ఉద్యోగాలకు ముప్పు లేదు

రైల్వేల కార్పొరేటీకరణపై మంత్రి పీయూష్‌‌ గోయల్‌‌ భరోసా

న్యూఢిల్లీ : రైల్వే ఆస్తులను అమ్మివేసే ఉద్దేశమేదీ కేంద్రానికి లేదని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌‌ గోయల్‌‌ స్పష్టం చేశారు. రైల్వేలను కార్పొరేటీకరణ చేసే ప్లాన్‌‌ లేనందువల్ల ఉద్యోగాలు ఊడిపోతాయనే భయాందోళనలు అవసరం లేదని సిబ్బందికి భరోసా ఇచ్చారు.  రైల్వేలో మెరుగైన సదుపాయాలకోసం పబ్లిక్‌‌ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లను ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ బడ్జెట్‌‌లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి గోయల్‌‌ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో… ‘ఫ్యాక్టరీలను ప్రైవేటువారికి అప్పగించేది లేదు. ప్రొడక్షన్‌‌ యూనిట్‌‌ వర్కర్లు తమ ఉద్యోగాల విషయంలో భయపడనక్కరలేదు’ అన్నారు. రోలింగ్‌‌ స్టాక్‌‌ కోసం గత బడ్జెట్‌‌లో 3,724.93 కోట్ల రూపాయలను కేటాయించగా, ఈసారి బడ్జెట్‌‌లో 6,114.82 కోట్ల రూపాయలకు పెంచడమైందని గుర్తు చేశారు. పెంచిన మొత్తాన్ని అత్యాధునిక కోచ్‌‌లు, ట్రైన్‌‌లు, మెట్రో కోచ్‌‌ల నిర్మాణానికి ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ‘మరిన్ని మెట్రో కోచ్‌‌లు, మెట్రో స్టాక్‌‌ని రూపొందించడమే మా ఉద్దేశం. ప్రస్తుతం చెన్నైలోని ఇంటెగ్రల్‌‌ కోచ్‌‌ ఫ్యాక్టరీ (ఐపీఎఫ్‌‌) ఒక్కటే కోల్‌‌కతా మెట్రో కోసం కోచ్‌‌లను తయారు చేస్తోంది.

ప్రయాణీకులకు మెరుగైన సదుపాయాలను కల్పించడానికి, సరుకు రవాణాని వేగవంతం చేయడానికి పెట్టుబడులను ఆహ్వానించక తప్పదు. ఇలాంటి విషయాల్లో ఉదారంగా ఆలోచించాలి. ఈ రకమైన ప్రాజెక్టులవల్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. ఉత్తమ సేవలను అందించడం రైల్వేల లక్ష్యం’ అని తేల్చి చెప్పారు.

 

Latest Updates