సాయం చేస్తే సత్తా చాటుతనంటున్నబాడీ బిల్డర్

హైదరాబాద్, వెలుగు: కష్టాల కడలి దాటుకుంటూ ఖండాంతరాలకు చేరుకున్నాడు. నాన్న చెప్పే ఆరోగ్య సూత్రాలను బాగా ఒంటబట్టించుకున్నా ఆ యువకుడు, అంతర్జాతీయ స్థాయిలో బాడీ బిల్డర్ గా పేరు తెచ్చుకున్నాడు. మధ్యతరగతి కుటుంబమే అయినా, ఎవరి సాయం లేకుండా బాడీబిల్డర్​గా రాణిస్తున్నాడు. ఉపాధి కోసం జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తూనే చైనాలో జరిగే మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ కు ఎంపికయ్యాడు. జిమ్ లో పనిచేస్తే వచ్చే రూ.15వేలతో చైనాకు ఎలా వెళ్లేదంటూ ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ లేకపోవడంతో స్థానిక సామాజికవేత్త ప్రోత్సాహం, జిమ్ కు వచ్చే వారి ఆర్థిక సాయంతో ఇప్పటివరకు పదికి పైగా గోల్డ్ మెడల్స్ ను కంటోన్మెంట్ కు చెందిన కిరణ్ సాధించాడు.

నాన్నే స్ఫూర్తి

చిన్నప్పటి నుంచి నాన్న ఉదయం చేసే వ్యాయామాల నుంచి స్పూర్తి పొందాడు. ఇంటర్ చదివే టైంలో వ్యాయామంపై ఇష్టం పెంచుకొని జిమ్ కెళ్లడం మొదలుపెట్టాడు. తొలుత ఇంట్లో వాళ్లు ప్రోత్సాహించిన, బాడీ బిల్డింగ్ పై దృష్టి మళ్లడంతో ఖర్చులకు భయపడి వద్దన్నారు. అయినా ఆ తర్వాత ఆ యువకుడి పట్టుదల చూసి తండ్రి ప్రోత్సాహంతో ఈ రంగంలో దూసుకుపోతున్నారు. గత పద్నాలుగేళ్లుగా కఠోర సాధన చేస్తూ పోటీ ఏదైనా పక్కా గోల్డ్ మెడల్ కొట్టడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో జరిగిన పోటీలలో గోల్డ్ మెడల్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

ఏడు సార్లు మిస్టర్ తెలంగాణ టైటిల్

భవన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అప్పటి నుంచే పోటీలకు సిద్ధమవడం మొదలుపెట్టారు. మాజీ మిస్టర్ ఇండియా అయినా మెంటార్ దినేష్ పర్యవేక్షణలో సాధన చేస్తున్న కిరణ్ ఇప్పటివరకు తెలంగాణలో జరిగిన మిస్టర్ తెలంగాణ చాంపియన్ టోర్నీలో గత ఏడేళ్లుగా వరుసగా టైటిల్ సాధిస్తూనే ఉన్నారు. కేరళలో జరిగే సౌతిండియా బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనగా, అందులోనూ గోల్డ్ మెడల్ వచ్చింది. ఇలా మిస్టర్ సౌత్ ఇండియాగా మూడు సార్లు సత్తా చాటాడు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన మిస్టర్ ఏషియా పోటీలలో కండలు కలిగిన గుండె నిబ్బరంతో 90కేజీల కేటగిరీలో బరిలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించడంతో పోటీ ఏదైనా మెడల్ మాత్రం పక్కా రావాల్సిందేనన్న స్థాయిలో కష్టపడిన కిరణ్​ కు ఫలితాలను రాబట్టగలిగాడు. ఇప్పటివరకు తెలంగాణ నుంచి బాడీ బిల్డింగ్ లో సత్తా చాటిన కిరణ్ కు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు.

చైనాలో అంతర్జాతీయ పోటీలు

ఈ ఏడాదిలో సెప్టెంబర్ 12 నుంచి 17 వరకు చైనాలో అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలు జరగనున్నాయి. వీటిలో ఇప్పటికే కిరణ్​ బెర్తు కన్ఫామ్ కాగా, పోటీలకు సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో పాల్గొనేందుకు దాదాపు 800డాలర్ల వరకు ఎంట్రీ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎంట్రీ ఫీజు, ఇతర ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించగలిగితే ఆ పోటీలలో కచ్ఛితంగా సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించాలనే ధీమాగా ఉన్నారు.

Latest Updates