మందుల వేటలో ముందెవరు ?

ముట్టు కుంటే అంటుకు నే మహమ్మారి ప్రపంచాన్ని ఆగమాగం చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కరోనా ఎవరి నుంచి ఎట్లా సోకు తోందో అర్థం కావట్లేదు. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతున్న వేళ.. వైరస్‌కి వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందా? అని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. అయితే వైరస్‌ రోజుకో తీరు రూపం మార్చుకుంటున్నట్లే.. కొన్ని మందులు కూడా వైరస్‌ కి విరుగుడుగా పనిచేస్తున్నయ్‌ . ‘హమ్మయ్య మందులొచ్చేసినయ్‌ . ఇక గండం నుంచి గట్టెక్కినట్లేనని’’ రిలాక్స్‌‌ అవుతున్నారు చాలామంది. కానీ, కరోనా సినిమా అంతటితో అయిపోలేదు. ఆ మందులేవీ పూర్తిగా కొవిడ్‌ జబ్బును నయం చేస్తాయన్న గ్యారెంటీ లేదు. మరి ఆ మందులు ఏం చేస్తయ్‌ ? ట్రీట్‌ మెంట్‌ లో ఎట్ల పనిచేస్తయ్‌ ? యే దేశాలు? ఏయే మందులతో రోనాను కట్టడి చేసేందుకు యత్నిస్తున్నయ్‌ ? వాటిని నిపెట్టేం దుకు జరుగుతున్న రీసెర్చ్‌‌లు.. వాటి పాజిటివ్‌ రిజల్ట్‌‌ ఎంత పర్సంటేజ్‌ ఉంది?…  

                కరోనాకి ట్రీట్‌‌‌‌‌‌మెంట్‌‌‌‌ ఇప్పుడు ఒక మూవ్‌‌మెంట్‌‌‌‌లా మారింది. సైంటిస్టులు వ్యాక్సిన్‌‌‌‌ను కనిపెట్టడమే ముఖ్యమైపోయింది. ఈలోపు జబ్బు తీవ్రతను తగ్గించే మెడిసిన్స్‌‌‌‌ అందుబాటులోకి తేవాలి. ఎందుకంటే వ్యాక్సిన్‌‌‌‌ వచ్చేంత వరకు ఈ మందులే మనుషుల ప్రాణాలను నిలబెడతాయి. కాబట్టి, ఈ ప్రయోగంలో సక్సెస్‌‌‌‌ అయితే గనుక కరోనా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌లో మందులకే అగ్రతాంబూలం దక్కుతుంది. ఒక స్టేజ్‌‌‌‌లో ఫ్యూచర్‌‌‌‌లో వ్యాక్సిన్‌‌‌‌ అవసరమే లేకుండా పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ దిశగా ఇప్పుడు రీసెర్చ్‌‌‌‌లు జరుగుతున్నాయి.

కోవిడ్‌‌‌‌–19 జబ్బుకి కారణం సివియర్‌‌‌‌ ఎక్యూట్‌‌‌‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌‌‌‌ కరోనావైరస్‌‌‌‌–2 (SARS‑CoV‑2). ఈ అంటువ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు స్పెసిఫిక్‌‌‌‌గా ఒక మెడిసిన్‌‌‌‌ అంటూ ఇప్పటిదాకా రాలేదు. నిన్నమొన్నటిదాకా ఆల్టర్‌‌‌‌నేట్‌‌‌‌ దారుల్లో ఈ జబ్బును ట్రీట్‌‌‌‌ చేయడానికి ప్రయత్నించారు హెల్త్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌. యాంటీ వైరల్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌, రోగ నిరోధక మందుల్ని వాడటం చేశారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్ల నుంచి యాంటీబాడీస్‌‌‌‌ను తీసి కరోనా పేషెంట్లకు ఎక్కించి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇచ్చారు. ఈ మూడింటిలో రోగ నిరోధక మందుల్ని వాడటం కొంతవరకు మంచిదేనని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ మొదట్లో అభిప్రాయపడ్డారు. కానీ, అలా చేసేప్పుడు డోస్‌‌‌‌ ఎక్కువగా వాడితే ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. రెండోది ప్లాస్మా థెరపీ.. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి తీసిన యాంటీబాడీస్‌‌‌‌తో ట్రీట్‌‌‌‌మెంట్ ఇవ్వడం ఒక దారి. అయితే ఇందులో కూడా రిస్క్‌‌‌‌కి ఛాన్స్ లేకపోలేదు. మిగిలింది యాంటీ వైరల్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ ఉపయోగించడం. కరోనా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఇది ఇప్పుడు కీలకంగా మారబోతోంది. ఇప్పటిదాకా దాదాపు 200 డ్రగ్స్‌‌‌‌ను పరీక్షించి చూశారు. క్లినికల్ ట్రయల్స్‌‌‌‌లో పేషెంట్ల మీద ప్రయోగించారు. కొంచెం పాజిటివ్‌‌‌‌గా రిజల్ట్‌‌‌‌ వచ్చినాసరే ఆ డ్రగ్స్‌‌‌‌ ఉపయోగించి మెడిసిన్స్‌‌‌‌ను రెడీ చేస్తున్నాయి ఫార్మా కంపెనీలు.

మెయిన్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌
ఏ జబ్బుకైనా వ్యాక్సిన్‌‌‌‌ తయారుచేయడం అంత ఈజీ కాదు. జబ్బు గురించి ఎంతో రీసెర్చ్‌‌‌‌ జరగాలి. ఆ జబ్బు వెనుక ఉన్న వైరస్‌‌‌‌/బ్యాక్టీరియాల జీనోమ్‌‌‌‌ను పరిశీలించాలి. ఎన్నో స్టడీలు జరపాలి. యాంటీ డోస్‌‌‌‌ను కనిపెట్టాలి. ఈ ప్రాసెస్‌‌‌‌కంతా నెలల నుంచి ఏండ్లు పట్టొచ్చు. ఈలోపు క్లినికల్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌, టెస్టులు.. ఇలా సవాలక్ష వ్యవహారాలు ఉంటాయి. కరోనా వైరస్‌‌‌‌ విజృంభణ మొదలై దాదాపు ఆరు నెలల పైనే అవుతోంది. కొవిడ్‌‌‌‌–19 జబ్బుకి వ్యాక్సిన్‌‌‌‌ రావడానికి ఇంకా ఎంత టైం పడుతుందో కచ్చితంగా తెలియదు. మనతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, చైనాకి చెందిన వందకి పైగా కంపెనీలు వ్యాక్సిన్ కనుగొనేందుకు భారీగా ఖర్చుపెట్టి రీసెర్చ్‌‌‌‌లు చేయిస్తున్నాయి. ఈ లోపు వైరస్‌‌‌‌ ధాటికి ఎక్కువ సంఖ్యలో జనాలు చనిపోయే ఛాన్స్‌‌‌‌ ఉంది. అందుకే ఈ ప్రాణాంతక వైరస్‌‌‌‌ను కంట్రోల్ చేసే ప్రయత్నాల్లో మొదటగా మెడిసిన్స్‌‌‌‌ తయారీ ఊపందుకుంది. ఈ మెడిసిన్స్‌‌‌‌ కోసం ప్రధానంగా ‘‘ఫావిపిరవిర్‌‌‌‌, రెమ్డ్‌‌సివర్‌‌‌‌, డెక్సామెథాసోన్‌‌‌‌, ఐవర్‌‌‌‌మెక్టిన్‌‌‌‌’’.. ఇలా కొన్ని డ్రగ్స్‌‌‌‌ను ఉపయోగిస్తున్నారు. వీటితో పాటు శ్వాసకోశ సమస్యలు, ఒళ్లు నొప్పులకు ఉపయోగించే కొన్ని మెడిసిన్స్‌‌‌‌ను ఎక్స్‌‌‌‌పెరిమెంటల్‌‌‌‌గా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ డ్రగ్స్‌‌‌‌, మందులు కొత్తగా తయారు చేసినవేం కావు. ఎప్పటి నుంచో ఉన్నవే. క్లినికల్ ట్రయల్స్ తర్వాత చూపించే ఎఫెక్ట్‌‌‌‌ను బట్టి వీటిని ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కి ఉపయోగిస్తున్నారు. మరికొన్నింటిపై ఇంకా క్లినికల్ ట్రయల్స్‌‌‌‌ జరుగుతూనే ఉన్నాయి. పైగా ఈ మెడిసిన్స్‌‌‌‌ కరోనా పేషెంట్స్‌‌‌‌ అందరికి కామన్‌‌‌‌గా ఉపయోగించేవి ఎంత మాత్రం కావు. సింప్టమ్స్‌‌‌‌ని బట్టి.. డాక్టర్స్‌‌‌‌ ప్రిస్కిప్షన్‌‌‌‌ ప్రకారమే వాటిని పేషెంట్స్‌‌‌‌పై ఉపయోగించాలి. లేదంటే ప్రాణాల మీదకొచ్చే ప్రమాదముంది.

