డొనాల్డ్ ట్రంప్‌‌కు విషపు పార్శిల్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనమైన వైట్‌‌హౌజ్‌‌కు పటిష్టమైన సెక్యూరిటీ ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా పట్టుకునే భద్రతా వ్యవస్థ నిత్యం పహారా కాస్తూ ఉంటారు. అలాంటి వైట్‌‌హౌజ్‌‌కు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఓ పార్శిల్ పంపారు. అయితే ఇది మామూలు పార్శిల్ కాదు. ఎన్వలప్‌ను తెరచి చూడగా అందులో ఆముదాలు ఉండటం గమనార్హం. సదరు ఎన్వలప్‌‌ను వైట్‌‌హౌజ్‌‌లోకి వెళ్లకుండా తనిఖీ కేంద్రం వద్దే ఫెడరల్ అధికారులు అడ్డుకున్నారని లా ఎన్‌‌ఫోర్స్‌‌‌మెంట్ అధికారి తెలిపారు.

ఈ లేఖపై వైట్‌‌హౌజ్‌‌తోపాటు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చిరునామా ఉందని సదరు అఫీషియల్ స్పష్టం చేశారు. ఆముదాలను పరీక్షించగా అందులో రిసిన్ అనే విషపదార్థం ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. దీనిపై కొనసాగుతున్న విచారణకు సంబంధించిన మరిన్ని విషయాలు చెప్పడానికి ఆయన తిరస్కరించారు. ఆముదాలతో కూడిన సదరు లేఖను ఎవరు, ఎక్కడి నుంచి పంపి ఉంటారనే దానిపై అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎఫ్‌‌బీఐతోపాటు సీక్రెట్ సర్వీస్, యూఎస్ పోస్టల్ ఇన్స్‌‌పెక్షన్ సర్వీస్ కలసి విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

Latest Updates