వాట్సాప్‌ అడ్డాగా రెచ్చిపోతున్న పోకిరీలు

whatsapp-black-mails-cheating-cases

బస్టాప్‌లు, కాలేజీ ఏరియాల్లో యువతులను వేధించే పోకిరీలు రూట్‌ మార్చారు. వాట్సాప్‌ను అడ్డాగా చేసుకొని రెచ్చిపోతున్నారు. ముందుగా ఆకతాయిలు తమకు తోచిన నంబర్లను వాట్సాప్ లో సేవ్ చేసుకుంటారు. డీపీ ప్రొఫైల్‌లో యువతులు, మహిళల ఫొటోలు కనిపిస్తే హాయ్‌ అంటూ చాటింగ్‌ లేదా వాయిస్‌ కాల్‌ చేయడం స్టార్ట్‌ చేస్తారు. అవతలి వైపు నుంచి స్పందన వస్తే మెసేజ్‌లు, వాయిస్‌ కాల్స్‌ చేస్తూ విసిగిస్తున్నారు. పరిచయం పెరిగాక ప్రేమించాలంటూ, డబ్బులు ఇవ్వాలని లేకపోతే డీపీ మార్ఫింగ్‌ చేసి వెబ్‌సైట్స్‌ లో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరిస్తున్నారు.  ఈ మధ్య ఓ యువతికి పరిచయమైన వ్యక్తి నెంబర్‌ను బ్లాక్‌ చేసినా వేధింపులు ఆపలేదు. దీంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కంప్లయింటు చేయగా అరెస్ట్‌ చేశారు.  అయితే భయపడి ఫిర్యాదు చేయనివారు ఎంతోమంది ఉన్నారు.

ఓ యువతి నంబర్ కి వాట్సప్ లో ‘హాయ్ ఎలా ఉన్నావు’ అనే మెసేజ్ వచ్చింది. అది ఎవరో తెలియక ఆమె తన భర్తకు చెప్పింది.  ఎవరో తెలుసుకునేందుకు భర్త ఆ నంబర్ కు కాల్ చేశాడు కానీ అవతలి వ్యక్తి  లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఆ యువతి నంబర్ కి వచ్చిన అసభ్యకర వీడియో కాల్ ఆ దంపతులకు వాట్సాప్ కాల్ అంటేనే భయం పుట్టేలా చేసింది.

హైదరాబాద్,వెలుగు: సోషల్ మీడియా అడ్డాగా పోకిరీలు రెచ్చిపోతున్నారు.ఫేస్ బుక్, ట్విట్టర్,స్కైప్ లాంటి సోషల్ వెబ్ సైట్స్ తో పాటు వాట్సాప్ ను తమ ఆగడాలకు అడ్డాగా మార్చుకున్నారు. దీంతో ఈ సోషల్ యాప్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పోకిరీల చేతుల్లోని స్మార్ట్ ఫోన్స్ అమాయక అమ్మాయిలు, మహిళల పాలిట శాపంగా మారుతున్నాయి. బస్ స్టాప్ లు,కాలేజీలు, కార్పొరేట్ కంపెనీల్లోని ఆకతాయిలు సోషల్ యాప్స్ తో అమ్మాయిలను వేధించడం కామన్ గా మారింది.  యువతులు,విద్యార్ధినుల,సహోద్యోగినుల ఫొటోలు,వీడియో క్లిప్స్ ను దొంగచాటుగా తీస్తున్నారు. వాటిని వాట్సాప్ ద్వారా ఇతరులకు పోస్ట్ చేస్తున్నారు. ఇలా కొందరు ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తుంటే మరి కొందరు ప్రేమ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ మాట వినని యువతులను అసభ్యకర వీడియోలు వాట్సాప్ లో పంపించి వేధిస్తున్నారు.

హాయ్ అనే పోస్టింగ్ తో

షీ టీమ్ కేస్ స్టడీస్ ప్రకారం.. కొందరు పోకిరీలు తమకు తోచిన నంబర్లను వాట్సాప్ లో సేవ్ చేసుకుంటున్నారు. ప్రొఫైల్ డీపీలో యువతులు,మహిళల ఫొటోలు కనిపిస్తే చాలు చాట్ చేయడం ప్రారంభిస్తున్నారు. తాము టార్గెట్ చేసిన నంబర్ కి వాట్సప్ వాయిస్ కాల్ చేస్తున్నారు. అవతలి వ్యక్తి వాయిస్ మహిళలది అయితే ఎలాగైనా ట్రాప్ చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఇందుకోసం ఏదో ఒక పేరుతో తను వాళ్ళ బంధువుననో  లేక ‘సారీ మేడమ్ నంబర్ రాంగ్ డయల్’ అయ్యిందనో  చెబుతున్నారు. మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత అదే నంబర్ కు ‘ హాయ్’ అని వాట్సాప్ మెసేజ్ పోస్ట్ చేస్తుంటారు. తమ మెసేజ్ కు స్పందించిన వాళ్ళతో చాటింగ్ స్టార్ట్ చేస్తున్నారు.

