ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్ ఎప్పుడు?

ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్ ఎప్పుడు?
  • నేటికీ ప్రాసెస్​ పూర్తి చేయని ఇంటర్ బోర్డు అధికారులు
  • ఏప్రిల్ 30వ తేదీనే గుర్తింపు కాలేజీల లిస్టు పెడ్తామని వెల్లడి
  • అధికారికంగా ఇంకా అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇవ్వని బోర్డు 
  • కార్పొరేట్ కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయినా పట్టింపు కరవు

హైదరాబాద్, వెలుగు:  
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఏప్రిల్30వ తేదీన గుర్తింపు పొందిన కాలేజీల లిస్టు ప్రకటిస్తామన్న ఇంటర్ బోర్డు.. ఆ గడువు ముగిసినా ఏ ఒక్క కాలేజీకి గుర్తింపు ఇవ్వలేదు. అలాగే, కాలేజీల్లో అడ్మిషన్ల కోసం షెడ్యూల్ కూడా ఇవ్వలేదు. మరోవైపు కార్పొరేట్ కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయి.. క్లాసులు కూడా నడుస్తున్నాయి. అయినా, ఇంటర్ బోర్డు స్పందించడం లేదు. 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్ కాలేజీలన్నింటికీ అఫిలియేషన్ కోసం ఇంటర్ బోర్డు జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 1,450 కి పైగా ప్రైవేటు కాలేజీలు అప్లై చేశాయి. షెడ్యూల్​ప్రకారం ఏప్రిల్30న రాష్ట్రంలో  అఫిలియేషన్ ఉన్న కాలేజీల వివరాలు ప్రకటించాల్సి ఉంది. కానీ, ఇంటర్ బోర్డు నుంచి ఆ ప్రకటన రాలేదు. ఇంకా అఫిలియేషన్ ప్రాసెస్​కొనసాగుతూనే ఉంది. నాలుగైదు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ప్రక్రియ ఇంకా డీఐఈవో దగ్గరే ఆగిపోయింది. బోర్డుకు వచ్చిన దరఖాస్తులను పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తునాయి. ఈ ప్రక్రియ పూర్తికావాలంటే మరింత టైమ్ పట్టే అవకాశం ఉంది. దీంతో, ప్రతి ఏడాది లాగే, ఈ విద్యా సంవత్సరం కూడా అఫిలియేషన్ల ప్రక్రియ ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. 

1,036 కాలేజీలకే అఫిలియేషన్

రాష్ట్రంలో మొత్తం 3 వేలకుపైగా కాలేజీలుంటే, ఇప్పటికి 1036 కాలేజీలకు మాత్రమే అఫిలియేషన్ ఇచ్చినట్టు ఇంటర్ బోర్డు వెబ్ సైట్​లో పెట్టింది. దీంట్లో ఒక్క ప్రైవేటు కాలేజీ లేదు. 406 కు పైగా సర్కారు కాలేజీలుంటే 357 కాలేజీలకే అఫిలియేషన్ ఇచ్చారు. 475 కేజీబీవీలకు 105, 194  మోడల్ స్కూళ్లకు 114, 152  సోషల్ వెల్ఫేర్ కాలేజీలకు, 63 ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీలకు, 85 బీసీ వెల్ఫేర్ కాలేజీలకు, 132 మైనార్టీ వెల్ఫేర్ కాలేజీలకు మాత్రమే అఫిలియేషన్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రైవేటు కాలేజీల మేనేజ్​మెంట్ల విజ్ఞప్తితో అఫియేషన్లు ప్రతి ఏటా కాకుండా.. మూడేండ్లు, ఐదేండ్లకు ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం ఇంటర్ బోర్డుకు అప్పగించింది. దీనిపైనా ఇంటర్ బోర్డు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.  

క్లాసులు నడుస్తున్నా చర్యల్లేవు

ఇంటర్ బోర్డు అధికారికంగా అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇవ్వకపోయినా, మెజార్టీ కార్పొరేట్ కాలేజీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్​ లోని ప్రధాన కార్పొరేట్ కాలేజీల్లో క్లాసులు కూడా కొనసాగుతున్నాయి. వీటిపై విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఏ ఒక్క కాలేజీపైనా చర్యలు తీసుకోలేదు. గతంలో సెలవుదినాల్లో క్లాసులు నడిపించింనందుకు శ్రీచైతన్య, నారాయణతో పాటు పలు కాలేజీలకు ఫైన్ వేశారు. ప్రస్తుతం నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

రెగ్యులర్ సెక్రటరీ నియామకం ఎప్పుడో?

దాదాపు 7 నెలలుగా ఇంటర్ బోర్డుకు నవీన్ మిట్టల్ ఇన్​చార్జి సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఉమర్ జలీల్ రిటైర్ అయిన తర్వాత..  కాలేజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్​గా ఉన్న మిట్టల్​కు అదనపు బాధ్యతలు అప్పగించారు. జనవరి 31న ఆయనకు ప్రభుత్వం రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్ ఇస్తూ బదిలీ చేసింది. పరీక్షల సమయం కావడంతో అప్పట్లో ఆ శాఖలను ఎవరికీ అలాట్ చేయలేదు. నేటికీ ఆయనే వాటిని పర్యవేక్షిస్తున్నారు. అయితే, కీలకమైన రెవెన్యూశాఖ పనుల్లో ఆయన బిజీగా ఉంటున్నారని, ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్లకు టైమ్ కేటాయించకపోతున్నారనే విమర్శలున్నాయి. పరీక్షలు పూర్తికావడంతో, వాటికి కొత్త ఆఫీసర్​ను ఇస్తారా? లేక ఆయన్నే కొనసాగిస్తారా? అనే దానిపై సర్కారు మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.