టీఆర్ఎస్ గుండాలకు చట్టాలు వర్తించవా ?

టీఆర్ఎస్ గుండాలకు చట్టాలు వర్తించవా ?
  • అధికారులు స్పందించకపోతే ప్రజలు తిరగబడతారు
  • మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమర్ రెడ్డి
     

హుజూర్ నగర్: ఎమ్మెల్యే బామ్మర్దులకు, టీఆర్ఎస్ గుండాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే చట్టాలు వర్తించవా..? అని మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. అధికారులు స్పందించకపోతే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ పీసీసీ ఛీప్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పేరిట దళితులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ పథకాన్ని రచించాడని, హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు తీసుకొచ్చాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడన్నారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి  ప్రతిపక్ష పార్టీ కి సంబంధించిన అన్ని ఫోన్ల టాపింగ్ జరుగుతోందని, పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ ను ఇజ్రాయిల్ దేశం నుండి  తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రతిపక్ష పార్టీలు, ఇతర సంస్థల కు సంబంధించిన ఫోన్ టాపింగ్ చేస్తున్నారని, కాదని కేసీఆర్ ని చెప్పమనండి అని ఆయన సవాల్ చేశారు. కేసీఆర్ మంత్రుల మీద నమ్మకం లేక వాళ్ల మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా టాపింగ్ చేయిస్తున్నాడని, రిటైర్డ్ అధికారులను,  ఇంటలిజెన్స్ ఐజి,  టాస్క్ ఫోర్స్ ఐజీలుగా కేసీఆర్ బంధువులను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిపై విమర్శలు గుప్పించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
 హుజూర్ నగర్ లో ఎప్పుడూ లేని విధంగా అక్రమాలు, అరాచకాలు జరుగుతున్నాయంటూ మొదటిసారి స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిపై మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.  ఫస్ట్ అండ్ లాస్ట్ ఎమ్మెల్యే అంటూ ఏకవచనంతో  విమర్శలు గుప్పించిన ఉత్తమ్..  అతడికి భయపడేది ఏంది అంటూ విలేఖర్లకు హితబోధ చేసే ప్రయత్నం చేశారు. రికార్డు స్థాయిలో అవినీతి చేసి ఆరు నెలల్లో హైదరాబాదు, హుజుర్ నగర్ లో పెద్దపెద్ద భవంతులు రికార్డు స్థాయిలో నిర్మించుకున్నాడని, ఐదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ మంత్రిగా ఉండి తాను సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేకపోయాను అని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. 
హుజూర్ నగర్ అభివృద్ధి పై డిబేట్ అంటే భయపడుతున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్ అభివృద్ధిపై మాట్లాడటానికి భయపడుతున్నారని.. ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ గుండాలు ఓ మీడియా సంస్థ పై దాడికి పాల్పడి, ప్రజాస్వామ్యాన్ని ఖుని చేసినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని విమర్శించారు. గుర్రంపోడు విషయంలో ఓ పార్టీ నాయకులపై పెద్దపెద్ద కేసులు పెట్టి జైల్లో పెట్టిన పోలీసులు.. ఇప్పుడు ఎందుకు మీడియా పై దాడి చేసిన  టిఆర్ఎస్ నాయకుల పై కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బామ్మర్దులకు, టిఆర్ఎస్ గుండాలకు చట్టాలు వర్తించవా.. అధికారులు స్పందించకపోతే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. మీడియాపై దాడి చేసిన పార్టీ నాయకుడ్ని కొందరు విలేకరులే సన్మానం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  హుజూర్ నగర్ పట్టణంలో మున్సిపల్ భూములు, అంజనీ సిమెంట్, చింత్రియాల, గుర్రంపోడు వద్ద ఆక్రమించిన ప్రభుత్వ అటవీ భూముల వ్యవహారం, చెక్ డాం నిర్మాణంలో అవకతవకలు, నాలుగు వేల  ఇండ్లను డంపింగ్ యార్డ్ గా చేసిన వ్యవహారం, కాంట్రాక్టుల్లో కమిషన్ తీసుకుంటున్న వ్యవహారంపై వీరికి సహకరిస్తున్న కేసీఆర్ బంధువు సంతోష్ పై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.