వాట్సప్.. చిన్న వ్యాపారులకు పెద్ద ఆసరా

బిజినెస్ కనెక్షన్ కు  వాట్సాప్

వాట్సాప్ ఫోన్లోనే బిజినెస్ మీటింగ్స్, ఆర్డర్లు

మల్టిపుల్ వ్యక్తులతో ఒకేసారి కాంటాక్ట్

 ప్రమోషన్ ఖర్చు తగ్గుతుంది

వాట్సాప్ ద్వారా అమ్మకాలు పెరిగాయ్

వెలుగు, బిజినెస్‌డెస్క్: చిన్న వ్యాపారస్తులు కస్టమర్లతో కనెక్ట్ అయ్యేందుకు పాపులర్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఎంతో ఉపయోగపడుతోంది. కరోనా మహమ్మారి కాలంలో చాలా మంది వాట్సాప్ ద్వారానే ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకున్నారు. కస్టమర్లతో కనెక్ట్ అయ్యేందుకు తమకు ప్రధాన ఛానల్‌గా వాట్సాప్ ఉన్నట్టు బెంగళూరుకు చెందిన ఒక ఎంట్రప్రెన్యూర్ స్నేహ సిరివర చెప్పారు. వాట్సాప్ ద్వారా ఎంక్వైరీలు బాగా పెరిగినట్టు పేర్కొన్నారు. సిరివర మాదిరి దేశంలో వేల మంది ఎంట్రప్రెన్యూర్లు కరోనా సంక్షోభ కాలంలో వాట్సాప్ ద్వారానే  కస్టమర్లను చేరుకున్నారు. ఇన్ఫార్మల్ ఎకానమీలో ఉన్న చాలా మంది వాట్సాప్, వాట్సాప్ బిజినెస్ యాప్ ద్వారా రోజువారీ బిజినెస్ కమ్యూనికేషన్ మీటింగ్స్‌ను నిర్వహిస్తూ వారి వ్యాపారాలను మరింత ముందుకు తీసుకెళ్లారు. వాట్సాప్ ఇండియా యూజర్ బేస్ ప్రస్తుతం 40 కోట్లుగా ఉంది. ప్రత్యేకంగా వ్యాపారాల కోసమే తీసుకొచ్చిన వాట్సాప్ బిజినెస్ యాప్‌కి గ్లోబల్‌గా 5 కోట్ల మందికి పైగా యూజర్లున్నారు. వారిలో 30 శాతం అంటే 1.5 కోట్ల వరకు ఇండియాలోనే ఉన్నారు. ప్రతినెలా గ్లోబల్‌గా 4 కోట్ల మంది బిజినెస్ కాటలాగ్‌ను వాట్సాప్ ప్లాట్‌ఫామ్ ద్వారానే చేపడుతున్నారు.

చిన్న వ్యాపారుల్లో వాట్సాప్ బిజినెస్ ఇంత పాపులర్ కావడానికి కారణమేమిటి?

చిన్న సంస్థలకు సాయం చేసేందుకు ఇది యునిక్ బిజినెస్ ప్లాట్‌ఫామ్ అని ఆన్లైన్ బుక్ స్టోర్ బుక్స్ బై కిలో డైరెక్టర్ అభిషేక్ డీ శ్యాం చెప్పారు. వాట్సాప్ బిజినెస్ ఆడియో, వీడియో కాల్ ఫీచర్, కస్టమర్ సర్వీసు కాస్ట్‌ను తగ్గించేందుకు సంస్థకు సాయం చేస్తుందని, మార్కెటింగ్ ఖర్చులను సగానికి మేర తగ్గిస్తుందని ముంబైకి చెందిన ఒక ఎంట్రప్రెన్యూర్ తెలిపారు. ‘వాట్సాప్ వీడియో కాల్స్‌ను వాడుకుని మా కస్టమర్లకు మా బుక్ కలెక్షన్ గురించి వర్చ్యువల్‌గా వివరించాం. కస్టమర్ ఇంటరాక్షన్స్ పెంచాం. మరిన్ని సేల్స్‌ను జనరేట్ చేశాం. ఇన్స్టెంట్ మెసేజింగ్ వంటి ఫీచర్లు మా సమయాన్ని చాలా సేవ్ చేశాయి. ఒకేసారి మల్టిపుల్ కాంటాక్ట్‌లకు మా బుక్స్‌ను ప్రమోట్ చేశాం’ అని శ్యాం తెలిపారు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి సేల్స్ 40 శాతం పెరిగినట్టు పేర్కొన్నారు. కమర్షియల్ సంస్థల్లోనే కాక, చాలా సెక్టార్లలో వాట్సాప్‌కు మస్తు పాపులారిటీ వచ్చింది. సోషల్ సర్వీసు సెక్టార్ కూడా ఈ ప్లాట్‌ఫామ్ వల్ల బాగా లబ్ది పొందింది.

