కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఎప్పుడు?

నేడు కొండా లక్ష్మణ్​ బాపూజీ 105వ జయంతి

అణగారిన వర్గాలకు అండ కొండా లక్ష్మణ్ బాపూజీ. బలహీన వర్గాలకు ఆయన ఇల్లే ఆశ్రయం. నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడినా.. తెలంగాణ ఏర్పాటు కోసం 1969లోనే మంత్రి పదవికి రాజీనామా చేసినా.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం వేసినా.. టీఆర్ఎస్​ పార్టీ పుట్టుకకు తన ఇల్లు జలదృశ్యంలో ఊతమిచ్చినా.. నిరంతరం జనం కోసం తపించిన మహనీయుడు కొండా లక్ష్మణ్​ బాపూజీ.

1915 సెప్టెంబర్ 27న నేటి ఆసిఫాబాద్ కొమ్రం భీం జిల్లా వాంకిడిలో కొండా లక్ష్మణ్ జన్మించారు. ఆయన తండ్రి పోశెట్టి బాపూజీ సబ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేశారు. తల్లి అమ్మక్క బాపూజీ మూడో ఏటనే చనిపోయారు. బాపూజీ 15 ఏండ్ల వయసులోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. 1931లో మహారాష్ట్ర నాగపూర్ దగ్గర్లోని చాందాలో నిజాం ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి రహస్యంగా గాంధీజీ సమావేశానికి హాజరయ్యారు. కర్ర సాము, యుద్ధ విద్యల్లో యువకులకు రహస్యంగా శిక్షణ ఇవ్వడం, లైబ్రరీలను పునరుద్ధరించడం, యువజన గణేశ్​ ఉత్సవాలు నిర్వహించడం వంటివి చేసేవారు. జాతీయోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1947 డిసెంబర్ 4న నిజాంపై జరిగిన బాంబు దాడికి నాయకత్వం వహించారు. మరోవైపు తన చదువునూ కొనసాగించారు. లా కోర్సు పూర్తి చేసిన బాపూజీకి 1951లో హైదరాబాద్ హైకోర్టు అడ్వొకేటు హోదా ఇచ్చింది. బడుగు బలహీన వర్గాల కోసం 1943లోనే చేనేత కార్మిక సంఘాన్ని స్థాపించిన బాపూజీ.. 1950లో హైదరాబాద్ రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీని ప్రారంభించారు. బాపూజీ వివాహం 1948 జూన్ 27న డాక్టర్ శకుంతలాదేవితో జరిగింది. వారి పిల్లలు సురేశ్, ఉమేశ్, అమ్మాయి పవిత్రవాణి.

పోరాటవీరులకు అండగా..

నిజాం పాలన టైంలో చాకలి ఐలమ్మ భర్త నరసింహ, ఆరుట్ల కమలాదేవి, నల్లా నరసింహులు లాంటి పోరాటవీరుల కేసులను వాదించి చెర నుంచి విడిపించారు. చిట్యాల(చాకలి) ఐలమ్మ తాను పండించిన పంటకు శిస్తు ఎందుకు చెల్లించాలంటూ కడవెండి(ఇప్పటి జనగామ జిల్లా) జమీందార్ విస్నూరు రామచంద్రారెడ్డితో విభేదించింది. దొర నేరుగా ఏం చేయలేక ఆమె భర్త నరసింహను మోసపూరిత కుట్ర పేరిట జైలు పాలు చేశాడు. బాపూజీ భువనగిరి కోర్టులో ఈ కేసును ఉచితంగా వాదించి ఐలమ్మ భర్తను విడిపించారు. తెలంగాణ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి, షేక్ బందగీ వంటి పోరాటవీరులను కాపాడి కమ్యూనిస్టుల మన్నన పొందారు.

పారిశ్రామిక ప్రాంతాల ఏర్పాటుకు కృషి

ఉమ్మడి ఏపీలో పరిశ్రమల మంత్రిగా ఉన్న కొండా లక్ష్మణ్​ బాపూజీ.. అప్పటి ఆంధ్రా నాయకుల ఆగడాలకు అడ్డు నిలిచారు. తెలంగాణ ప్రాంత యువకులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం పట్టుబట్టారు. బాలానగర్ లో పారిశ్రామిక వాడల అభివృద్ధికి 750 ఎకరాలు సేకరించారు. దాని ఫలితంగానే హైదరాబాద్​లో బాలా నగర్, జీడిమెట్ల, మియాపూర్ వంటి పారిశ్రామిక ప్రాంతాలు ఆవిర్భవించాయి. ఇది బాపూజీ దూరదృష్టికి, దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం. అప్పటి కాంగ్రెస్ జాతీయ నాయకులను ఒప్పించి అనేక కేంద్ర పరిశ్రమలు తెలంగాణలో నెలకొల్పడానికి బాపూజీ కృషి చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కు తరలడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన చొరవ కీలకమైనది. ఉత్తమ సినిమాలకు నంది అవార్డులు కూడా ఆయన హయాంలో ప్రకటించబడినవే. హుస్సేన్ సాగర్ తీరాన 1957లో బాపూజీ తన నివాసం జలదృశ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా

