కరోనాకి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆరే: రేవంత్

కరోనా పై రోజూ ప్రధాని మోడీతో మాట్లాడుతానంటున్న సీఎం కేసీఆర్ …ఇక్కడ ప్రధాన ప్రతిపక్షాన్ని మాత్రం ఎందుకు సంప్రదించడని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ప్రపంచం మొత్తం కేసీఆర్ కు, ఆయన కొడుకుకే తెలుసా…? రాజకీయ పార్టీలు, వైద్య నిపుణులతో సంప్రదించాల్సిన అవసరం లేదా…? ప్రైవేటు వైద్య వ్యవస్థలను ప్రభుత్వం ఎందుకు వాడుకోవడం లేదన్నారు. ప్రధాని అందరినీ సంప్రదిస్తున్నారు… కేసీఆర్ ఎందుకు సంప్రదించరు అని అన్నారు.

అన్నీ తనకే తెలిసినట్టు సీఎం కేసీఆర్ బుర్ర లేకుండా వ్యవహరించవద్దని సూచించారు రేవంత్ రెడ్డి. విమర్శించడానికి సమయం కాదని సంయమనం పాటిస్తున్నామన్నారు. కరోనాపై కేసీఆర్ ఎన్నిసార్లు మాటమార్చారో చూసుకుంటే… ఆయనకే సిగ్గేస్తుందన్నారు. కరోనాపై మంచి సలహాలు ఇచ్చినోళ్లకు కరోనా రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారన్నారు. అంతేకాదు …ఆయన తప్పుడు పనులను ప్రశ్నిస్తే వాళ్లకూ కరోనా రావాలంటున్నారన్న రేవంత్….కరోనా వ్యాప్తికి పరోక్షంగా కేసీఆర్ యే  బ్రాండ్ అంబాసిడర్ గా మారాడన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తోన్న కేసీఆర్ పై డీజీపీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.     మొదట్లో పారాసిటమల్ చాలన్నారు…ఇప్పుడు భయంకరమైన రోగం అంటున్నారు. ఆయన ఏం చెప్పినా చప్పట్లు కొట్టాలా అని ప్రశ్నించారు. ఏప్రిల్ ఏడు తర్వాత కరోనా ఉండదన్నారు. ఇప్పుడు జూన్ మూడు అంటున్నారు. సీఎం బాధ్యతగా ఉండక్కర్లేదా… నోటికొచ్చినట్టు మాట్లాడటమేంటన్నారు. రోజువారీ కూలీలకు కనీస వసతులు కల్పిస్తే వాళ్లు రోడ్లపైకి రారన్నారు. లాక్ డౌన్ కొనసాగించాలనుకుంటే దానికి తగ్గట్టుగా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి… లేదంటే ప్రజల్లో అసహనం పెరుగుతుందన్నారు. పేదలకు నిత్యవసరాల సరఫరాలో రేషన్ కార్డు, బయోమెట్రిక్ నిబంధనలు పెట్టొద్దన్నారు. పేదల కోసం రూ.వందల కోట్ల విరాళాలు వస్తున్నాయి…వాటన్నింటినీ వారికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి.

Latest Updates