ఇంటర్ చావులకు జిమ్మేదార్ ఎవరు? : విపక్ష నేతలు

  • చనిపోయిన విద్యార్ధులకు నష్ట పరిహారం చెల్లించాలి
  • జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలి.
  • బీసీ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది:  వీహెచ్

ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు..ప్రభుత్వ హత్యలు, అస్తవ్యస్తం అవుతున్నవ్యవస్థలు అనే అంశంపై నగరంలోని సోమాజిగూడ  ప్రెస్‌క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ హనుమంతరావు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, టీజెఎస్ అధ్యక్షులు కోదండ రాం, బీసీ నేత ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన అధికారుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. ఇంటర్మీడియట్ సెక్రటరీ అశోక్ ను బర్తరఫ్ చేయాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని  డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో అగ్ర కుల ఆధిపత్యం ఉందంటూ సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. 1990లో తనకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా బీసీ అని చెప్పి ముఖ్యమంత్రి  కాకుండా పార్టీ నేతలు అడ్డుకున్నారన్నారు.  బీసీ ముఖ్యమంత్రి అయిన రోజే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్నారు.

రాష్ట్రపతిని కలుస్తాం: దత్తాత్రేయ

గ్లోబరిన సంస్థ విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసిందని, ఈ విషయంపై రాష్ట్రపతి ని కలుస్తామని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్రంలో 19రోజుల నుంచి మారణకాండ జరుగుతుందని, ఇప్పటి వరకు 26మంది విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..  తన తండ్రి, సీఎం కేసీఆర్ ను చౌకిదార్ కాదు జిమ్మేదర్ అన్నారని, మరి ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన అవకతవకలకు ఎవరు జిమ్మేదారు చెప్పాలని దత్తాత్రేయ అన్నారు.

సరదాగా చనిపోయారనడం సరికాదు: ఆర్.కృష్ణయ్య

ఫెయిలైన కారణంగా మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధులను సరదాగ చనిపోయారని అనడం సరికాదని అధికారులను హెచ్చరించారు. మరణాలపై సిట్టింగ్ జడ్జి చే విచారణ జరిపిస్తే క్లారిటీ వచ్చేదని, ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. ఖాళీ పోస్టులును బర్తరఫ్ చేసుంటే ఈ మరణాల ఉండేవి కావన్నారు. ఆత్మహత్యలపై  ఈనెల 27 న ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపుతామని కృష్ణయ్య అన్నారు.

గ్లోబరినను ఎందుకు తప్పించడం లేదు: కోదండరాం 

చనిపోయిన వారంతా టెన్త్ లో బాగా చదివారని, మంచి  మార్కులు తెచ్చుకున్నారని అలాంటి విద్యార్ధులు ఫెయిలవ్వడంలో తప్పెవరిదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం తమ ఒప్పంద సంస్థ గ్లోబరిన ను ఎందుకు తప్పించడం లేదన్నారు. సర్కార్ నుంచి, ఇంటర్ బోర్డు నుంచి ఈ విషయంపై ఎలాంటి సమాధానం రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. చనిపోయిన వారంతా ఫెయిల్ అవుతారా అని అన్నారు.  చనిపోయిన విద్యార్ధులను కించ పరిచిన అధికారులు…వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Latest Updates