కరోనా బాధిత దేశాల నుంచి వచ్చే వారిని వికారాబాద్‌లో ఉంచుతున్నరు

ఆరోగ్యశాఖకు సర్కార్ ఆర్డర్స్   
శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్ నుంచి నేరుగా హోటల్‌కు తరలింపు   
14 రోజులు హోటల్​లోనే   
‘గుల్బర్గా’ పేషెంట్‌తో 29 మంది హైదరాబాదీలు ‘కాంటాక్ట్’   
వారిలో ఇద్దరు గాంధీ ఆస్పత్రిలో               
క్వారంటైన్​లో మిగతా వాళ్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ విజృంభించిన దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లను ప్రభుత్వమే క్వారంటైన్ చేయనుంది. చైనా, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ దేశాల నుంచి వచ్చే వ్యక్తులందరినీ వికారాబాద్‌లోని హరిత హోటల్‌కు తరలించాలని ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం రాత్రి నుంచే దీన్ని అమలు చేయనున్నట్టు హెల్త్ ఆఫీసర్లు తెలిపారు. ఈ 7 దేశాల నుంచి వస్తున్న వాళ్లందరినీ శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్ నుంచి నేరుగా హరితహోటల్‌కు తరలించి, అక్కడే 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు. వైరస్‌ లక్షణాలు ఉన్నవాళ్లను గాంధీ లేదా ఫీవర్ హాస్పిటల్‌కు తరలించి ఐసోలేషన్‌లో ఉంచుతారు. ఒకవేళ హరితహోటల్‌లో ఉండగా వైరస్‌ లక్షణాలు బయటపడితే వెంటనే హాస్పిటల్‌కు తరలించేందుకు మెడికల్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. వైరస్ లక్షణాలు లేకుంటే 14 రోజుల తర్వాత ఇండ్లకు పంపుతారు. ఈ 7 దేశాలు మినహా మిగతా దేశాల నుంచి వస్తున్నవాళ్లు 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాలి. విదేశాల నుంచి వస్తున్నవాళ్లతో ప్రతి రోజు ఓ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ గ్రూపు ద్వారా ప్యాసింజర్లకు హెల్త్ ఆఫీసర్లు సూచనలు చేయనున్నారు.

4 హాస్పిటళ్లలో తిరిగిన కరోనా బాధితుడు

కర్నాటకలోని గుల్బర్గాకు చెందిన 76 ఏండ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన్ను ఈ నెల 9న మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం గుల్బర్గా నుంచి హైదరాబాద్‌కు కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. వాళ్లు బంజారాహిల్స్, సికింద్రాబాద్‌లో ఉన్న 4 కార్పొరేట్ హాస్పిటళ్లకు వెళ్లినట్లు ఆరోగ్యశాఖ గుర్తించింది. రెండు దవాఖాన్లు పేషెంట్‌ను చేర్చుకోవడానికి తిరస్కరించగా, మరో రెండు దవాఖాన్లు తొలుత అడ్మిట్ చేసుకుని, తర్వాత వెనక్కు పంపినట్టు తెలిసింది. అయితే హాస్పిటల్‌లోనే ఉండాలని తాము సూచించినా కుటుంబ సభ్యులు పేషెంట్‌ను బయటకు తీసుకెళ్లారని బంజారాహిల్స్‌ కేర్‌‌ హాస్పిటల్‌ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తమ హాస్పిటల్‌కు రాకముందు, మరో 3 హాస్పిటళ్లలో పేషెంట్‌ సంప్రదించినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో 4 దవాఖాన్లలో పేషెంట్‌, ఆయన కుటుంబ సభ్యులు ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారన్న అంశంపై ఆరోగ్యశాఖ ఆరా తీస్తోంది. వీళ్లతో కాంటాక్ట్‌ అయిన 34 మందిని ఆఫీసర్లు ఇప్పటిదాకా గుర్తించారు. ఇందులో ఐదుగురు పేషెంట్ కుటుంబ సభ్యులు. వీళ్లు కర్నాటకకు వెళ్లిపోయారు. మిగిలిన 29 మందిలో పేషెంట్‌ను తరలించిన అంబులెన్స్‌ సిబ్బంది, 4 హాస్పిటళ్లకు చెందిన డాక్టర్లు, నర్సులు, స్టాఫ్‌ ఉన్నారు. ఇద్దరికి దగ్గు, గొంతునొప్పి లక్షణాలు ఉండడంతో గాంధీకి తరలించినట్టు తెలిసింది. మిగిలిన వారందరినీ హోమ్‌ క్వారంటైన్‌లో పెట్టినట్టు ఆఫీసర్లు తెలిపారు.

క్వారంటైన్ సెంటర్లుగా ట్రైనింగ్‌ ఇన్​స్టిట్యూట్స్‌

కేరళ, కర్నాటక సహా పలు రాష్ర్టాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో మన సర్కారు మరింత అప్రమత్తమైంది. వైరస్ అనుమానితులను క్వారంటైన్ చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రైనింగ్ ఇన్​స్టిట్యూట్స్‌ను క్వారంటైన్ సెంటర్లుగా మార్చాలని డిసైడ్ అయింది. ధూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీ, రాజేంద్రనగర్‌‌లోని వ్యవసాయశాఖకు సంబంధించిన శిక్షణ కేంద్రాలను క్వారంటైన్‌ సెంటర్లుగా మార్చే యోచనలో ఉన్నట్టు సమాచారం.

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు

కరోనా అనుమానితులను చేర్చుకునేందుకు ప్రైవేటు హాస్పిటళ్లకు ప్రభుత్వం అనుమతించింది. అయితే పేషెంట్‌ వచ్చిన వెంటనే.. వివరాలను కచ్చితంగా ఆరోగ్యశాఖకు అందజేయాలని నిబంధన పెట్టింది. కానీ, ఈ రూల్​ను కార్పొరేట్ హాస్పిటళ్లు పట్టించుకోవడం లేదని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. గుల్బర్గా పేషెంట్‌ విషయంలో ఇదే జరిగిందని, తమకు సమాచారం ఇవ్వడంలో హాస్పిటళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇలాంటి చర్యల వల్ల వైరస్ వ్యాపించే ప్రమాదముందని, ఇప్పటికే ఆయా హాస్పిటళ్లను హెచ్చరించామని తెలిపారు.

కోఠిలోనే ర్యాపిడ్ టీమ్

కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే, బాధిత వ్యక్తుల కాంటాక్టులు ట్రేస్ చేసేందుకు ఆరోగ్యశాఖ ర్యాపిడ్ రెస్పాన్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేసింది. కోఠిలోని పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్‌లోనే 24 గంటలపాటు ఈ టీమ్ అందుబాటులో ఉండనుంది. టీమ్‌లో పనిచేసే వారికోసం అక్కడే బస కూడా ఏర్పాటు చేశారు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌తో పాటు హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వాళ్ల బాధ్యతను ఈ టీమ్‌కు అప్పగించారు. టీమ్‌లో ఉన్న 20 మంది సభ్యులు.. క్వారంటైన్​లో ఉన్న వారికి ఫోన్‌ చేసి ఆరోగ్య వివరాలు వాకబు చేయనున్నారు.

 

Latest Updates