‌‌‌ సిద్ధం చేస్తున్నట్లు ఆర్గనైజింగ్‌‌‌‌ కమిటీకి చెందిన ఓ అధికారి తెలిపారు. అంతేకాక ఉన్నతాధికారుల ఆదేశానుసారం తాము నాలుగైదు ప్లాన్స్‌‌‌‌ సిద్ధం చేస్తున్నామని కూడా చెప్పారు.  ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో గేమ్స్‌‌‌‌ పూర్తి చేయడానికే కమిటీలో ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. గేమ్స్‌‌‌‌ను ఒకట్రెండు ఏళ్లు వాయిదా వేయడం మరో ప్లాన్‌‌‌‌ అయితే,  ఓ నెల లేదంటే 45 రోజులు ఆలస్యంగా గేమ్స్‌‌‌‌ను ప్రారంభించాలని మరికొందరు సూచిస్తున్నారు. ఈ నెలాఖరులో జరిగే ఆర్గనైజింగ్‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌లో ఆయా ప్రత్యామ్నాయాలపై చర్చ జరుగుతుందని చెబుతున్నారు. తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఐఓసీనే అయినా జపాన్‌‌‌‌ ప్రభుత్వం మద్దతు లేకుండా ముందుకెళ్లడం అసాధ్యం.

Latest Updates