అత్యవసర వస్తువులను తరలించడంలో వాట్సాప్ కీలక పాత్ర పోషించింది. పేద ప్రజలను చేరుకోవడానికి వాట్సాప్‌లోని మా గ్రూప్స్ ఎంతో సహకరించాయని అప్ని రోటీ సోషల్ ఇనీషియేటివ్ ఫౌండర్ బికాష్ అగర్వాల్ చెప్పారు. అప్ని రోటీ   మొబైల్ వ్యాన్ల ద్వారా రోటీలను పేద ప్రజల వద్దకు చేరవేసింది. వాట్సాప్ గ్రూప్‌లలో రోటీని ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఆ వ్యాన్ లొకేషన్‌ను షేరు  చేస్తే.. వాలంటీర్‌గా సేవలందించాలనుకునే వారు భాగస్వామ్యం కావొచ్చు. లోకల్ కమ్యూనిటీస్‌కి చిన్న వ్యాపారాలే కీలకంగా ఉంటాయి. ఎకానమీని ముందుకు నడిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. చిన్న వ్యాపారాల కమ్యూనిటీ కోసం వాట్సాప్ కృషిచేస్తోందని కంపెనీ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ అన్నారు. కస్టమర్లను కనెక్ట్ అయి, సేల్స్ పెరగడంలో సాయం చేస్తోందని పేర్కొన్నారు.

వాట్సాప్ ఎందుకు క్లిక్ అయింది..?

ప్రస్తుతం చాలా మెసేజింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చాలా మంది ఎక్కువగా వాట్సాప్‌నే వాడుతున్నారు. ఈ యాప్ వాడకం తేలికగా ఉండటంతో పాటు.. జనాలకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. వాట్సాప్ రెగ్యులర్ యాప్‌తో పోల్చుకుంటే వాట్సాప్ బిజినెస్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌పై కొన్ని ఉపయోగపరమైన ఫీచర్లను వ్యాపారస్తుల కోసం అందుబాటులోకి తెచ్చింది.

జియో ప్రభావం..

వాట్సాప్ కు ఇండియా అతిపెద్ద మార్కెట్ గా ఉం ది. ఇన్స్ స్టంట్ మెసేజింగ్ సర్వీసుల్లో వాట్సాప్ ముందుంది. బిజినెస్ కమ్యూనిటీలో కూడా వాట్సాప్ విస్తరించాలని అనుకుంటోంది. దీని కోసం వాట్సాప్ పేరెంట్ కంపెనీ ఫేస్బుక్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్ఫామ్లో 5.7 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తోంది. వాట్సాప్ పరంగా తీసుకుంటే ఈ డీల్ అతి కీలకమైనది. దేశంలో లక్షల మంది చిన్న వ్యాపారులను చేరుకోవడానికి ఈ డీల్ సాయ పడుతుంది. ఇండియాలో 6 కోట్ల వరకు చిన్న వ్యాపారాలున్నాయి. కొన్ని కోట్ల మంది ఈ వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తున్నారు. కరోనా సంక్షోభ కాలంలో చాలా మంది ఎంట్రప్రెన్యూర్లు తమ కస్టమర్లతో కమ్యూనికేట్ అవడానికి డిజిటల్ టూల్స్ అవసరం ఎంతో ఉందని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. దీని కోసమే తాము జియోతో పార్టనర్షిప్ కుదుర్చుకున్నామని,  ఇండియాలో వ్యాపారాలకు కొత్త అవకాశాలను క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. ఈ మెగా డీల్ మాత్రమే కాక, జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్, వాట్సాప్‌లు కూడా చిన్న వ్యాపారాలకు సాయం చేసేందుకు జత కట్టాయి.  ముఖ్యంగా కిరాణాలకు ఇవి సాయం చేయనున్నాయి.

Latest Updates