ఇందూరు ఇలాకాపై ఏ జెండా ఎగిరేనో

  • జిల్లా రాజకీయాలకు దూరంగా మాజీ ఎంపీ కవిత
  • సత్తా చాటాలనిఎంపీ అర్వింద్ ప్రయత్నం
  • గట్టి పోటీకి ఎంఐఎం వ్యూహం
  • ప్రభావం చూపనున్న ఇండిపెండెంట్లు

నిజామాబాద్, వెలుగు:  నిజామాబాద్ కార్పొరేషన్ లో ఏ పార్టీ సత్తా చాటనుంది? రాష్ట్రంలోని అధికార పార్టీనా.. కేంద్రంలోని అధికార పార్టీనా..? అందరి చూపు ఇక్కడి ఎన్నికలపైనే కేంద్రీకృతమైంది. తన సిట్టింగ్​ మేయర్​ స్థానాన్ని నిలబెట్టుకోవాలని టీఆర్​ఎస్​ ప్రణాళికలు వేస్తుండగా.. ఆ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని బీజేపీ ముందుకు వెళ్తోంది. టీఆర్​ఎస్​ వర్సెస్​ బీజేపీ అన్నట్లుగా ఇందూరు కార్పొరేషన్​ పోరు నడుస్తోంది.  గత ఎన్నికల్లో ఎక్కువ డివిజన్లు గెలుచుకున్న ఎంఐఎం.. ఈసారి కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్​ కూడా పట్టుకోసం పోటీ పడుతోంది.

మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్​గా..

నిజామాబాద్ కార్పొరేషన్ 1961లో  మొదట మున్సిపాలిటీగా ఏర్పడింది. 2005 మార్చి 5 న  కార్పొరేషన్ హోదాను పొందింది. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 8 మంది మున్సిపల్ చైర్​పర్సన్లుగా పనిచేశారు. నిజామాబాద్ కార్పొరేషన్‍కు 2005 లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడు డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్‍ మేయర్ అయ్యారు. సంజయ్  2005 నుంచి 2009 వరకు ఆ పదవిలో  కొనసాగారు. తర్వాత  జరిగిన ఎన్నికల్లో తొలి మహిళా మేయర్ గా టీఆర్ఎస్ కు చెందిన ఆకుల సుజాత గెలిచారు. ఆమె 2014 నుంచి 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు.  రోజురోజుకూ  నిజామాబాద్​ నగరం విస్తరిస్తోంది. జనాభా కూడా పెరుగుతోంది. 2011 లెక్కల ప్రకారం ఇందూరు నగర జనాభా  3,10,364. ఇప్పుడు అది 4లక్షలకు పైగానే ఉంటుందని అంచనా.

బీసీ మహిళకు రిజర్వ్

నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. వీటిలో బీసీ మహిళలకు 12 డివిజన్లు రిజర్వ్ అయ్యాయి. ఈ పన్నెండు డివిజన్లలో గెలిచిన బీసీ మహిళల్లోనే ఒకరు  మేయర్ పీఠాన్ని దక్కించుకుంటారు. మొన్నటి వరకు ఇక్కడ  మేయర్ గా ఉన్న ఆకుల సుజాత బీసీ వర్గానికి చెందినవారే. ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున ఆమె మళ్లీ పోటీ చేస్తున్నారు. మేయర్​ రేసులో కూడా సుజాత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్ పరిధిలో బలమైన కమ్యూనిటీగా గుర్తింపు పొందిన పద్మశాలి కులానికి చెందిన మహిళకు మేయర్ పదవి ఇవ్వాలన్న ఆలోచనలో కూడా టీఆర్‍ఎస్  ఉన్నట్లు టాక్​. పద్మశాలి కులం ఓట్లు దాదాపు 38 శాతానికి పైగా ఉంటాయి. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇప్పుడే ప్రకటిస్తే గెలుపుపై ప్రభావం చూపించే అవకాశాలుంటాయని ఆయా పార్టీలు
భావిస్తున్నాయి.

నాడు పది సీట్లు గెలిచి పీఠం కైవసం  చేసుకున్న టీఆర్​ఎస్

2014 ఎన్నికలప్పుడు నిజామాబాద్​ కార్పొరేషన్‍లో 50  డివిజన్‍లే ఉండేవి. వాటిలో  టీఆర్‍ఎస్ 10,  కాంగ్రెస్ 10,  బీజేపీ 6, ఎంఐఎం 16  డివిజన్లు గెలిచాయి. ఇతరులు 2 డివిజన్లు గెలుచుకున్నారు. మెజారిటీ  సీట్లను ఎంఐఎం గెలుచుకున్నా మేయర్ పదవి మాత్రం టీఆర్ఎస్  అభ్యర్థి ఆకుల సుజాతకు దక్కింది. ఇతర పార్టీల నుంచి గెలిచినవారిలో మెజారిటీ సభ్యులు టీఆర్ఎస్  వైపు మళ్లడంతో ఆ పార్టీ మేయర్​ పీఠాన్ని కైవసం చేసుకుంది.

ప్రస్తుతం బరిలో ఇలా…

నిజామాబాద్ కార్పొరేషన్​ పరిధిలోని 60 డివిజన్లలో 415 మంది క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు. వీరిలో  టీఆర్ఎస్‍ తరఫున 60 మంది,  బీజేపీ తరఫున 48 మంది, సీపీఐ తరఫున ఒకరు, సీపీఎం తరఫున ఒకరు, కాంగ్రెస్  తరఫున 58 మంది,  ఎంఐఎం తరఫున 25 మంది, టీడీపీ తరఫున 16 మంది, రిజిస్టర్డ్​ పార్టీల తరఫున 23 మంది, ఇండిపెండెంట్లుగా 183 మంది బరిలో నిలిచారు.

ఇండిపెండెంట్ల ప్రభావం

ఇక్కడ ఈ సారి ఇండిపెండెంట్లు  183 మంది బరిలో ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీల రెబల్స్​ కూడా ఉన్నారు. ప్రధాన పార్టీల క్యాండిడేట్ల గెలుపోటములను ఇండిపెండెంట్లు ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో రియల్టర్లు ఎక్కువ సంఖ్యలో పోటీ చేస్తున్నారు.

Latest Updates