ముచ్చటగా మూడు
కొవిడ్‌‌‌‌–19 పేషెంట్లకు రిలీఫ్ ఇచ్చేలా మూడు మందులు మన దేశపు మార్కెట్‌‌‌‌లోకి వచ్చేశాయి. ముంబైలోని గ్లెన్‌‌‌‌మార్క్‌‌‌‌ ఫార్మాస్యూటికల్స్‌‌‌‌ యాంటీవైరస్‌‌‌‌ డ్రగ్‌‌‌‌ ఫావిపిరవిర్‌‌‌‌ నుంచి ‘ఫాబిఫ్లూ’ ట్యాబెట్లను మార్కెట్‌‌‌‌లోకి రిలీజ్‌‌‌‌ చేసింది. హైదరాబాద్‌‌‌‌ ‘హెటిరో’ కంపెనీ యాంటీవైరల్‌‌‌‌ డ్రగ్‌‌‌‌ రెమ్డెసివిర్‌‌‌‌ నుంచి ‘కొవిఫర్‌‌‌‌’ మందుని అందుబాటులోకి తెచ్చింది. రెమ్డెసివిర్‌‌‌‌ నుంచే ‘సిప్రెమి’ పేరుతో మెడిసిన్‌‌‌‌ను తయారుచేసి మార్కెట్‌‌‌‌కి రిలీజ్ చేస్తోంది ముంబైకి చెందిన సిప్లా కంపెనీ. వీటికి రెగ్యులేటర్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కూడా పర్మిషన్‌‌‌‌ ఇచ్చింది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇవి వాడాలని సూచించింది.

కొవిఫర్‌‌‌‌.. హైదరాబాద్‌‌‌‌ బేస్డ్‌‌‌‌ హెటిరో ఫార్మా కంపెనీ ఈ మెడిసిన్‌‌‌‌ను తీసుకొచ్చింది. యాంటీవైరల్ డ్రగ్‌‌‌‌ రెమ్డెసివర్‌‌‌‌ నుంచి దీనిని డెవలప్ చేశారు. ఎమర్జెన్సీ కండిషన్‌‌‌‌లో ఉన్న పేషెంట్లకు(ఆక్సిజన్‌‌‌‌ సాయంతో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటున్నవాళ్లకు మాత్రమే) ఇవ్వాలి. అది కూడా పేషెంట్‌‌‌‌ నుంచి పర్మిషన్‌‌‌‌ తీసుకున్నాకే మాత్రమే వాడాలని డీసీజీఐ పేర్కొంది. పెద్దలు, పిల్లలు, హాస్పిటల్స్‌‌‌‌లో సివియర్‌‌‌‌ సింప్టమ్స్‌‌‌‌ ఉన్నవాళ్లకు మాత్రమే ఇవ్వాలని పేర్కొంది. కొవిఫర్‌‌‌‌ ఇంజెక్షన్‌‌‌‌ రూపంలో ఉంటుంది. 100 ఎంజీ క్వాంటిటీలో ఉండే ఒక్కో బాటిల్‌‌‌‌ రేటు 5,400 రూపాయలు. మొదటి రోజు 200 ఎంజీ ఇంజెక్షన్‌‌‌‌ డోస్‌‌‌‌, తర్వాత ఐదు రోజులపాటు 100 ఎంజీ డోస్ ఇస్తారు. అంటే ఒక్కో పేషెంట్‌‌‌‌కి ఏడు బాటిల్స్ అవసరం. దాదాపు ముప్ఫై ఐదు వేల ఖర్చవుతుంది.

సిప్రెమి..

ముంబై బేస్డ్‌‌‌‌ సిప్లా ఫార్మా కంపెనీ ఈ మెడిసిన్‌‌‌‌ను అందించనుంది. ఇది కూడా యాంటీవైరల్ డ్రగ్‌‌‌‌ రెమ్డ్‌‌‌‌సివిర్‌‌‌‌ నుంచే తయారు చేశారు. కొవిఫర్‌‌‌‌లాగే దీనిని కూడా క్రిటికల్ కండిషన్‌‌‌‌లో(ఆక్సిజన్‌‌‌‌ సపోర్ట్‌‌‌‌ మీద) ఉన్న కరోనా పేషెంట్లకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి, దీనిని ఎలా ఉపయోగించాలనేదానిపై ట్రైనింగ్‌‌‌‌ ఇవ్వబోతోంది సిప్లా కంపెనీ. సిప్రెమి ఇంజెక్షన్‌‌‌‌ పౌడర్‌‌‌‌ రూపంలో ఉంటుంది. నరానికి చేసే ఇంజెక్షన్‌‌‌‌. క్రిటిక‌‌‌‌ల్ కండిష‌‌‌‌న్‌‌‌‌లో ఉన్న క‌‌‌‌రోనా పేషెంట్స్‌‌‌‌కి ఈ ఇంజెక్షన్‌‌‌‌ను ఐదు రోజుల పాటు ఇస్తే కోలుకున్నార‌‌‌‌ని, మూడు క్లినిక‌‌‌‌ల్ ట్రయల్స్‌‌‌‌లో పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని సిప్లా ఒక స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. సిప్లా తన ఫస్ట్‌‌‌‌ ట్రయల్ అమెరికా, యూరప్, ఆసియాలో 60 చోట్ల.. 1,063 మంది పేషెంట్లపై (ఎక్కువ మంది ఆక్సిజన్ సపోర్టుతో ఉన్నవారు) డ్రగ్‌‌‌‌ను పరీక్షించింది. చాలా త్వరగా పేషెంట్లు కోలుకున్నట్లు గుర్తించింది. ఇప్పుడు సిప్రెమిని మార్కెట్‌‌‌‌లోకి రిలీజ్ చేశాక నాలుగో ట్రయల్ చేసే ఛాన్స్‌‌‌‌ ఉంది. తొలి డోస్ 200 ఎంజీ ఇంజెక్షన్, ఆ త‌‌‌‌ర్వాత మ‌‌‌‌రో ఐదు రోజులు 100 ఎంజీ చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఇంజెక్షన్‌‌‌‌ రేటు ఐదు వేల కంటే తక్కువగా ఉంటుందని ఇప్పటికే సిప్లా అనౌన్స్‌‌‌‌ చేసింది.

