చైనా ప్రాజెక్ట్ వెనక మతలబేంది.?

చైనా తాను తలపెట్టిన ‘బెల్ట్‌‌ అండ్‌‌ రోడ్‌‌ ఇనీషియేటివ్‌‌’(బీఆర్‌‌ఐ)’ పరిధిలోని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయాన్ని సడలించింది. తన రాజకీయ పలుకుబడిని విస్తరించుకోవటానికి ఈ ప్రాజెక్టుని చైనా బాగా వాడుకుంటోంది. బీఆర్‌‌ఐ పేరుతో అనేక దేశాలను అప్పుల ఊబిలోకి లాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, చైనా ప్రెసిడెంట్​ జిన్​పింగ్​ ఖండిస్తున్నారు. అభివృద్ధి పనులకు ఆర్థిక సహాయం అందించడానికి కొన్ని గైడ్‌‌లైన్స్ రూపొందించామని చెప్పుకొస్తున్నారు. ప్రాజెక్టులో భాగస్వాములయ్యే దేశాలకు బీఆర్‌‌ఐ ఆర్థిక సహకారం అందజేస్తుంది.  చైనా ఈ ప్రాజెక్టుని ఆరంభించడానికి కారణం జపాన్‌‌. ఆసియాలో మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణానికి, ఆర్థిక సాయానికి జపాన్​ పెట్టింది పేరు. డ్రాగన్​ వ్యవహార శైలి నచ్చకపోవటంతో ఈ​ ఇనీషియేటివ్​లో పాలుపంచుకోవడానికి జపాన్​ ఆసక్తి చూపలేదు.చైనా రెండేళ్ల కిందట ప్రెస్టేజీగా ప్రారంభించిన ‘బెల్ట్​ అండ్​ రోడ్​ ప్రాజెక్టు’కు సంబంధించిన రెండో సమ్మిట్‌‌  బీజింగ్​లో పోయిన వారం జరిగింది. దీన్ని రాచరిక కార్యక్రమంలా అట్టహాసంగా నిర్వహించారు. చైనా ప్రెసిడెంట్​ జిన్​పింగ్ తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో పడరాని పాట్లు పడ్డారు. ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ప్రాజెక్టుల్లో అవినీతికి తావు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

చైనా రెండేళ్లుగా ‘బెల్ట్​ అండ్​ రోడ్​’ ప్రాజెక్టును వీలుచిక్కినప్పుడల్లా ప్రతి ఇంటర్నేషనల్‌‌ సమ్మిట్‌‌లోనూ ప్రస్తావిస్తోంది. ఇతర దేశాలతో సంబంధాల్లో భాగంగా చేర్చుతోంది. ఆయా సమ్మిట్​లకు ఆతిథ్యం ఇచ్చే దేశాలు ఈ ఇనీషియేటివ్​ను ఎలా రిసీవ్​ చేసుకుంటాయో తెలుసుకోవాలని ఆశించింది. ఈ ప్రాజెక్టులో చేరేందుకు ఏ దేశమైనా ఓకే అంటే ఆ నిర్ణయాన్ని ఆసరా చేసుకొని అక్కడి పాలిటిక్స్​ను తన చేతిలోకి తెచ్చుకునే వరకు నిద్ర పోదనే అపవాదును మూటగట్టుకుంది.

వరుసగా ఎదురుదెబ్బలు

ఆసియా అంతటా  చైనా ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులు ఒకదాని తర్వాత ఒకటి ఫైనాన్సియల్​గా, పొలిటికల్​గా ఎదురు దెబ్బ తింటున్నాయి. అదే ఆ దేశ ప్రెసిడెంట్​ జిన్​పింగ్​ వైఖరిలో తాజా మార్పుకు కారణమని కొందరు అంటున్నారు. చైనా చేతిలో పుష్కలంగా అవుట్‌‌సోర్సింగ్‌‌ ప్రాజెక్టులు ఉండటంతో రిచ్‌‌గా కనిపిస్తున్నా ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ప్రాజెక్టుల కోసం లక్షల్లో డాలర్లను ఖర్చుపెట్టే స్థితి మాత్రం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ఆర్థిక సంస్థల్లోనూ ఉన్న మిగులు నిధులను ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ప్రాజెక్టులకే ఖర్చుపెడితే చైనా సొంత డెవలప్‌‌మెంట్‌‌ ప్లాన్‌‌లను అమలు చేయటం కష్టం.