1969లో తెలంగాణకు ప్రత్యేక పీసీసీ ఏర్పడింది. దానికి కొండా లక్ష్మణ్ తొలి అధ్యక్షుడిగా ఉన్నారు. 1969లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. పదవుల కంటే తెలంగాణ సాధనే ముఖ్యమని ప్రకటించారు. ఈ విషయంలో ప్రధాని ఇందిరతోనూ విభేదించారు. తెలంగాణ సాధన మలిదశ ఉద్యమంలో తన 97వ ఏట ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో 10 రోజులు దీక్ష చేసి.. తెలంగాణ కోసం తాను పడిన తపనను యావత్ ప్రపంచానికి తెలియజెప్పారు. తనకు ఎంతో ఇష్టమైన ‘జల దృశ్యం’లో టీఆర్ఎస్ పార్టీ పుట్టుకకు ఆశ్రయమిచ్చారు. తెలంగాణ కోసం ఇంత చేసిన బాపూజీ కోసం, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం మనం ఏం చేస్తున్నామనేది ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరముంది.

తెలంగాణ ఆకాంక్ష సాకారానికి ఆద్యుడైన కొండా లక్ష్మణ్ కు తెలంగాణలో సముచిత ప్రాధాన్యం దక్కకపోవడం బాధాకరం. తెలంగాణలో ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో బలహీన వర్గాలను భాగస్వామ్యం చేయాలని, సమ సమాజ నిర్మాణం జరగాలని, రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని కొండా లక్ష్మణ్​ ఆకాంక్షిం చారు. యువతకు ఉద్యోగాల కల్పన, స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్నది ఆయన ఆకాంక్ష. అవి నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ మేరకు ట్యాంక్ బండ్ పై బాపూజీ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. బాపూజీ నివాసమున్న, టీఆర్ఎస్ పార్టీకి జన్మనిచ్చిన జల దృశ్యాన్ని బాపూజీ స్మారక నాలెడ్జ్ పార్క్ గా ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్​ మాట నిలబెట్టుకోవాలి. బాపూజీ కలలుగన్న సామాజిక, స్వాభిమాన తెలంగాణలో దళితులపై దాడులు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయనే దానికి సీఎం కేసీఆర్​ సమాధానం చెప్పాలి.

1952లో ఎమ్మెల్యేగా ఎన్నిక

హైదరాబాద్ సంస్థానం ఇండియన్​ యూనియన్ లో కలిశాక 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కొండా లక్ష్మణ్​ ఎమ్మెల్యేగా గెలిచారు. 1956లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1957లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. 1960లో మూడోసారి గెలిచారు. పరిశ్రమలు, ఎక్సైజ్​ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బలహీన వర్గాల నుంచి ఎదుగుతున్న బాపూజీని అడ్డుకోవడానికి అప్పటి కాంగ్రెస్​ సీనియర్లు ప్రయత్నించారు. ఆ సమయంలో తాను నమ్మిన బహుజన వాదాన్ని నిలుపుకోవడానికి దళితవర్గానికి చెందిన దామోదరం సంజీవయ్యను సీఎం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. కేవలం పద్మశాలీలకే కాకుండా గౌడ, కురుమ, క్షత్రియ, గంగపుత్ర, విశ్వకర్మ హాస్టళ్ల స్థాపనకు అండగా నిలిచారు. 1959లో గీత కార్మికుల సహకార సంఘం ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. వెనుకబడిన తరగతుల ఉద్యమంలో కృష్ణస్వామి ముదిరాజ్, గౌతు లచ్చన్న, పి శివశంకర్, బాలగౌడ్, బొజ్జం నరసింహులు, ఎర్రం సత్యనారాయణ, సంగెం లక్ష్మీబాయిలను కలుపుకొని ముందుకు నడిచారు.‑దాసు సురేశ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ వర్కింగ్​ ప్రెసిడెంట్

Latest Updates