పై మూడింటితో పాటు టోసిలిజుమాబ్‌‌‌‌, ఇటోలిజుమాబ్‌‌‌‌లు కూడా కరోనా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌లో వాడుతున్నారు. టిసిలిజుమాబ్‌‌‌‌/అటిల్‌‌‌‌జుమాబ్‌‌‌‌.. ఇది రోగనిరోధక శక్తిని అణచివేసే మందు. దీన్ని ఆటో ఇమ్యూన్‌‌‌‌ డిసీజ్‌‌‌‌ ‘‘రుమటాయిడ్‌‌‌‌ ఆర్థరైటిస్‌‌‌‌’’ పేషెంట్లకు వాడుతారు. దీని ఖర్చు చాలా ఎక్కువ. కరోనా రోగుల్లో వెంటిలేటర్‌‌‌‌ అవసరం రాకుండా దీన్ని ముందుజాగ్రత్తగా వాడుతున్నారు. దీన్ని తొలుత ముంబైలో యాభై ఏళ్ల పేషెంట్‌‌‌‌పై ట్రయల్ చేశారు. కానీ, అప్పటికే పరిస్థితి చేజారిపోయి ఆ పేషెంట్‌‌‌‌ చనిపోయాడు. ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉన్న కరోనా పేషెంట్లపై ఇది సానుకూల ఫలితం చూపిస్తోంది. ‘రోచె ఫార్మా’ దీనిని ప్రొడ్యూస్ చేస్తుండగా, సిప్లా మార్కెటింగ్ చేస్తోంది. ఇటోలిజుమాబ్‌‌‌‌.. బయోకాన్‌‌‌‌ డెవలప్‌‌‌‌ చేసిన హ్యూమనైజ్డ్‌‌‌‌ మోనోకాల్ యాంటీబాడీ. ఢిల్లీ, ముంబైలో ట్రయల్ బేసిస్‌‌‌‌గా పేషెంట్లపై దీనిని ఉపయోగిస్తున్నారు. ఇది కూడా కాస్ట్‌‌‌‌లీనే. జైపూర్‌‌‌‌లో ఆమధ్య ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా సోకగా.. హెచ్ఐవీ కంట్రోల్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌తో వాళ్లకు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇవ్వగా కోలుకోవడం విశేషం.

ఫాబిఫ్లూ..
ఇదొక ఓరల్ డ్రగ్‌‌‌‌. టాబ్లెట్‌‌‌‌ రూపంలో ఉంటుంది. తక్కువ (మైల్డ్‌‌‌‌, మీడియం) సింప్టమ్స్‌‌‌‌ ఉన్న కరోనా పేషెంట్లకు మాత్రమే ఈ ట్యాబ్లెట్‌‌‌‌ పని చేస్తుంది. మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్‌‌‌‌ పూర్తయ్యాక పాజిటివ్‌‌‌‌ రిజల్ట్ చూపించిందని గ్లెన్‌‌‌‌ మార్క్‌‌‌‌ ఎండీ గ్లెన్ సల్దన్హా ఒక స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో చెప్పారు. ఇప్పటికే మార్కెట్‌‌‌‌లోకి రిలీజ్‌‌‌‌ అయినప్పటికీ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావడానికి మరో వారం టైం పట్టొచ్చు. 200 ఎంజీ(మిల్లీగ్రాములు) మెడిసిన్‌‌‌‌తో ఉన్న ఒక్కో టాబ్లెట్‌‌‌‌కు 103 రూపాయల రేటు నిర్ణయించారు. కరోనా సోకిన పేషెంట్స్‌‌‌‌ 1800 ఎంజీ డోస్‌‌‌‌ను ఫస్ట్ డే రెండుసార్లు.. ఆ తర్వాత పద్నాలుగు రోజులపాటు 800 ఎంజీ డోస్‌‌‌‌ సరిపోతుంది. మొత్తం కోర్సు పూర్తయ్యేసరికి ఖర్చు పద్నాలుగువేల దాకా వస్తుంది. నాలుగు రోజుల్లోనే కరోనా ఎఫెక్ట్ తగ్గే ఛాన్స్ ఉంటుందని గ్లెన్‌‌‌‌ చెబుతున్నారు.

డెక్సామెథాసోన్‌‌
ఇదొక స్టెరాయిడ్ డ్రగ్‌‌. టాబ్లెట్ రూపంలో నోటిద్వారా తీసుకోవచ్చు. ఇంజెక్షన్‌‌ రూపంలో కండరాల్లోకి ఎక్కిస్తారు. 1929లో మిన్నెసోటా క్లినిక్‌‌లో కీళ్లనొప్పులున్న ఓ వయసు మళ్లిన పేషెంట్ కోసం ఈ డ్రగ్‌‌ను క్రియేట్‌‌ చేశారు. కానీ, దీనిని అఫీషియల్‌‌గా కనిపెట్టింది మాత్రం 1957లో పిలిప్‌‌ హెన్చ్‌‌ అనే అమెరికన్‌‌ ఫిజిషియన్‌‌. స్కిన్‌‌ డిసీజ్‌‌లు, అలర్జీలు, ఆస్తమా, మెదడువాపు, కంటి నొప్పి, టీవీ యాంటీబయాటిక్స్‌‌లోనూ ఈ డ్రగ్‌‌ను ఉపయోగిస్తారు. మెడికల్ అప్రూవల్‌‌తో 1961 నుంచి ఇది మార్కెట్‌‌లోకి వచ్చింది. మెడికల్ షాపుల్లో ఎక్కువగా దొరుకుతుంది. పైగా ధర కూడా తక్కువ. కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో దీనిని ‘ప్రాణదాత’గా అభివర్ణిస్తోంది డబ్ల్యూహెచ్‌‌వో. అలాగని ఇది జబ్బును పూర్తిగా నయం చేస్తుందన్న గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు సైంటిస్టులు. కరోనా పేషెంట్లలో క్రిటికల్‌‌ కండిషన్‌‌లో ఉన్న పేషెంట్లకు డెక్సామెథాసోన్‌‌ ను ఇచ్చారు. రికవరీ పేరుతో యూకే చేపట్టిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్‌‌లోనే ఈ రిజల్ట్‌‌ వెలుగు చూడటం విశేషం. ఇందులో తక్కువ డోస్‌‌ ఇచ్చినప్పటికీ.. కరోనా పేషెంట్లు చావుబతుకుల నుంచి కోలుకున్నారు. అయితే మైల్డ్ సింప్టమ్స్ ఉన్న పేషెంట్లపై ఇది ఎలాంటి ప్రభావం చూపించకపోవడం మరో విశేషం. డెక్సామెథాసోన్‌‌ వల్ల యూకే మొత్తం మీద ఇప్పటిదాకా ఐదువేల మంది ప్రాణాలు దక్కాయి. దీంతో హైరిస్క్ పేషెంట్లకు వరప్రదాయినిగా మారింది డెక్సామెథాసోన్‌‌. క్లినికల్‌‌ ట్రయల్స్‌‌లో మంచి ఫలితం రావడంతో నేషనల్ హెల్త్ సర్వీస్‌‌కు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. అలా కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో ఈ మెడిసిన్‌‌ను త్వరగా అడాప్ట్‌‌ చేసుకున్న దేశంగా బ్రిటన్‌‌కి గుర్తింపు దక్కింది. అయితే సొంత అవసరాలకు మాత్రమే వాడుకోవాలనే ఉద్దేశంతో ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా బ్యాన్ విధించింది. యూకే తర్వాత పాకిస్తాన్‌‌ డెక్సామెథాసోన్‌‌ను కరోనా పేషెంట్లపై ప్రయోగించడానికి ఆసక్తి చూపిస్తోంది. మన దేశంలో కొన్ని హాస్పిటల్స్‌‌లో కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో ఈ మెడిసిన్‌‌ను ఉపయోగిస్తున్నారు.

