వానాకాలం యాక్షన్ ప్లానేది?

సిటీలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
రెయిన్ సీజన్ మొదట్లోనే తప్పని ఇబ్బందులు
చిన్నపాటి వానలకే కాలనీలు, బస్తీలు మునక
ప్రధానరోడ్లపై నిలిచిన వరద

హైదరాబాద్, వెలుగు: సిటీలో చిన్నపాటి వానలకే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతుంటే… ప్రధాన మార్గాలు వరద నీటితో కొట్టుకుపోతున్నాయి. బస్తీ, కాలనీల వాసులతో పాటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం మొదలై 15రోజులు గడుస్తున్నా మాన్ సూన్ యాక్షన్ ప్లాన్ పై పర్యవేక్షణ లేదు. వారం రోజులుగా కురుస్తున్న జోరు వానలకు లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు ఉంది. చిన్నపాటి వర్షానికే కాలనీలు, బస్తీలు నీట మునుగుతున్నాయి. ప్రధాన మార్గాల్లో చేరిన వరద నీటితో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వానాకాలానికి ముందే మాన్ సూన్ యాక్షన్ ప్లాన్ పేరిట ప్రతిఏటా అధికారులు హడావుడి చేస్తుంటారు. ఈసారి కరోనా కారణంగా సిటీలో వాన నీటి నిర్వహణ తూతూ మంత్రంగా చేసి వదిలేశారు.

రోడ్లపైనే వరద..
ఆదివారం కురిసిన కుండపోత వానకు మోండా మార్కెట్, రాణిగంజ్, వెంగళ్రావు నగర్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, రెజిమెంటల్ బజార్, నాలా బజార్, మనోహర్ థియేటర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లోని రోడ్లపైన వరదనీరు నిలిచి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్ లోని మారుతి నగర్ కాలనీలో డ్రైనేజీలు నిండి ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఏటా వాటర్ లాగింగ్స్ తో స్థానికులు ఇబ్బంది పడుతుంటే, ముంపు నివారణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు.

చెరువు నీళ్లతో నీటమునిగి..
రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిథిలా నగర్ కాలనీ నీట మునిగింది. ఇటీవల కురిసిన భారీ వానలకు మంత్రాల చెరువు నిండిపోయింది. చెరువు పైభాగంలో ఉన్న ఎంఎల్ఆర్ కాలనీలోకి బ్యాక్ వాటర్ వస్తుండడంతో అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తూము గేట్లు తెరిచారు. దీంతో చెరువు కింది భాగంలో ఉన్న మిథిలా నగర్ కాలనీకి నీరు చేరింది. ఇళ్లలోకి రావడంతో కాలనీల్లో రాకపోకలు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

For More News..

3 వారాల్లో రూ. 1.05 కోట్ల విరాళం సేకరించిన హైదరాబాద్ విద్యార్థులు

కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

ప్రముఖ కళాకారుడు వంగపండు మృతి

Latest Updates