మే 7 తర్వాత ప్లాన్ ఏంది

లాక్ డౌన్ పొడిగిస్తరా.. రెడ్ జోన్ కే పరిమితమా?
కేంద్రంతోపాటు ముందుకు వెళ్లే ఆలోచనలో సీఎం
మే 8 నుంచి రాష్ట్రంలో సడలింపులు ఉండే చాన్స్
మినహాయింపులిస్తే ఎట్లా ఉండాలనే దానిపై కసరత్తు
మరోవైపు వచ్చే నెలాఖరు వరకు పొడిగిస్తారన్న ప్రచారం

రాష్ట్రంలో 40 రోజులుగా లాక్డౌన్ నడుస్తోంది. ఎక్కడివాళ్లక్కడే ఉన్నరు. అన్ని వ్యాపారాలూ బంద్. సీఎం కేసీఆర్ ప్రకటించిన గడువు మరో ఏడు రోజులు ఉంది. ఆ తర్వాత పరిస్థితి ఏంది? మే 7వ తేదీ తర్వాత లాక్డౌన్కు సడలింపులు ఇస్తరా, ఇంకా కొనసాగిస్తరా అన్న దానిపై అప్పుడే టెన్షన్ మొదలైంది. సడలింపులు ఇస్తే ఎట్లా ఉంటయి, వేటికి ఓకే చెప్తరు, రెడ్ జోన్ల పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయి . 22 జిల్లాల్లో కొత్తగా కేసులు రాలేదు. నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గిపోతున్నాయని సీఎం కూడా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ప్రకటించడంతో రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ సడలింపులు ఇచ్చే చాన్స్ ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే ఎలాంటి సడలింపులు ఇవ్వాలనే దానిపై కేంద్ర, రాష్ట్రాల హెల్త్ డిపార్ట్మెంట్లతో, ఐసీఎంఆర్ సైంటిస్టులతో చర్చిస్తున్నట్టు సమాచారం. ఇక టెస్టులు తక్కువగా చేయడం వల్లే కేసులు తక్కువగా వస్తున్నాయని..ఈ టైమ్ లో లాక్డౌన్ ఎత్తేయడం సరికాదన్న వాదనలూ సర్కారు పరిశీలనలో ఉన్నాయి. అందుకే మే చివరి వారం వరకు కొనసాగించే ఆలోచన ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్, వెలుగు:లాక్ డౌన్లో కేంద్రం మినహాయింపులు ప్రకటిస్తుండటంతో రాష్ట్రంలో పరిస్థితి ఏమిటన్నది టెన్షన్ గా మారింది. రోజు కూలీలు, చిన్న దుకాణాల వాళ్లనుంచి ఉద్యోగుల దాకా అంతా సర్కారు నిర్ణ‌యం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగింపుపై రాష్ట్ర సర్కారు రెండు రకాల ఆలోచనలు చేస్తోంది. సడలింపు ఇస్తే ఎట్లా ఉంటుంది, కొనసాగించాల్సిన పరిస్థితి ఉందా అన్నది పరిశీలిస్తోంది. అధికారులు లాక్ డౌన్ పొడిగిస్తే ఆర్థిక‌ ఇబ్బందులు పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ అనుసరిస్తే మంచిదని అంటున్నారు.

ఇప్పటికే రాష్ట్రం నుంచి ఆరున్నర లక్షల మంది కార్మికులు సొంత ప్రాంతా లకు వెళ్పోలి యారని, లాక్డౌన్ కొనసాగితే ఉన్నవాళ్లూ వెళ్లిపోతారని అంటున్నారు. ఈ నెల 20 నుంచి కేంద్రం ఇచ్చిన సడలింపులు కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఆర్థికంగా వెసులుబాటు కలిగిందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాబట్టి సోషల్ డిస్టెన్స్ తో కేంద్రం ప్రకటించిన సడలింపులను అమలు చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం నిర్ణ‌యానికి విరుద్ధంగా ఇక్కడ లాక్ డౌన్ పొడిగిస్తే ఆర్థికంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవడమేనని స్పష్టం చేస్తున్నారు.

కేంద్రం బాటలో..

ఇప్పటి వరకు అమలు చేసిన లాక్డౌన్తో కరోనా కేసులు కట్టడి అయ్యాయనే ధీమా రాష్ట్రప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కేంద్రం సడలింపులిచ్చినా ఇక్కడ కఠినంగా వ్యవహరించడంతో మంచి రిజల్ట్ వ‌చ్చిందని అధికారులు అంటున్నారు. అయితే 7 వారాల లాక్ డౌన్తో జనం పడుతున్న ఇబ్బందులను సర్కారు పట్టించుకోవడంలేదని, కరోనా కేసులను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. దీంతో కేంద్రంతో పాటు ముందుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మే 3తో కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ పూర్తి కానుంది. 4 నుంచి దశల వారీగా లాక్ డౌన్ ఎత్తేసే ఆలోచన ఉంది.  గ్రీన్ జోన్లకు వీలైనన్ని ఎక్కువ సడలింపులు ఇవ్వనున్నట్టు సంకేతాలున్నాయి. ఈ మేరకు కేంద్రం ఇచ్చే సడలింపులనే మే 8 నుంచి రాష్ట్రంలోనూ అమలు చేసే చాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు. ‘‘గత నెలలో కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని కాదని.. మళ్లీ లాక్ డౌన్ పెంచే పరిస్థితులుండవు. ఇప్పటివరకు రాష్ట్రంనో చెప్పిన సడలింపులన్నీ మే 8 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలెక్కువ. అన్ని రాష్ట్రాలతో పాటే మనమూ వెళక్ల తప్పదు” అన్నారు. షాపులు ఓపెన్ చేసినా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సి ఉంటుంది. ప్రార్థనా మందిరాలు, జనం గుమిగూడే కార్యక్రమాలకూ అనుమతించ‌రాదని అధికారులు అంటున్నారు.