డబ్ల్యూహెచ్‌‌వో ఏం చెప్పిందంటే..
కరోనా బారినపడి ప్రాణాపాయ స్థితికి చేరిన వాళ్లకు మాత్రమే డెక్సామెథాసోన్‌‌ను ఉపయోగించాలని డబ్ల్యూహెచ్‌‌వో గైడ్‌‌లైన్స్‌‌ రిలీజ్‌‌ చేసింది. సాధారణంగా కరోనా సివియర్‌‌ స్టేజీలో ఉన్నవాళ్లకు ఆక్సిజన్‌‌ అందించడటంతో పాటు వెంటిలేటర్‌‌పై ఉంచుతారు. వెంటిలేటర్‌‌పై ఉండి డెక్సామెథాసోన్‌‌ ఇస్తే రిజల్ట్ ఒకలా, ఆక్సిజన్‌‌ అందిస్తూ డెక్సామెథాసోన్‌‌ ఇవ్వడం వల్ల మరోలా ఫలితం వచ్చింది. అలాకాకుండా ఆక్సిజన్‌‌, వెంటిలేటర్‌‌ ద్వారా ట్రీట్‌‌మెంట్ ఇస్తూ డెక్సామెథాసోన్‌‌ అందించడం వల్ల మరణాల రేటు తగ్గింది. ఇది మంచి డెవలప్‌మెంట్‌. వెంటిలేటర్స్‌‌పై ఉన్నవాళ్ల డెత్‌‌ రిస్క్‌‌ను మూడింట ఒక వంతుకి, ఆక్సిజన్‌‌ సాయం తీసుకున్నవాళ్ల డెత్‌‌ రేట్‌‌ని ఐదింట ఒకవంతుకి తగ్గించింది డెక్సామెథాసోన్‌‌. అందుకే డెక్సామెథాసోన్‌‌కి ‘లైఫ్‌‌ సేవింగ్‌‌’ గుర్తింపు ఇచ్చింది డబ్ల్యూహెచ్‌‌వో.

సైడ్‌‌ఎఫెక్ట్స్‌‌
డెక్సామెథాసోన్‌‌ను ఎక్కువ కాలంగానీ, డోస్‌‌ ఎక్కువగానీ ఉపయోగిస్తే కండరాలు బలహీనపడ్తాయి. ఎముకల్లో గుజ్జుపై ఎఫెక్ట్‌‌ పడి అరిగిపోతాయి. బాడీలో మంటపుడుతుంది. ముఖ్యంగా పిల్లలకు పాలిచ్చే తల్లులు ఈ మెడిసిన్‌‌ను అస్సలు వాడకూదు.

రెమ్డ్‌‌సివిర్‌‌
అమెరికా బయో ఫార్మాస్యూటికల్స్‌‌‌‌ కంపెనీ ‘గిలియ‌‌డ్ సైన్సెస్‌‌’ 2009 నుంచి రెమ్డ్‌‌సివర్‌‌ డ్రగ్‌‌ రిలీజ్‌‌ చేస్తోంది. నిజానికి దీనిని ‘సి టైప్‌‌ హెపటైటిస్‌‌’ కోసం డెవలప్‌‌ చేసింది. కానీ, అది వర్కవుట్ కాలేదు. అనుకోకుండా 2014లో ఎబోలా, మార్‌‌బర్గ్‌‌ వైరస్‌‌ ఇన్ఫెక్షన్స్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌లో సాయపడింది. ఆ తర్వాత ఫిలో, న్యూమో, పారామిక్సో వైరస్‌‌ల ట్రీట్‌‌మెంట్‌‌లో ఇది యాంటీవైరల్ యాక్టివిటీ చూపించింది. ఫైనల్‌‌గా ఇప్పుడు కరోనా విషయంలో ఇది పాజిటివ్ రిజల్ట్స్ చూపిస్తోందని కంపెనీ ప్రకటించుకుంది. జనవరి నుంచే చాలా దేశాల్లో రెమ్డ్‌‌సివిర్‌‌ డ్రగ్‌‌ ఆధారంగా ట్రయల్స్‌‌ జరిగాయి. తొలుత చైనాలో దీనిపై క్లినికల్ ట్రయల్స్‌‌ జరిగాయి. నెగెటివ్ రిజల్ట్ రావడంతో ఆ ట్రయల్స్‌‌ని ఆపేశారు. అయితే ఆ తర్వాత పలు దేశాల్లో జరిగిన వివిధ క్లినికల్ టెస్టుల్లో కొవిడ్‌‌ పేషెంట్లు కోలుకున్నారని ప్రకటించింది గిలియడ్ సైన్సెస్‌‌. దీంతో క్లినికల్ మేనేజ్‌‌మెంట్ ప్రొటోకాల్‌‌ ప్రకారం ‘‘ఇన్వెస్టిగేషనల్ థెరపీ’’లో భాగంగా రెమ్డ్‌‌సివర్‌‌ డ్రగ్‌‌ను ఉపయోగించొచ్చని మన దగ్గర సెంట్రల్‌‌ హెల్త్ మినిస్ట్రీ పర్మిషన్‌‌ ఇచ్చింది. ఆ వెంటనే మెడిసిన్స్‌‌ తయారీకి మన దేశానికి చెందిన చాలా కంపెనీలు గిలియడ్‌‌ సైన్సెస్‌‌తో ఒప్పందం చేసుకున్నాయి. వీటిలో హెటిరో, సిప్లా ఫార్మా కంపెనీలు ఇప్పటికే మెడిసిన్స్‌‌ తీసుకొస్తుండగా, మరికొన్ని ఫార్మా కంపెనీలు డీసీజీఐ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. మరోవైపు జపాన్‌‌, అమెరికాల్లో ఇప్పటికే కొవిడ్‌‌-19 రోగులకు ట్రీట్‌‌మెంట్‌‌లో టెస్ట్ చేశారు. అమెరికాలో ఫుడ్‌‌ అండ్‌‌ డ్రగ్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌(ఎఫ్‌‌డీఏ) రెమ్డ్‌‌సివర్‌‌ను అత్యవర చికిత్సలో.. అది కూడా కరోనాతో లేదంటే అనుమానిత లక్షణాలతో హాస్పిటల్‌‌తో చేరిన పెద్దలకు, పిల్లలకు మాత్రమే ఉపయోగించాలని చెప్పింది. కానీ, ఇంకా ట్రయల్స్‌‌ నడుస్తున్న కారణంగా అది అమలు కావట్లేదు. పాకిస్తాన్‌‌లో ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు రెమ్డ్‌‌సివిర్‌‌ ఆధారంగా మెడిసిన్‌‌ తయారీని మొదలుపెట్టాయి. క్లినికల్ ట్రయల్స్‌‌లో ఈ డ్రగ్‌‌ పాజిటివ్‌‌ రిజల్ట్‌‌ ఇస్తోందని చైనా, బ్రెజిల్‌‌లు ప్రకటించుకున్నాయి. యూకే కూడా దీనికి అనుమతి ఇచ్చినప్పటికీ అక్కడ సప్లయ్‌ తక్కువగా ఉంటోంది. ఈ యాంటీవైరల్‌‌ మెడికేషన్‌‌ ఫలించడంతో సింగపూర్‌‌తో పాటు మరో వందకి పైగా దేశాలు మందుల తయారీకి రెడీ అవుతున్నాయి.