అయినా.. అదే తీరా?

బెల్ట్​ అండ్​ రోడ్​ ఇనీషియేటివ్​లోకి మరిన్ని దేశాలు వచ్చేలా చైనా ప్రయత్నాలు చేస్తున్న మాట నిజం. తద్వారా  ఇతర దేశాలపై డామినేషన్​ చేయాలనే లక్ష్యానికి ఆర్థిక లోటు అడ్డు తగులుతోంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దారులు వెతుకుతోంది.  ఇందులో భాగంగానే పశ్చిమ దేశాలు సహా గ్లోబల్​ ప్రైవేట్​ క్యాపిటల్​ సాయంతో బెల్ట్​ అండ్​ రోడ్​ ప్రాజెక్టును నిలబెట్టాలని చైనా లీడర్లు తెగ ఆరాటపడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్​ ఫైనాన్స్​ సంస్థలు తమ పెట్టుబడులను దక్షిణ దేశాల్లోనే పెడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సాయం చేయటంవల్ల చైనా కంపెనీలకే లాభం తప్ప వేరే దేశాల సంస్థలకు కాదు. విదేశీ ఫైనాన్స్​ సంస్థలు ఆర్థిక ప్రయోజనాలనే లక్ష్యంగా పెట్టుకుంటే ఈ ఇన్వెస్ట్​మెంట్​ వర్కౌట్​ కాదు. ‘బెల్ట్​ అండ్​ రోడ్’​ ఇనీషియేటివ్​ను పట్టాలెక్కించటాన్ని ప్రైవేట్​ కంపెనీలు తమ బాధ్యతగా భావించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి చైనా తాను ఆర్థికంగా భరించగల స్థాయి ప్రాజెక్టులనే చేపట్టడం బెటర్​.

అసలు ఏమిటీ ప్రాజెక్టు?

‘వన్ బెల్ట్ – వన్ రోడ్’ పథకాన్ని చైనా ప్రెసిడెంట్​ జిన్​పింగ్ 2013లో ప్రతిపాదించారు. 152 దేశాల్లో ట్రాన్స్​పోర్ట్​ సౌకర్యాలను మెరుగుపరచటం, వివిధ ఖండాల్లోని అంతర్జాతీయ సంస్థలకు ఫైనాన్సియల్​ సపోర్ట్​ ఇవ్వటం దీని లక్ష్యం. ఈ ఆరేళ్లలో ఈ ప్రాజెక్టు ఆసియాతోపాటు యూరప్‌‌, ఆఫ్రికా, అమెరికా సహా ఇతర ఖండాలకు విస్తరించింది. ఈ కార్యాచరణను తర్వాత బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్​గా మార్చారు.

ఇండియా మొదటి నుంచీ దూరమే

2017లో ‘బెల్ట్‌‌ అండ్‌‌ రోడ్‌‌ ఫోరం’ మొదటి సదస్సును చైనా నిర్వహించగా, ఇండియా వెళ్లలేదు. రెండో సమ్మిట్‌‌ ఈ ఏడాది ఏప్రిల్‌‌ చివరి వారంలో చైనా రాజధాని బీజింగ్‌‌లో జరిగింది. దీన్నీ మన దేశం బహిష్కరించింది. పాక్‌‌ ఆక్రమిత కాశ్మీర్‌‌లో చైనా–-పాకిస్థాన్ ఎకనామిక్​ కారిడార్​‌‌ నిర్మాణాన్ని నిరసిస్తూ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమ్మిట్​కు 150 దేశాల నుంచి 5000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో 90 మంది అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, 40 దేశాల ప్రభుత్వాధినేతలు ఉన్నారు.

ప్రస్తుతం ఎవరి చేతిలో ఎంత డబ్బు ఉంది

  •   ఆసియన్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఇన్వెస్ట్​మెంట్​ బ్యాంక్​, బ్రిక్స్​/న్యూ డెవలప్​మెంట్​ బ్యాంక్​లో 150 బిలియన్​ డాలర్లు
  •   సిల్క్​ రోడ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఫండ్​ వద్ద 40 బిలియన్​ డాలర్లు
  •   స్టేట్​ కంట్రోల్డ్​ ఫైనాన్షియల్​ సెక్టార్​ నుంచి చైనా కంపెనీలు తీసుకోగల బడ్జెట్​ 600 బిలియన్​ డాలర్ల లోపే.

 

 

 

Latest Updates