కరోనాపై పడి మలేరియాను మరవద్దు

  • నిర్లక్ష్యం చేస్తే 7.69 లక్షల మంది బలైపోతారు
  • ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్ వో హెచ్చరిక
  • మలేరియాపై పోరు 20 ఏళ్లు వెనక్కి

కేప్ టౌన్: ‘‘ఇతర రోగాలను మరిచిపోతే.. పెద్ద మొత్తంలో చావులను మూల్యంగా చెల్లించుకోవాల్సి వస్తుంది..’’ ఇదీ పశ్చిమాఫ్రికాలో కొన్నేళ్ల కిందట ఎబోలా వైరస్ వ్యాపించినపుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేసిన హెచ్చరిక. ఇప్పుడు కరోనాపై ఫోకస్​ పెట్టి మలేరియాను మరిచి పోతే భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది. ప్రపంచమంతా కరోనా వైరస్ ను నిర్మూలించడంపైనే ఫోకస్ పెడుతోందని, ఇలా అయితే సబ్ సహారన్ ఆఫ్రికాలో మలేరియా వల్ల భారీ ప్రాణనష్టం తప్పదని WHO హెచ్చరించింది. అన్ని వనరులు, శక్తినీ కరోనాను ఎదుర్కొనేందుకే వినియోగించడం వల్ల మలేరియాపై పోరాటంలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు అవుతుందని ఆ సంస్థ స్పష్టం చేసింది.

‘‘ఇప్పటికే సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో ఏటా వేలాది మంది మలేరియాకు బలైపోతున్నారు. మలేరియాపై పోరాటానికి, మందులకు ఆటంకం ఏర్పడితే ఈ ఏడాది 7.69 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉంది. గత రెండేళ్ల కంటే రెట్టింపు మరణాలు తప్పకపోవచ్చు’’ అని గురువారం WHO ఆఫ్రికా రీజనల్ డైరెక్టర్ మత్సిడిసో మోతీ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మలేరియాపై పోరు ఆగకూడదన్నారు. 2018లో సంభవించిన మలేరియా మరణాల్లో 94% సబ్ సహారన్ ఆఫ్రికాలోనే నమోదయ్యాయని, ఎక్కువగా ఐదేళ్లలోపు పిల్లలే బలైపోయారని గుర్తు చేశారు. సౌత్ సూడాన్, మెక్సికో, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో మీజిల్స్, రూబెల్లా, పోలియో, యెల్లో ఫీవర్ టీకాలు కూడా ఆగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Latest Updates