పైసల్లేనప్పుడు కొత్త సెక్రటేరియెట్​ ఎందుకు?

  • రిపేర్లు చేసి పాత దానిని వాడుకుంటే సరిపోదా?
  • ఆర్థిక పరిస్థితి బాగా లేదని ప్రభుత్వం చెబుతోంది
  • ఇలాంటి టైమ్​లో భారీ ఖర్చు ఎలా చేస్తుంది
  • రాష్ట్ర సర్కారును ప్రశ్నించిన హైకోర్టు
  • కేబినెట్​ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం మాకుంది
  • సెక్రటేరియెట్​పై తుది నిర్ణయం ఏం తీసుకున్నారు
  • బిల్డింగ్​ ప్లాన్​తో పాటు పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశం
  • తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:

‘‘రాష్ట్రమే కాదు దేశమే ఆర్థిక మాంద్యంతో కష్టాల్ని ఎదుర్కొంటోంది. ఈ విషయాన్ని ప్రభుత్వాలే చెబుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతోంది. ఇలాంటి టైమ్​లో కొత్త సెక్రటేరియట్‌‌‌‌ నిర్మాణానికి భారీ ఖర్చు ఎలా చేస్తుంది. కష్టకాలంలో కొత్తగా సెక్రటేరియట్‌‌‌‌ కట్టాల్సిన అవసరం ఉందా? ఉన్నదానికే మరమ్మతులు చేసి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటే సరిపోతుంది కదా! మాంద్యం నేపథ్యంలో కొత్తది కట్టడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనుకుంటున్నారు. ఈ పైసలు ఎక్కడి నుంచి తెస్తారు?’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కొత్త సెక్రటేరియెట్‌‌‌‌ కట్టే విషయంలో పలు విషయాలను తెలుసుకోవాలని భావిస్తున్నామంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ ఆర్ఎస్‌‌‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ అభిషేక్‌‌‌‌రెడ్డిల డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ఈ కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్‌‌‌‌ భవనాలు కూల్చవద్దంటూ కాంగ్రెస్‌‌‌‌ నేతలు రేవంత్‌‌‌‌ రెడ్డి, జీవన్‌‌‌‌ రెడ్డి, తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌‌‌‌ పీఎల్‌‌‌‌ విశ్వేశ్వర్‌‌‌‌రావు, ఇతరులు దాఖలు చేసిన పిల్స్‌‌‌‌ను గురువారం హైకోర్టు మరోసారి విచారించింది.

ఎన్నేండ్లలో పూర్తి చేస్తారు?

భారీ నిర్మాణాలు చేయాలంటే 5 లేదా 6 ఏండ్లు పడుతుందని, రాజస్థాన్‌‌‌‌లో హైకోర్టును పుష్కర కాలంపాటు కట్టారని, ఇక్కడ కూడా అలా చేస్తారా?, ఎన్నేండ్లలో నిర్మాణాలు పూర్తి చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెక్రటేరియెట్‌‌‌‌ను వేర్వేరు బిల్డింగ్స్‌‌‌‌లోకి తరలిస్తే గుట్టుగా ఉండాల్సిన ఫైళ్లు బయటకు వెళ్లవని గ్యారంటీ ఏముందని ప్రశ్నించింది. గతేడాది ఫిబ్రవరి 18న కేబినెట్‌‌‌‌ తీసుకున్న నిర్ణయాన్ని డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ పూర్తిగా చదివించింది. ‘‘ప్రస్తుతం ఉన్న స్థలంలోనే తగిన మార్పులతో సెక్రటేరియెట్‌‌‌‌కు మరమ్మత్తులు చేయాలని తీర్మానంలో ఉంది. మరోచోట కొత్త సెక్రటేరియట్‌‌‌‌ కట్టాలని ఉంది. కొత్త నిర్మాణాన్ని చేపడతారా? మార్పులు చేస్తారా? దీనిపై తుదినిర్ణయం ఏం తీసుకున్నారు?’’ అని ప్రశ్నించింది.

తుది నిర్ణయం తీసుకోవద్దని చెప్పలేదు

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌(ఏఏజీ) రామచందర్‌‌‌‌ రావు వాదనలు వినిపిస్తూ.. కొత్త సెక్రటేరియెట్​నిర్మాణంపై సాంకేతిక నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, కేబినెట్​ సబ్​ కమిటీకి నివేదిక ఇచ్చిందని, సబ్‌‌‌‌ కమిటీ ఆ నివేదికను సీఎం కేసీఆర్‌‌‌‌కు సమర్పించిందని, దీనిపై సీఎం ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు చెప్పారు. గతంలో ఈ విషయంలో హైకోర్టు స్టే ఇచ్చినందున ముందుకెళ్లలేకపోయామని వివరించారు. ఉన్న సెక్రటేరియెట్‌‌‌‌ బిల్డింగ్స్‌‌‌‌ కూల్చరాదని మాత్రమే తాము స్టే ఇచ్చామని, స్టే కారణంగా ఏ నిర్ణయం తీసుకోలేదని ఎలా చెబుతారని బెంచ్ తప్పుపట్టింది. తుది నిర్ణయం తీసుకోవద్దని తామెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేసింది. టెక్నికల్‌‌‌‌ కమిటీ రిపోర్టు తర్వాతే కొత్తగా భవనాలు కట్టాలనే నిర్ణయానికి సర్కార్‌‌‌‌ వచ్చిందన్నారు. అయినా కేబినెట్‌‌‌‌ తీర్మానం చేసిన అంశాలపై కోర్టులు సమీక్ష చేయరాదని, ఈ మేరకు సుప్రీంకోర్టు రూలింగ్‌‌‌‌ ఇచ్చిందన్నారు. డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ కల్పించుకుని.. ప్రజలకు చెందిన అంశాల పేరుతో కేబినెట్‌‌‌‌ ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులు జోక్యం చేసుకోరాదనడం కుదరదని, కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించేప్పుడు, అదీ సెక్రటేరియెట్‌‌‌‌ బిల్డింగ్స్‌‌‌‌ ఉండగా వాటిని కూల్చి కొత్తది కట్టాలనే నిర్ణయం కాబట్టి న్యాయ సమీక్ష చేసే అధికారం తమకు ఉందని స్పష్టం చేసింది.

పూర్తి వివరాలు ఇవ్వండి

కొత్తగా నిర్మించాలని భావిస్తే భవనాల నిర్మాణ ప్లాన్‌‌‌‌తో పాటు దానికి సంబంధించి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ప్రస్తుత సెక్రటేరియెట్‌‌‌‌ ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎన్ని ఎకరాల్లో ఎన్ని చదరపు అడుగుల్లో కట్టడాలు ఉన్నాయి, కొత్తగా ఎంత విస్తీర్ణంలో నిర్మించాలని అనుకుంటున్నారు, దీనికి ఎంత స్థలం అవసరం, కొత్త భవనాలు నిర్మించేవరకు సెక్రటేరియట్‌‌‌‌ను ఎక్కడ కొనసాగిస్తారు మొదలైన వివరాలతో అఫిడవిట్‌‌‌‌ వేయాలని ఆర్అండ్‌‌‌‌బీ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 7కు వాయిదా వేసింది.

Why new secretariat building: High Court questioned the TS government

Latest Updates