ప్రొఫైల్ డీపీ మార్ఫింగ్ చేసి

ఇలా గత నెలలో  ఓ యువతికి పరిచయమైన ఆకతాయి ఆమెను వాట్సాప్ చాటింగ్ తో వేధించాడు. ఆమె వాట్సప్ డీపీని కాపీ చేసుకుని ఫొటో మార్ఫింగ్ చేశాడు. మార్ఫింగ్ చేసిన ఫొటోలను ఆ యువతికి పోస్ట్ చేసి తను చెప్పినట్లు వినాలని బ్లాక్ మెయిల్ చేశాడు. లేకపోతే ఆ యువతి ఫొటోలను సోషల్ మీడియాలో,కాల్ గర్ల్  వెబ్ సైట్లలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆ ఫొన్ నంబర్ ను బాధిత యువతి బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. అప్పటికే ఆ యువతి అడ్రస్ తెలుసుకున్న  ఆకతాయి ప్రతీ రోజు ఆమె వెంటపడుతూ వేధించడం స్టార్ట్ చేశాడు. దీంతో ఆ యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఫొన్ నంబర్ ఆధారంగా ఆకతాయిని ట్రేస్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.

భార్యాభర్తల మధ్య వివాదాలు  

ఇలా ఆకతాయిలు చేసే వాట్సాప్ కాల్స్ భార్యభర్తల మధ్య వివాదాలకు దారితీస్తున్నాయి. తన భార్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్న ఓ భర్తకు ఇటీవల ఆకతాయి నుంచి వాట్సాప్ వాయిస్ కాల్ వచ్చింది. ఆ భర్త ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. సదరు ఆకతాయికి మేల్ వాయిస్ వినిపించింది.  వాట్సాప్ డీపీ ఫొటోలో ఉన్న అతడి భార్య గురించి అసభ్యంగా మాట్లాడిన ఆకతాయి.. దుర్భాషలాడుతూ ఫోన్ కట్ చేశాడు. 30 నిమిషాల తర్వాత ఆ పోకిరీ మళ్ళీ వాట్సాప్ కాల్ చేశాడు. అయితే ఆ సమయంలో ఫోన్ భార్య వద్ద ఉంది. దీంతో ఆ భార్యాభర్తలు మధ్య వివాదం నెలకొంది. తరువాత ఆ నంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనేది ఆరా తీశారు. పోలీసులకు కంప్లయింట్ చేశారు. బాధితుల కంప్లయింట్ తో  నంబర్ ను ట్రేస్ చేసిన పోలీసులు ముంబయి నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించారు.

బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు వసూలు

ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్ తన సహోద్యోగిని ఫొటోలను రహస్యంగా తీశాడు. కొన్నిరోజుల తర్వాత ఆ యువతికి వాట్సాప్ కాల్ చేసి అదే కంపెనీలో తను కూడా పనిచేస్తున్నట్లు చెప్పాడు. దీంతో ఆ ఇద్దరి మధ్య కొనసాగిన చాటింగ్స్ బ్లాక్ మెయిలింగ్ కి దారి తీసింది.  ఇద్దరి మధ్య తలెత్తిన వివాదాలతో తన వద్ద ఉన్న యువతి ఫొటోలను వాట్సాప్ గ్రూప్స్,ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఇలా తనకు కావాల్సిన ఆర్థిక అవసరాలను తీర్చుకుంటూ ఆ యువతి వద్ద రూ.లక్షలు వసూలు చేశాడు. దీంతో విసిగిపోయిన బాధిత యువతి పోలీసులకు కంప్లయింట్ చేసింది. వేధింపులకు గురిచేసిన ఆకతాయి ఎంప్లాయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించారు.

ట్రూ కాలర్ పేర్లతో    

ట్రూ కాలర్ లో వచ్చే పేర్ల ఆధారంగా సైతం పోకిరీలు రెచ్చిపోతున్నారు. ట్రూ కాలర్ లో  ఫిమేల్ పేరు డిస్ ప్లేలో కనిపిస్తే ఆ నంబర్ ను టార్గెట్ చేస్తున్నారు. వాట్సాప్ కాల్ చేస్తూ, మెసేజ్ లు పంపిస్తున్నారు. ఎవరైనా తమ ట్రాప్ లో చిక్కితే టైంపాస్ కోసం దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఓ ఇంజినీరింగ్ విద్యార్థినికి ఓ నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ విద్యార్థిని సోదరి తనకు తెలుసంటూ ఓ ఆకతాయి ఆమెతో వాట్సాప్ లో చాటింగ్ మొదలుపెట్టాడు.  కానీ ఆ విద్యార్థినికి అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో ఆమె అలర్ట్ అయ్యింది. వాట్సాప్ చాటింగ్స్ తో వేధిస్తున్న ఆకతాయిపై పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఇదిలా ఉంటే మరోవైపు ఇలాంటి వేధింపుల కేసుల్లో చాలామంది యువతులు పోలీసులకు కంప్లయింట్ చేయడం లేదు. కేవలం నంబర్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఆకతాయిల వేధింపులకు అవకాశం ఇవ్వడం లేదు.

Latest Updates