మెసేజ్ ఫార్వర్డ్ చేయకపోతే అకౌంట్ డిలీట్

హైదరాబాద్, వెలుగు :వాట్సాప్ లో ఇటీవల కాలంలో ఫేక్ మెసేజ్ లు చక్కర్లు కొడుతున్నాయి. వాట్సాప్ సేవలను మోడీ ప్రభుత్వం రాత్రి 11.30 నుంచి 6 గంటల వరకు నిలిపివేసిందని..వాట్సాప్ ఎక్కువగా వాడుతున్న వారు ఈ విషయాన్ని ఇతరులతో షేర్ చేసుకోకపోతే మరో 48 గంటల్లో మీ అకౌంట్ తొలగిస్తారనే ఫేక్ మెసేజ్ లు యూజర్లను విసిగిస్తున్నాయి. దీంతో పాటు వాట్సాప్ అకౌంట్ కొనసాగాలంటే ఈ మెసేజ్ ను 10 మందికి ఫార్వర్డ్ చేయాలని లేదంటే నెలకు రూ.499 బిల్ కట్టాల్సి వస్తుందనే లాంటి ఫేక్ మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి మెసేజ్ లను వాట్సాప్ అకౌంట్ లో ఉన్న 50 మందిలో 10 మందికి షేర్ చేస్తే ప్రతి శనివారం వాట్సాప్ బిల్లు పడదని నమ్మి  కొంత మంది గ్రూపుల్లో పెడుతున్నారు.

గతంలోనూ..   

లింక్ ను క్లిక్ చేసి లాగిన్ అయి దాన్ని 10 మందికి పంపితే డబ్బులు వస్తాయని..ఫ్రీ రీచార్జ్ చేసుకోవచ్చనే లాంటి ఫేక్ మెసేజ్ లు గతంలోనూ వాట్సాప్ లో వైరల్ అయ్యాయి. కానీ ఇటీవల కాలంలో ఈ ఫేక్ మెసేజ్ ల షేరింగ్ ఎక్కువవుతోంది. ఈ మెసేజ్ లు కొంతమంది వాట్సాప్ యూజర్లకు చిరాకు తెప్పిస్తున్నా..మరికొంత మంది వీటిని నమ్మి ఇతర గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు.  టెక్నాలజీ గురించి అవగాహన ఉన్న వారు సైతం ఇలాంటి ఫేక్ మెసేజ్ లను నమ్మి వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. వాట్సాప్ వాడితే డబ్బులు కట్టాలని..రాత్రి 11.30 నుంచి ఉదయం 6 వరకు సేవలు ఆగిపోతాయని  ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫేక్ మెసేజ్ లు పూర్తిగా అవాస్తవమని ఐటీ నిపుణులు చెబుతున్నారు. వాట్సాప్ ఉచిత మెసేజింగ్ యాప్ మాత్రమేనని దీన్ని కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేయాలనుకోదని వారంటున్నారు. ఏదైనాసెక్యూరిటీ పరమైన చర్యలు తీసుకోవాలంటే ఐటీ శాఖ మీడియా ద్వారా అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తుందంటున్నారు. కొన్ని రోజుల కింద కేవలం కొద్ది గంటల పాటు వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల సర్వర్లలో టెక్నిక్ల ప్రాబ్లమ్స్  రావడంతో కాసేపు ఈ యాప్ ల్లో  ఫోటోలు, వీడియోలు డౌన్ లోడ్ కాలేదు. ఆ సమయంలో ఎవరో ఆకతాయి ఈ  ఫేక్ మెసేజ్ తయారు చేసి గ్రూపుల్లో వదిలి ఉంటాడని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. ఈ మెసేజ్ ని నమ్మి చాలా మంది వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పటికీ షేర్ చేస్తున్నారు.  గతంలో కూడా ఇలాంటి ఫేక్ మెసేజ్ లు చాలానే ఇలా నెట్ లో చక్కర్లు కొట్టాయి. అయినా వాట్సాప్ యూజర్లు ఫేక్ మెసేజ్ లను  నమ్ముతూ వాటిని  మళ్ళీ ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ఫేక్ మెసేజ్ లను నమ్మొద్దని ఐటీ నిఫుణులు చెబుతున్నారు.

వాస్తవాన్ని గుర్తించాలి

ఇలాంటి మెసేజ్ లు పనిలో ఉన్నప్పుడు చాలా చిరాకు తెస్తాయి. ఎంతమందికి చెప్పినా మళ్ళీ ఎవరో ఒకరు ఆ మెసేజ్ ను ఫార్వర్డ్ చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ కూడా ఈ ఫేక్ మెసేజ్ ను సరిగా అర్థం చేకోకుండా ఫార్వర్డ్ చేస్తున్నారు.

-సంతోష్, ఐటీ ఎంప్లాయ్‌‌

Latest Updates