ప్రేమ గుండెల్లో పుడ్తదా.. మెదడులో పుడ్తదా?

మెదడు పోస్తది ప్రేమకు పురుడు

క్రష్​తో మొదలై ప్రేమ దాకా ఎదుగుతుంది

అంతా ఈ క్రమంలో పుట్టే హార్మోన్ల మహిమే

ప్రేమకు డోపమైన్​, అడ్రినలిన్​, ఆక్సిటోసిన్​ల బాండ్​

‘అరె బై.. ఆ పిల్లను సూడంగనే లబ్​డబ్​ లబ్​డబ్​ అని కొట్టుకోవాల్సిన గుండె.. లవ్​డబ్​ అని కొట్టుకుంటాందిరా’..
ఓ అబ్బాయి. ‘ఏమున్నడే గాడు.. అచ్చం మహేశ్​బాబు లెక్క. వాడేనే నా లైఫ్​ల హీరో’.. పెద్దపెద్ద కండ్లు చేసుకుని ఫ్రెండ్​తో చెప్పింది అమ్మాయి.

అమ్మాయి అయితేంది.. అబ్బాయి అయితేందీ.. ప్రేమకు సింబల్​ హార్ట్​. ప్రేమికులంతా గుండె మొత్తాన్ని గిఫ్ట్​లెక్క ప్యాక్​ చేసేసి ఒకరికొకలు ఎక్స్​చేంజ్​ చేసుకుంటుంటరు. ప్రేమకు గుండెతోనే మూడుముళ్లేసేస్తరు. మరి, నిజంగా ప్రేమ పుట్టేది గుండెల్నేనా? ఎహె కాదు.. అంటోంది సైన్స్​. ప్రేమకు పురుడు పోసేది మెదడంట. అమ్మాయి/అబ్బాయిని లేదా ఏదైనా వస్తువును చూసినప్పటి దగ్గర్నుంచి బుర్రల ఏమేం జరుగుతదో సైంటిస్టులు అరటిపండొలిచి నోట్ల పెట్టినట్టు వివరంగా చెప్పుకొచ్చిన్రు. అరె, అట్లెట్లా ఇప్పటిదాకా గుండెల పుడతదనుకుంటిమి కదా.. మెదడ్ల పుడ్తదా.. అదెట్లా అని కళ్లల్ల లైట్లు ఎలుగుతున్నయా..? అయితే, ఈ మెదడు లవ్​ స్టోరీని చదివేయాల్సిందే మరి.

క్రష్​తో స్టార్ట్​

మనం ఏ పన్జేయాలనుకున్న మెదడుతోనే మొదలైతదన్న సంగతి తెలుసుకదా. ఇదీ అట్లనే. మెదడ్ల వెంట్రల్​ టెగ్మెంటల్​ ఏరియా (వీటీఏ) అనేది ఉంటది. మనల్ని మస్త్​ ఖుషీగుంచే డోపమైన్​ అనే న్యూరోట్రాన్స్​మిట్టర్​ అక్కడ్నే పుడ్తది. ఏదైనా మస్తు మస్తు వస్తువో, మనిషో మన కళ్లల్ల పడ్డంక, వెంటనే ఈ డోపమైన్​ పుట్టుకొస్తుంటది. నాడీ నుంచి నాడీకి జంప్​ కొడుతూ మెదడ్ల న్యూక్లియస్​ అకంబెన్స్​లో ఒక్క స్పార్క్​ను ఇస్తది. అంతే.. క్రష్​ మొదలైతది మన లోపల. ఆనందం రంకెలేస్తది. మొహం ఎలిగిపోతది. మనసుల కోరిక బలంగ నాట్కపోతది. అదొక్కటే కాదు.. కదలాలన్నా, మనలో స్ఫూర్తి రగలాలన్నా, మైండ్​ ఫోకస్​తో ఉండాలన్నా, అమ్మ పాలు తయారు కావాలన్నా అంతా ఈ డోపమైన్​తోనే. అది గానీ ఎక్కువైతే దేనికైనా బానిసైపోతం. అయన్నీ పక్కకునెట్టేస్తే మనిషి జీవితంల ఇంకో ముఖ్యమైన విషయం ‘రొమాన్స్​’ను పుట్టించెడిది కూడా ఈ డోపమైనే. ఇప్పటి నుంచి కాదు.. గప్పుడెప్పుడో 200 కోట్ల ఏండ్ల కిందట జీవి పుట్టినప్పుడు మొదాలు.. అన్ని జీవులల్ల ఈ డోపమైన్​ నెట్​వర్క్​ ఉండేదట. డోపమైన్​ ఎంతెక్కువ పుడితే, అంతెక్కువ కోరిక, ఆరాటం, ఆపేక్ష పెరిగిపోతయి. చివరాఖరికి ఎడిక్షన్​లా మారిపోతది.

తర్వాతేమైతది?

ప్రేమ పిచ్చి ఎక్కువయ్యాక, పోరాడు లేదా పారిపో అనేటట్టు చేసే అడ్రినలిన్​ అనే హార్మోన్​ను తయార్జేసే అడ్రినల్​ అనే గ్రంథికి మెదడు సిగ్నల్​ పంపుతది. ఇగ ఇక్కడ్నుంచే మొదలైతయట.. గుండెల్లో గుబులు, తిండి సైసకపోవడం, చేతులు చెమటతో పచ్చిగైపోవడం వంటివి. ఈ టైంలనే కొన్నికొన్నిసార్లు గలత్​ సోచాయిస్తమట. మన మెదడ్ల ప్రేమ పుట్టంగనే భయం, కోపం, బాధను కంట్రోల్​లపెట్టే అమైగ్డలా అనే మెదడు భాగం పనిచేయడం ఆగిపోతది. ఇక్కడి దాకా మంచిగనే ఉంటది. అయితే, స్పష్టంగా సోచాయించుకునేందుకు పనికొచ్చే మెదడు ముందు భాగం పనిచేయడమూ ఆగిపోతది. మనం చూసిన వస్తువు లేదా మనిషి ఎట్లాంటిదో కూడా తెలసుకోకుండానే జడ్జ్​ చేయడం ఆపేస్తం. ఎంటనే చూసినోళ్లతో బంధం ముడులేసుకుంటది. డోపమైన్​, అడ్రినలిన్​ను పుట్టించి మనలోపల ప్రేమకు బేస్​ ఏస్తే.. ఫైనల్​ స్టేజ్​ల లవ్​హార్మోన్​ (ఆక్సిటోసిన్​) అనే సిమెంట్​తో ఆ బంధాన్ని మరింత గట్టిగయ్యేట్టు చేస్తది మెదడు. మెదడును అంటిపెట్టుకుని ఉండే హైపోథాలమస్​లో పుట్టి, పిట్యూటరీ గ్రంథి నుంచి బయటకొస్తదది. ప్రేమపక్షులను మరింత దగ్గర చేసి, స్ట్రాంగ్​ బాండ్​ వేసేస్తది. ఇదీ, మెదడు చెబుతున్న లవ్​స్టోరీ. మొత్తంగా ప్రేమల ఎమోషన్స్​తో పాటు కెమికల్స్​ మహిమ కూడా మస్తుమస్త్​గా ఉంటదని సైన్స్​ ప్రూవ్​ చేసింది మరి.

Latest Updates