రెడ్ జోన్ ప్రాంతాల్లో మే చివరి వరకు..

రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు సూర్యాపేట, గద్వాల, నిర్మల్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. వైరస్ వ్యాప్తి, కొత్త కేసులు ఈ ప్రాంతాల్లోనే వస్తున్నట్టు హెల్త్ డిపార్ట్ మెంట్ బులెటిన్లు వెల్లడిస్తున్నాయి. అందుకే రెడ్ జోన్ ప్రాంతాలన్నింటా లాక్ డౌన్ ను మే చివరి వరకు అమలు చేసే చాన్స్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో లాక్ డౌన్ ఇంకా పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు అంటున్నారు. జిల్లాల్లో సడలింపు ఇచ్చినా..గ్రేటర్ , శివారు ప్రాంతాల్లో ఇంకొంత కాలం కొనసాగించాలని ప్రభుత్వానికి అధికారులు రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతమున్న కంటెయిన్ మెంట్ జోన్లలో చాలా వరకు హైదరాబాద్ లోనే ఉన్నాయి. రంజాన్ మాసం పూర్తయ్యే వరకు సిటీలో లాక్ డౌన్ కొనసాగించే అవకాశం ఉందని ఓ ఆఫీసర్ చెప్పారు. ఐటీ కంపెనీలు ఉన్న గచ్చిబౌలి, హైటెక్ సిటీల్లో ఆంక్షలతో లాక్ డౌన్ ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

5న కేబినెట్ భేటీ!

రాష్ట్రంలో మే 7వ తేదీ వరకు లాక్డౌన్ ఉంటుందని సీఎం కేసీఆర్ ఇంతకుముందే ప్రకటించారు. ఈ నేపథ్యం లో 7వ తేదీ తర్వాత ఏం చేయాలన్న దానిపై 5న కేబినెట్ మీటింగ్ నిర్వహించి, నిర్ణ‌యం తీసుకోనున్నారు. కేంద్రం ప్రకటించిన గడువు మే3తో ముగియనుంది. ఈ క్రమంలో కేంద్రం తీసుకునే నిర్ణ‌యాలు, ప్రకటించే అంశాలపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా..

మే 3 తర్వాత లాక్ డౌన్ విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కోలా ముందుకెళ్లే ఆలోచనలో ఉంది. పంజాబ్ లో మే 17 వరకు లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణ‌యించారు. యూపీ, పశ్చిమ బెంగాల్లో ఇంకొంత కాలం కొనసాగించే ఆలోచనలో ఉన్నారు. ఏపీ అయితే ఇప్పటికే కేంద్రం ఇచ్చిన సడలింపులను అమలు చేస్తోంది. తమిళనాడు, కర్ణాటక కూడా మే 4 నుంచి కేంద్రం గైడ్ లైన్స్ మేరకు వ్యవహరించాలని నిర్ఱ‌యిం చాయి.

మే 4 నుంచి అన్ని పనులూ..

దేశవ్యాప్తంగా గ్రీన్ జోన్లలో మే 4 నుంచి దాదాపు అన్ని పనులూ మొదలవుతాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో వెల్లడించారు. గ్రీన్‌ జోన్లలో పరిశ్రమలతో పాటు మిగతా అన్ని పనులు
చేసుకోవచ్చన్నారు. జనం గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి ఉండదని, సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు తప్పనిసరన్నారు.

లాక్ డౌన్ మాత్రమే పరిష్కారం కాదు: జేపీ

కరోనాను ఎదుర్కోవడానికి కేవలం లాక్ డౌనే పరిష్కారం కాదని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాశ్ నారా యణ అన్నారు. లాక్ డౌన్ పొడిగించడం వల్ల కూలీలు, అసంఘటిత కార్మికులు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘‘లాక్ డౌన్ కొనసాగిస్తూ ప్రభుత్వమే జీతాలు తగ్గించి ఇస్తోంది. ఇక ప్రైవేటు సంస్థలు ఎట్లా చెల్లిస్తాయి. ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెట్టేందుకు ప్లానింగ్ చేయాలి’’అని సూచించారు.

మెట్రో, బస్సులు ఇప్పుడే నడువయ్..
మెట్రో, ఆర్టీసీ సేవలు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనబడటం లేదు. ‘‘హైదరాబాద్ లో మే చివరివరకు లాక్ డౌన్ కొనసాగించే అవకాశమే ఎక్కువ. సడలింపులు ఇచ్చినా.. మెట్రో ట్రైన్లు , బస్సులు మరికొంత కాలం నడవవు’’
అని ఓ ఆఫీసర్ అన్నారు. జిల్లాల్లో లాక్ డౌన్ సడలించినా బస్సులు ఇప్పట్లో రోడ్డెక్కే చాన్స్ లేదని.. జిల్లాల మధ్య బస్సు సర్వీసుల్ని కొన్నాళ్లు నిషేధించే ఆలోచన  ఉందని చెప్పారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు అవకాశమిస్తే వైరస్ విస్తరించే ప్రమాదముందని హెల్త్ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. సొంత వెహికల్స్ పై ప్రయాణించేలా రూల్స్ లో సడలింపులు ఇచ్చే చాన్స్ ఉంది. కంటెయిన్మెంట్ జోన్లు లేని చోట జనాన్ని బయటికి అనుమతించొచ్చు.

Latest Updates