కరోనా గాలి ద్వారా వ్యాపించడంపై అధ్యయనం చేస్తున్నాం: డబ్ల్యూహెచ్‌వో

ఆ వాదనను కొట్టిపారేయలేమన్న సంస్థ

జెనీవా: చైనాలోని వూహాన్‌లో పుట్టి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తున్న కంటికి కనిపించని కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపించవచ్చని ప్రంపచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్పింది. ఈ మేరకు సైంటిస్టులు చెప్పిన ఆ విషయాన్ని కొట్టిపారేయలేమని వెల్లడించింది. దానిపై పక్కా ఆధారాలు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్‌ లీడ్‌ బెనిడెట్టా అలెగ్రాంజీ అన్నారు. “ జనం ఎక్కువగా ఉన్న దగ్గర, చీకటి ప్రదేశాల్లో గాలి నుంచి వైరస్‌ వ్యాపించవచ్చు అనే వాదనను కొట్టిపారేయలేం. దీనికి సంబంధించి ఆధారాలు సేకరించి వాటిని విశ్లేషిస్తున్నాం” అని ఆమె చెప్పారు. గాలి ద్వారా, చిన్న చిన్న తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందన్న వాదనపై చర్చిస్తున్నామని సంస్థలోని మరో సభ్యుడు కెర్ఫోవ్‌ చెప్పారు. దీనిపై పూర్తిగా స్టడీ చేసి సవరణ మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆయన అన్నారు. గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే విషయం నిర్ధారణ అయితే డబ్ల్యూహెచ్‌వో జారీ చేసిన మార్గదర్శకాలు మార్చాల్సి ఉంటుంది. రూల్స్‌ను మరింత కఠినం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు చెప్పిన వైద్య విధానాల్లో మార్పు తీసుకురావాల్సి ఉంటుంది. వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది అనేదానికి సరైన ఆధారాలు ఉన్నాయంటూ ఈ మధ్యే వివిధ దేశాలకు చెందిన 293 మంది సైంటిస్టుల బృందం డబ్ల్యూహెచ్‌వోకు లేఖ రాశారు.

Latest Updates