జనం మూడ్ ఎట్లుంది?.. గ్రేటర్ ఎన్నికలపై సర్వే ఏజెన్సీల ఆరా

హైదరాబాద్​, వెలుగు: ‘ఆయనేం చేసిండు.. ఎందుకెయ్యాలె ఓటు. వేరేటోళ్లకేస్తం’.. ఇదీ ఒకామె మాట. ‘మంచి మంచి పనులు చేసింది. డెవలప్​మెంట్​ చూపించింది. చెప్పిన హామీలు తీర్చింది. ఆమెకే మేం ఓటేస్తం’ ఇదీ ఒక అన్న మదిల మాట. ఇట్ల అందరికీ క్యాండిడేట్ల మీద ఏదో ఒక అభిప్రాయం ఉంటది. ఇదిగో అట్లనే జనాల మదిల ఏమున్నదో తెలుసుకోవడానికి పబ్లిక్​ టాక్​పై ఏజెన్సీలు సర్వేలు చేస్తున్నాయి. నేతలపై జనాల నాడీ పట్టేందుకు ఏజెన్సీల వలంటీర్లు.. పాన్​షాపులు, సెలూన్లు, కేఫ్​లు, హోటళ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ మాటమాటా కలిపి ఓటర్లు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటున్నారు. అంతేకాదు.. డివిజన్లలోని ఒక్కో వీధిలో ఐదారు ఇండ్లకు పోయి ఓటర్లు ఎటువైపున్నరో గుట్టు రాబడుతున్నారు. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల బలాబలాలు, బలహీనతలపై రోజువారీ రిపోర్టులు ఇస్తున్నారు. ఆ రిపోర్టుల ఆధారంగా క్యాండిడేట్లు ముందే జాగ్రత్త పడుతున్నారు. అసంతృప్తితో ఉన్న ఓటర్లను బుజ్జగిస్తున్నారు. వాళ్లకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించడంతో పాటు.. తాయిలాలకూ సిద్ధమవుతున్నారు.

స్థానిక ఎన్నికలకూ సర్వేలు..

పార్లమెంట్​, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సర్వే సంస్థలు.. ఎగ్జిట్​ పోల్స్​ వివరాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఏజెన్సీల సర్వే స్థానిక సంస్థల ఎన్నికల వరకూ చేరింది. గత ఎన్నికల్లో ఆ ఏజెన్సీల అంచనాలు ఫలితాలకు దగ్గరగా ఉండడం, సర్వే చేసిన వలంటీర్లు మొహమాటాలు లేకుండా అభ్యర్థుల బలాబలాలను తేల్చి చెబుతుండడంతో.. అన్ని పార్టీల నాయకులు ఇప్పుడు సర్వే ఏజెన్సీల దగ్గరకు వెళుతున్నారు. కచ్చితమైన రిపోర్టు ఇస్తారని భావిస్తున్నారు. ఇటీవలి దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్​రావు.. తనకు మిషన్​ చాణక్య అనే సర్వే సంస్థ ఎప్పటికప్పుడు రిపోర్టులు ఇచ్చిందని, తన గెలుపులో ఆ సంస్థ కీలకంగా పనిచేసిందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

స్పెషల్​ యాప్​లతో సర్వే

ఏజెన్సీలు సర్వే కోసం ఎన్నెన్నో ప్రశ్నలతో క్వశ్చనీర్​ను తయారు చేస్తున్నాయి. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? ఈ ఏరియాలో మీకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు? మీ డివిజన్​లో గత కార్పొరేటర్​​ ఏ మేరకు అభివృద్ధి చేశారు? ప్రభుత్వ పాలనపై సంతృప్తిగా ఉన్నారా? వరద సాయం అందిందా? లాంటి అనేక ప్రశ్నలను జనాలను అడుగుతున్నాయి. ప్రజలు చెప్పే ఆ సమాధానాలను అప్​లోడ్​ చేసేందుకు ఓ స్పెషల్​ యాప్​ను తయారు చేసుకున్నాయి. ఇవే కాదు.. టెలిఫోనిక్​ సర్వేలు, ఆన్​లైన్​ సర్వేలనూ ఏజెన్సీలు చేస్తున్నాయి. కేవలం సర్వేలకే పరిమితం కాకుండా వాట్సాప్​ మెసేజ్​లు, బల్క్​ మెసేజ్​లు, ఫేస్​బుక్​, ట్విట్టర్​, ఇన్​స్టాగ్రాం, యూట్యూబ్​ వంటి సోషల్​ మీడియా వేదికల్లోనూ పార్టీల క్యాండిడేట్ల తరఫున ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్​​విడుదలైనప్పటి నుంచే సర్వేలు చేస్తున్నాయి. ఇలాంటి సర్వేలతో ఇటు క్యాండిడేట్లకు లాభం కలగడంతో పాటు.. ఉద్యోగం లేని చాలా మంది యువతకు టెంపరరీగానైనా ఉపాధి దొరుకుతోంది.

for more News…

ఎలక్షన్లు రాంగనే… ఓటర్లపై ప్రేమ పుట్టె

పేరుకే మహిళా కార్పొరేటర్లు.. పెత్తనమంతా భర్తలదే

ఎన్నికల్లో మేమంతా నోటాకే ఓటేస్తం

ప్రాజెక్టు ఏదైనా.. పేదల భూముల్లే లాక్కుంటున్నారు

Latest Updates