సైడ్ ఎఫెక్ట్స్‌‌

ఎమర్జెన్సీ ట్రీట్‌‌మెంట్‌‌లో రెమ్డ్‌‌సివిర్‌‌ ఉపయోగిస్తున్నప్పటికీ.. దాంతో సైడ్‌‌ ఎఫెక్ట్స్‌‌ కూడా ఉంటున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అవయవాలు పని చేయకపోవడం, చర్మం పసుపు రంగులోకి మారిపోవడం, గ్యాస్ట్రిక్‌‌ సమస్యలు రావొచ్చు. వీటితోపాటు లివర్‌‌కి డ్యామేజ్‌‌ జరిగే ఛాన్స్‌‌ కూడా లేకపోలేదు. మనదగ్గర లివర్‌‌ సంబంధ జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, గర్భిణిలు, 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు కూడా రెమ్డ్‌‌సివిర్ వాడకూడదని గైడ్‌‌లైన్స్‌‌ జారీ అయ్యాయి.

ఫావిపిరవిర్‌
జపాన్‌‌ టోయామా కెమికల్‌‌ (ఫుజిఫిల్మ్‌‌ గ్రూప్‌‌) తయారుచేసిన యాంటీవైరల్ డ్రగ్‌‌ ఇది. 2014 నుంచి ‘అవిగాన్‌‌/అబిగాన్’ బ్రాండ్‌‌ పేరుతో మార్కెట్‌‌లో అమ్ముతున్నారు. ఇన్‌‌ఫ్లుయెంజా ట్రీట్‌‌మెంట్‌‌ కోసం దీనిని తయారు చేశారు. ఇది బాడీలో వైరస్‌‌ రిప్లికేషన్‌‌(వైరస్‌‌ పెరగకుండా)అడ్డుకుంటుంది. అయితే ఫావిపిరవిర్‌‌ను సీజనల్‌‌ ఇన్‌‌ఫ్లుయెంజా కోసం కాకుండా.. సివియర్ ఇన్‌‌ఫ్లుయెంజా ట్రీట్‌‌మెంట్‌‌లో మాత్రమే వాడాలని జపాన్‌‌లో రూల్ ఉంది. ఫిబ్రవరిలో కొవిడ్‌‌–19 పేషెంట్లపై ఫావిపిరవిర్ టాబెట్లను ఎక్స్‌‌పెరిమెంటల్‌‌గా చైనా ఉపయోగించింది. క్లినికల్ ట్రయల్స్‌‌ ద్వారా 340 పేషెంట్లపై టెస్ట్ చేసింది. ఆ ట్రయల్స్‌‌లో సేఫ్టీ, ఎఫెక్టివ్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌గా తేలింది. ఆ తర్వాతే క్లినికల్ ట్రయల్స్‌‌లో జపాన్‌‌ వాడింది. ఎయిడ్స్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ కోసం ఉపయోగించే లోపినవిర్/రిటోనవిర్‌‌తో పోల్చుకుంటే ఫావిపిరవిర్‌‌ మంచి ఫలితం ఇచ్చింది. మొత్తం 80 కరోనా పేషెంట్లలో ఆరోగ్యం మెరుగుపడింది. కాకపోతే వాళ్లకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్‌‌ వచ్చినట్లు సీటీ స్కాన్‌‌ రిపోర్ట్స్‌‌ తేల్చాయి. మార్చిలో ఇటలీలో కరోనా ఏ రేంజ్‌‌లో విజృంభించిందో తెలియంది కాదు. ఆ టైంలో ఎక్స్‌‌పెరిమెంటల్‌‌ డ్రగ్ కింద ఫావిపిరవిర్‌‌ను ఉపయోగించింది అక్కడి మెడికల్ స్టాఫ్‌‌. మస్సాచుసెట్స్‌‌, లండన్‌‌ క్లినికల్ ట్రయల్స్‌‌లో ఇదే డ్రగ్‌‌ పాజిటివ్‌‌ రిజల్ట్ చూపించింది. దీంతో రష్యా ‘అవిఫవిర్‌‌’ పేరుతో ఫావిపిరవిర్‌‌కి జెనరిక్‌‌ వెర్షన్‌‌ను రిలీజ్ చేసింది. ఇప్పుడు మన దగ్గర కూడా ఫావిపిరవిర్‌‌ మెడిసిన్స్‌‌ రాబోతున్నాయి. అయితే ఎక్కువ క్లినికల్ టెస్టులలో ఇది పాస్‌‌ కావడానికి ఒక రీజన్‌‌ ఉంది. ఫస్ట్ ఫేజ్‌‌ క్లినికల్ ట్రయల్స్‌‌లో.. అది కూడా మైల్డ్ సింటమ్స్‌‌ ఉన్న పేషెంట్లపై వాడేందుకు మాత్రమే పర్మిషన్‌‌ ఉండటం వల్లే ఇది ఎక్కువ పాజిటివ్‌‌ రిజల్ట్ చూపించి ఉండొచ్చని ఒక అంచనా.

సైడ్ ఎఫెక్ట్‌‌

ఫావిపిరవిర్‌‌ ప్రత్యేకించి వైరస్‌‌ల ఆర్‌‌ఎన్‌‌ఏపై ఎఫెక్ట్ చూపెడుతుంది. కానీ, ఇది వండర్‌‌ డ్రగ్‌‌ కాదన్నది చాలామంది మెడికల్ ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్న మాట. పైగా దీనిపై ట్రయల్స్‌‌ ఇంకా కొనసాగుతున్నందువల్ల ఇది కరోనాకి మందుగా అనుకోవద్దని చెప్తున్నారు. ఇది వాడిన వాళ్లలో సైడ్‌‌ ఎఫెక్ట్స్‌‌గా వికారం, వాంతులు లాంటివి రావొచ్చు. లివర్‌‌, కిడ్నీ జబ్బులున్నవాళ్లు ఉపయోగించడం మంచిది కాదని, ప్రెగ్నెసీ టైంలో అసలే వాడకూడదని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్నారు.

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌.. కాంట్రవర్సీ
యాంటీ మలేరియా మెడిసిన్‌‌ క్లోరోక్విన్‌‌, దానికి రిలేటెడ్‌‌ డ్రగ్‌‌ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌. 1930లో మలేరియా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. బేయర్ ల్యాబొరేటరీస్‌‌(జర్మనీ) సైంటిస్ట్‌‌ హాన్స్ ఆండర్‌‌సాగ్ 1934 లో క్లోరోక్విన్‌‌ను కనుగొన్నాడు. అప్పుడు దానికి ‘రిసోచిన్’ అని పేరుపెట్టాడు.కానీ, అది విషపూరితమన్న అనుమానంతో పదేళ్లపాటు దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అమెరికన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత రిసోచిన్‌‌కి ఒక గుర్తింపు దక్కింది. అయితే దాని నుంచి సైడ్‌‌ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండటంతో మరింత డెవలప్‌‌ చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌(1950లో) గ్లోబల్ మార్కెట్‌‌లోకి రిలీజ్ చేశారు. పెయిన్‌‌ రిలీఫ్‌‌కి 1960 నుంచి వీటిని వాడుతుండగా, 1977 నుంచి ఎమర్జెన్సీ మెడిసిన్ లిస్ట్‌‌లో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌ను యాడ్ చేశారు. తర్వాతి రోజుల్లో డెవలప్డ్‌‌ కంట్రీస్‌‌లో మలేరియా తీవ్రత తగ్గినప్పటికీ.. డెవలపింగ్‌‌, చిన్న దేశాల్లో ఆ సమస్య ఇప్పటికీ ఉంది. ఆ దేశాలకు మనతో పాటు చైనా ఎక్కువగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌ను ఎక్స్‌‌పోర్ట్ చేస్తుంటాయి. మన దగ్గర గవర్నమెంట్‌‌ హాస్పిటల్స్‌‌లో ఈ మెడిసిన్‌‌ ఎక్కువగా దొరుకుతుంది. ఇప్పుడు కరోనా టైంలో ఇదే కరెక్ట్ మందు అనే ప్రచారంతో మళ్లీ దీనికి గిరాకీ ఏర్పడింది.

