ప్రైవసీ పాలసీపై మూడు నెలలు వెనక్కి తగ్గిన వాట్సాప్

ప్రైవసీ పాలసీపై మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెనక్కి తగ్గింది. ఇటీవల తీసుకొచ్చిన ఈ పాలసీపై వరల్డ్ వైడ్ గా విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ప్రత్యర్థి యాప్‌లు సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఆదరణ పెరుగుతుండడంతో వెనక్కి తగ్గిన వాట్సాప్.. ప్రైవసీ పాలసీ ఆప్‌డేట్‌ను మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

వాట్సాప్ ప్రైవసీ పాలసీ విధానం వచ్చే నెల 8 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా.. లేటెస్టు నిర్ణయంతో  అది మూడు నెలల వెనక్కి జరిగింది. కొత్త పాలసీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ మూడు నెలలను ఉపయోగించుకుంటామని, అప్పటి వరకు ఏ ఒక్కరి ఖాతాను రద్దు చేయబోమని స్పష్టం చేసింది. కొత్త విధానాన్ని ఖాతాదారులు అర్థం చేసుకున్న తర్వాతే దానిని అమల్లోకి తీసుకొస్తామని చెప్పింది. అప్‌డేట్ పాలసీపై ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్లడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

వాట్సాప్ ప్రైవసీ పాలసీలో భాగంగా ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం, ఐపీ అడ్రస్‌లను ఫేస్‌బుక్‌‌తో పంచుకుంటామని, ఇందుకు అంగీకరిస్తేనే ఖాతా కొనసాగుతుందని, లేదంటే డిలీట్ అయిపోతుందంటూ ఇటీవల వినియోగదారులందరికీ పాపప్ మెసేజ్‌లు పంపింది.

ఈ పాలసీపై సర్వత్ర విమర్శలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గిన వాట్సాప్ కేవలం బిజినెస్ ఖాతాలకు సంబంధించిన వివరాలను మాత్రమే పంచుకుంటామని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ విమర్శలు తగ్గకపోవడంతో ఈ విధానాన్ని మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది మెసేజింగ్ యాప్ వాట్సాప్.

Latest Updates