కరోనా టైంలో ఈ యాంటీ మలేరియా మెడిసిన్‌‌లో కరోనా వైరస్‌‌కు యాంటీగా పని చేసే లక్షణాలు ఉన్నాయని రీసెర్చర్లు గుర్తించారు. రీసెర్చ్‌‌ మధ్యలో ఉండగానే ఈ మెడిసిన్‌‌ వాడకాన్ని పెంచేశారు. చైనాలో క్లినికల్ ట్రయల్‌‌లో వంద మంది కరోనా పేషెంట్లకు క్లోరోక్విన్ తో ట్రీట్‌‌మెంట్‌‌ చేశారు. మిగిలిన వారితో పోలిస్తే క్లోరోక్విన్ తీసుకున్న వారి పరిస్థితి మెరుగుపడిందని అక్కడి సైంటిస్టులు చెప్పారు. ఫ్రాన్స్ లో 600 మందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇచ్చి అబ్జర్వేషన్‌‌ ట్రయల్ చేయాలనుకున్నారు. ఇందులో ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తొలి 26 మందిలో ఆరుగురికి నయమయ్యింది. అటు అమెరికాలోనూ హైడ్రాక్సీ క్లోరోక్విన్ సానుకూల ఫలితాలనిచ్చింది. దీని పని తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌ ఇదొక ‘సంజీవని’అంటూ చేసిన కామెంట్, ‘ఇది కరోనాకు విరుగుడుగా పనిచేస్తుంది’ అని బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సనారో చెప్పడంతో అందరి దృష్టి ఈ డ్రగ్‌‌ మీద పడేలా చేసింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌ను భారీ మొత్తంలో ఎగుమతి చేయాలని పలు దేశాలు మనను ఆశ్రయించాయి. ఆ తర్వాతే సివియర్ స్టేజ్‌‌లో ఉన్న కొవిడ్ పేషెంట్లపై దీని వాడకం మరింత ఎక్కువైంది.

నెగెటివిటీ
కొంతకాలానికే కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌పై వివాదం రాజుకుంది. క్లోరోక్విన్‌‌కు అనుబంధమైన హైడ్రాక్సి క్లోరోక్విన్‌‌.. యాంటి వైరస్‌‌, పేషెంట్‌‌ ఇమ్యూనిటీపై ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. ఫ్రాన్స్‌‌లో తొలి ఫేజ్‌‌ ట్రయల్స్‌‌ సానుకూల ప్రభావం చూపెట్టినా.. తర్వాత నెగెటివ్ ఎఫెక్ట్ కనిపించింది. దీంతో అక్కడ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌ను బ్యాన్‌‌ చేశారు. స్వీడన్ లో కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో ఈ మెడిసిన్‌‌ వల్ల వంద మందిలో ఒకరికి గుండె, కిడ్నీలపై ఎఫెక్ట్ పడింది. దీంతో స్వీడన్‌‌లోనూ ట్రయల్స్‌‌లో క్లోరోక్విన్‌‌ను ఉపయోగించడం ఆపేశారు. నిజానికి మలేరియాతో పాటు రుమటాయిడ్‌‌ ఆర్ధరైటిస్‌‌కు కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌ మెడిసిన్‌‌గా పని చేస్తుంది. . అందుకే కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో కొంత వరకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు.
కానీ, డబ్ల్యూహెచ్‌‌వో మాత్రం మొదటి నుంచి క్లోరోక్విన్‌‌ విషయంలో ప్రతికూలంగా వ్యహరిస్తోంది. పైగా ప్రాణాలు పోయే ఛాన్స్‌‌ ఉందనే అనుమానాల నడుమ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌, క్లోరోక్విన్‌‌ను ట్రీట్‌‌మెంట్‌‌లో ఉపయోగించకుండా బ్యాన్‌‌ చేసింది డబ్ల్యూహెచ్‌‌వో. ఈ నిర్ణయం గొడవకు దారితీయడంతో కొన్నాళ్లకే ఆ బ్యాన్‌‌ను ఎత్తేసింది.

సైడ్‌ ఎఫెక్ట్స్‌

క్లోరోక్విన్‌‌ను కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో ఉపయోగించే సీన్‌‌ లేదని కొందరు సైంటిస్టులు కరాకండిగా చెప్తున్నారు. ఎక్కువ రీసెర్చ్‌‌ల ఫలితాల్ని పరిశీలించాకే కొవిడ్ పేషెంట్లపై క్లోరోక్విన్‌‌ను ప్రయోగించడం మంచిదని సూచిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని దేశాలు మాత్రం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌, క్లోరోక్విన్‌‌తో ట్రీట్‌‌మెంట్ చేస్తున్నాయి. బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో మాత్రం దీనిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. మనదగ్గర అజిత్రోమైసిన్‌ను కలిపి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను(ట్రంప్‌‌ కూడా ఇదే కాంబినేషన్‌‌ తీసుకున్నాడు కొన్నాళ్లు) ట్రీట్‌‌మెంట్‌‌లో ఉపయోగిస్తున్నారు. కానీ, 15 ఏళ్ల లోపు పిల్లలు, అరవై ఏళ్లు దాటిన పెద్దలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను ఇవ్వొద్దని ఇండియన్‌‌ మెడికల్‌‌ రీసెర్చ్‌‌ కౌన్సిల్‌‌ (ఐసీఎంఆర్‌‌) ఆదేశించింది. అమెరికా ఎఫ్‌‌డీఏ మాత్రం క్లోరోక్విన్‌‌ను ఎమర్జెన్సీ ఆథరైజేషన్ లిస్ట్‌‌ నుంచి తొలగించి.. ట్రీట్‌‌మెంట్‌‌లో మాత్రం ఉపయోగిస్తోంది. అంతేకాదు రెమ్డ్‌‌సివర్‌‌ను క్లోరోక్విన్‌‌తో కలిపి ఇవ్వొద్దని, దానివల్ల రెమ్డ్‌‌సివర్‌‌కున్న యాంటీ వైరల్ లక్షణం పోతుందని అమెరికన్‌‌ సైంటిస్టులు చెప్తున్నారు. మరోవైపు క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌తో హార్ట్ ఎటాక్‌‌ కేసులు పెరగొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తలనొప్పి, ఇంటర్నల్‌‌ పార్ట్స్‌‌ దెబ్బతినడం, మెంటల్ హెల్త్‌‌ ఇష్యూస్‌.. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌ వాడటం వల్ల వచ్చే సైడ్‌‌ ఎఫెక్ట్స్‌‌.

రికవరీ ట్రయల్స్‌‌..

ఫేజ్‌‌ త్రీ, ఫోర్‌‌ క్లినికల్ ట్రయల్స్‌‌లో భాగంగా వందకి పైగా దేశాలతో వరల్డ్‌‌ హెల్త్‌‌ ఆర్గనైజేషన్‌‌ ‘సాలిడారిటీ ట్రయల్‌‌’ నిర్వహించినట్లే.. యూకే ‘‘రికవరీ ట్రయల్’’ (ర్యాండమైజ్డ్‌‌ ఎవాల్యుయేషన్‌‌ ఆఫ్‌‌ కొవిడ్‌‌-19 థెరపీ) నిర్వహించింది. కొవిడ్‌‌ పేషెంట్లు కోలుకునేందుకు కావాల్సిన మార్గాలన్నింటిని ఈ ట్రయల్స్‌‌ ద్వారా కనిపెట్టబోతున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఇదే అతిపెద్ద ట్రయల్ . ఇప్పటికే ఐదు వేల మందిపై ఈ ట్రయల్ సక్సెస్‌‌ఫుల్‌‌గా పూర్తయ్యింది. హెచ్‌‌ఐవీ ట్రీట్‌‌మెంట్‌‌లో వాడే లోపినవిర్‌‌–రిటోనావిర్, తక్కువ డోస్‌‌ డెక్సామెథాసోన్‌‌, యాంటీ మలేరియా డ్రగ్‌‌ హైడ్రోక్సిక్లోరోక్విన్‌‌, యాంటీబయాటిక్‌‌ అయిన అజిథ్రోమైసిన్‌‌, ఇంజెక్షన్‌‌ రూపంలో టోసిలిజుమబ్‌‌ ప్రయోగిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఐదు మందులతో ట్రీట్‌‌మెంట్‌‌తో పాటు ప్లాస్మా థెరపీని కొనసాగించాలని డిసైడ్‌‌ అయ్యింది. వీటితో పాటు ట్రీట్‌‌మెంట్‌‌లో కోఆపరేట్ చేసే మరికొన్ని మందుల్ని కూడా యాడ్ చేయబోతున్నారు. 2021 నాటికి రికవరీ ట్రయల్ కోసం 12 వేల మందిని టార్గెట్ పెట్టుకోగా.. జూన్ నాటికి రికవరీ ట్రయల్‌‌లో రిజిస్టర్‌‌ అయిన పేషెంట్ల సంఖ్య 11, 500కి చేరుకోవడం విశేషం. యూకే నేషనల్ హెల్త్ సర్వీస్‌‌ హాస్పిటల్స్‌‌లో పేషెంట్లపై ఈ ట్రయల్ కొనసాగుతోంది. ఆక్స్‌‌ఫర్డ్‌‌ యూనివర్సిటీ రికవరీ ట్రయల్‌‌ను స్పాన్సర్‌‌ చేస్తోంది. 28 రోజుల పాటు కరోనా పేషెంట్ల ట్రీట్‌‌మెంట్స్‌‌ తీరును యూకే డాక్టర్లు, సైంటిస్టులు గమనిస్తారు.

వ్యాక్సిన్.. జెట్‌‌ స్పీడ్‌‌!
ఒకవైపు అగ్రరాజ్యాలన్నీ వ్యాక్సిన్‌‌ రేసులో పోటీపడుతున్నాయి. ట్రీట్‌‌మెంట్‌‌ కోసం మెడిసిన్స్‌‌ తయారీలో తలమునకలై ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌‌వో లెక్కల ప్రకారం.. 13 రకాల వ్యాక్సిన్లను మనుషులపై ప్రయోగిస్తున్నారు. 80 కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఆక్స్‌‌ఫర్డ్‌‌ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా ఫార్మా కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్‌‌ తుది దశ క్లినికల్‌‌ ట్రయల్స్‌‌కు చేరుకుంది. సాధారణ జలుబు కలిగించే వైరస్‌‌ను బలహీనం చేసి (సీహెచ్‌‌ఏడీఓఎక్స్‌‌1).. దాన్నుంచి ‘సీహెచ్‌‌ఏడీఓఎక్స్‌‌1 ఎన్‌‌సీవోవీ-19’(చెడాక్స్‌‌1 ఎన్ కోవ్‌‌-–19) పేరుతో ఈ వ్యాక్సిన్‌‌ను రూపొందించారు. టీకా రేసులో ఇదే ఇప్పటివరకు మెరుగైన ఫలితం. ఇండియా సహా పలు ఇతర పేద దేశాలకు 100 కోట్ల డోసుల వ్యాక్సిన్‌‌ను రూపొందించేందుకు సీరమ్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఎస్‌‌ఐఐ) 100 మిలియన్‌‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. కాగా.. మరో 13 వ్యాక్సిన్లు ప్రస్తుతం క్లినికల్‌‌ ట్రయల్స్‌‌ దశలోను, 129 వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్‌‌ ట్రయల్స్‌‌ దశలో ఉన్నాయని డబ్ల్యూహెచ్‌‌వో తాజాగా ప్రకటించింది. క్లినికల్‌‌ దశలో ఉన్నవాటిలో.. అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్‌‌ వచ్చే నెలలో చివరి స్టేజ్‌‌కి చేరతాయి. ఇవికాకుండా సియాటిల్‌‌లో ఒక వ్యాక్సిన్‌‌తో మనుషులపై టెస్టింగ్‌‌ ప్రారంభించారు. ఆస్ట్రేలియాలో ఫెర్రెట్‌‌ అనే జంతువుల మీద రెండు వ్యాక్సిన్లను ప్రయోగించారు. ఈ ఫలితాలు రావాల్సి ఉంది. కానీ, కరోనా పుట్టినిల్లు చైనా మాత్రం డిఫరెంట్‌‌ పంథాలో ముందుకెళ్తోంది. మొదట్లో వ్యాక్సిన్‌‌కి బదులుగా డ్రగ్‌‌తోనే కరోనాకి చెక్‌‌ పెట్టే దిశగా ప్రయోగాలు చేయించింది. బీజింగ్‌‌ అడ్వాన్స్డ్‌‌ ఇన్నొవేషన్‌‌ సెంటర్‌‌ ఫర్ జీనోమిక్స్‌‌ తరపున ఒక డ్రగ్‌‌ను(పేరు, కాంపోనెంట్‌‌ చెప్పకుండా) రిలీజ్ చేసింది. తక్కువ టైంలో కరోనా పేషెంట్లను రికవరీ అయ్యేలా చేయడమే కాకుండా… ఇమ్యూనిటీని కూడా పెంచిందని ప్రకటించుకుంది. ఇప్పుడు వ్యాక్సిన్‌‌ రేసులో దూకుడు చూపిస్తోంది. చైనాకు చెందిన సినోవాక్‌‌ బయోటెక్‌‌ వ్యాక్సిన్‌‌ రేస్‌‌లో టాప్‌‌ పొజిషన్‌‌లో ఉంది. చైనాకే చెందిన మరో వ్యాక్సిన్‌‌ కంపెనీ కూడా యూఏఈలో హ్యూమన్‌‌ ట్రయల్స్‌‌కి పర్మిషన్‌‌ దక్కించుకుంది. డ్రాగన్‌‌ స్పీడ్‌‌ చూస్తుంటే త్వరగా వ్యాక్సిన్‌‌ను మార్కెట్‌‌లోకి తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇంత త్వరగా వ్యాక్సిన్‌‌ తేవడం మంచిది కాదని, అది ఎఫెక్టివ్‌‌గా పని చేయదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు కొవిడ్‌‌పై పోరులో చిన్నదేశాల ముందడుగు వేస్తున్నాయి. కరోనా కట్టడికి ప్రయత్నిస్తూనే.. డ్రగ్స్‌‌, వ్యాక్సిన్ ప్రయోగాలను వేగవంతం చేస్తున్నాయి. స్టెరాయిడ్స్‌‌, మెడిసిన్స్‌‌తో పేషెంట్లకు నార్మల్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ ఇప్పిస్తున్నాయి. హెర్డ్‌‌ ఇమ్యూనిటీ ద్వారా కరోనా తీవ్రతను తగ్గించుకుంటున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లో ఐసీయూ యూనిట్ల కొరత ఆ దేశాలకు ప్రధాన సమస్యగా ఉంది. అయినప్పటికీ ఇంక్యుబేషన్‌‌, వెంటిలేషన్‌‌.. చివరి అస్త్రంగా ప్రయోగిస్తాయి ఆయా దేశాలు.

షాక్‌ ఇచ్చిన నైజీరియా
కరోనా మహమ్మారిని తట్టుకుంటూనే వ్యాక్సిన్‌‌ ప్రయోగాలను కొనసాగిస్తున్నాయి అన్ని దేశాలు. అయితే ఆఫ్రికా దేశం నైజీరియా వ్యాక్సిన్‌‌ను కనిపెట్టామని ప్రకటన చేయడంతో అగ్రరాజ్యాలు ఉలిక్కిపడ్డాయి. అడిలెక్‌‌ యూనివర్సిటీ మెడికల్‌‌ వైరాలజీ ఎక్స్‌‌పర్ట్ డాక్టర్‌‌ ఒడడిపో కొలవోల్‌‌ ప్రధాన సైంటిస్టుగా సైంటిస్టుల టీమ్‌ ఈ వ్యాక్సిన్‌‌ను తయారు చేసిందని ప్రముఖ మీడియాహౌజ్‌‌ ‘ది గార్డియన్‌‌’ ఒక కథనం ప్రచురించింది. కానీ, మార్కెట్‌‌లోకి రావడానికి ఇంకో పద్దెనిమిది నెలలు పట్టే ఛాన్స్‌‌ ఉంద’ని డాక్టర్‌‌ కొలవోల్ చెప్పారు. అయితే ఆ ఆర్టికల్ పబ్లిష్ చేసిన రెండు రోజులకే ‘వ్యాక్సిన్‌‌ రేసులో నైజీరియా ఓడిపోవచ్చు’ అంటూ అదే గార్డియన్‌‌ మరో కథనం ప్రచురించడం మరో విశేషం.

ఆ.. అజాగ్రత్తే వద్దు!

‘కరోనాకు మందులొచ్చేస్తున్నాయ్‌‌‌‌. వ్యాక్సిన్ కూడా తొందర్లోనే వచ్చేస్తదేమో. ఇంకేం కరోనా గురించి రంది పడాల్సిన పనిలేద’నే ఫీలింగ్‌‌‌‌ చాలామందిలో పెరిగిపోతోంది. అయితే, కరోనా చేసే డ్యామేజ్‌‌‌‌ ఇక్కడితోనే అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్‌‌‌‌లోకి వచ్చిన ఏ మందు కూడా ‘గేమ్ ఛేంజర్‌‌‌‌’ కాదన్నది హెల్త్ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ చెప్తున్న మాట. పారాసిటమాల్, సిట్రజిన్‌‌‌‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌‌‌, అజిత్రోమైసిన్‌‌‌‌ తరహాలోనూ ఇవి కూడా కొవిడ్‌‌‌‌–19పై తక్కువ ప్రభావం చూపెడుతున్నాయని చెప్తున్నారు. పైగా కొత్తగా కరోనా మందుల పేరిట వస్తున్నవేవీ కొత్త ఫార్ములాతో తయారయ్యినవి కావు. అల్రెడీ మార్కెట్‌‌‌‌లో ఇతర పేర్లతో రకరకాల జబ్బులకు వాడుతున్నవే. కాకపోతే ఇప్పుడు కరోనా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం ఎక్స్‌‌పరిమెంటల్‌‌గా ఉపయోగిస్తున్నారు. అంతేతప్పించి అవి కొవిడ్‌‌‌‌–19 నయం చేస్తాయని కాదు. కరోనా సిచ్యుయేషన్‌‌‌‌ వల్ల వాటి పేర్లు మార్చేసి.. రేట్లు పెంచేసి అమ్ముతున్నారని కొందరు హెల్త్ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ అంటున్నారు. ఫార్మా కంపెనీలు వీటికి సంబంధించి క్లినికల్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌ ఎక్కడ చేశాయో.. వాలిడేటెడ్‌‌‌‌ స్టడీ ఎలా జరిగిందో చెప్పకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
వీటన్నింటికి తోడు అర్జెంట్‌‌‌‌ నీడ్‌‌‌‌ పేరుతో డ్రగ్‌‌‌‌ అథారిటీ కంట్రోల్ వీటిని పర్మిషన్లు ఇవ్వడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ‘డ్రగ్స్‌‌‌‌ మాఫియా’ పేరుతో మీద చాలా మెసేజ్‌‌‌‌లు ఫార్వార్డ్‌‌‌‌ అవుతున్నాయి కూడా. మొత్తం మీద కరోనాకు టీకా కూడా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదన్నది ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ చెప్తున్నమాట. ఒకవేళ వచ్చినా వ్యాక్సిన్‌‌‌‌ వల్ల కలిగే సైడ్‌‌‌‌ ఎఫెక్ట్స్‌‌‌‌ను గురించి మరింత రీసెర్చ్‌‌‌‌ జరగాలి. అది క్లియర్‌ అయ్యాకే వ్యాక్సిన్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లోకి వస్తుంది. అక్కడి నుంచి అన్ని దేశాల మార్కెట్‌‌‌‌లోకి వ్యాక్సిన్‌‌‌‌ రావడానికి చాలా టైం పడుతుందని అంటున్నారు ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌. అలాగే ఇప్పుడు వాడుతున్న మందులు కేవలం సింప్టమ్స్‌‌‌‌ని బట్టి టెంపరరీ రిలీఫ్‌‌‌‌ ఇస్తాయి. కాబట్టి, ఇంతకాలం పాటించిన ఫిజికల్ డిస్టెన్స్‌‌‌‌, మాస్కులు ధరించడం, శానిటైజర్ల శుభ్రత తదితర జాగ్రత్తలు కంటిన్యూ చేయాల్సిన అవసరమే ఉంది. కొవిడ్‌‌‌‌-–19 జబ్బుకు కచ్చితంగా ఇదీ మందు అని ఇప్పటిదాకా లేదు. వ్యాక్సినే శాశ్వతమైన విరుగుడు. అప్పటిదాకా టెంపరరీ మందుల హవా కొనసాగినా.. వ్యాక్సిన్‌‌‌‌ కోసం చాన్నాళ్లే ఎదురుచూడాలి. అది అంత త్వరగా వస్తే అంత మంచిది. మంచిదే కాదు అద్భుతం కూడా. ఎందుకంటే చరిత్రలో ఇప్పటిదాకా ఏ వ్యాక్సిన్‌‌‌‌ కూడా ఇంత తక్కువ టైంలో వచ్చిన దాఖలాలు లేవు కాబట్టి. -దర్వాజ డెస్క్

Latest Updates