కేజ్రీవాల్ మారిండా..?

అరవింద్​ కేజ్రీవాల్​ మారిపోయారా? చీటికీ మాటికీ అందరిపైనా విరుచుకుపడే కేజ్రీవాల్​ ఈ మధ్య సైలెంట్​గా ఎందుకున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ‘మానసిక రోగి (సైకోపాత్​)’గా, ప్రతి ఒక్క పొలిటీషియన్​ని ‘అవినీతిపరుడు (కరప్ట్​)’గా, తానొక్కడే ‘మిస్టర్​ క్లీన్​’గా భావించే ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నట్టుండి ‘మర్యాదస్తుడు’గా మారిపోయారు. మహాత్మా గాంధీ మూడు కోతుల సిద్ధాంతాన్ని… ‘చెడు అనొద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు’… తుచ తప్పకుండా పాటించేస్తున్నారు కేజ్రీ! లోక్​సభ ఎన్నికల వరకు ఎవరిపైనయినా ఒంటికాలిపై లేచేవారు.  ఇప్పుడు మొత్తం కొత్త కేజ్రీవాల్​ కనిపిస్తున్నారని ఢిల్లీ మీడియా ఆశ్చర్యపోతోంది.

నేషనల్​ కేపిటల్​ రీజియన్​ (ఎన్సీఆర్​)లో అక్రమంగా వెలసిన మురికివాడల్ని, కాలనీలను రెగ్యులరైజ్​ చేయడానికి నరేంద్ర మోడీ సర్కారు పోయిన నెలలో నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ‘దీపావళి గిఫ్ట్​’గా కేజ్రీవాల్​ ఆకాశానికెత్తేశారు.  ప్రత్యేకంగా ప్రెస్​ మీట్​ పెట్టి ‘కేంద్ర సహకారానికి ధన్యవాదాలు’ చెప్పారు. ఇలాంటివాటిని రాజకీయాలతో ముడిపెట్టకూడదన్నారు. గతంలోనైతే, కేంద్రం అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తోందన్న లెవెల్​లో మండిపోయేవారు కేజ్రీ. ఢిల్లీలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణాన్ని ప్రకటిస్తూ… మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ చెప్పిన మాటల్ని ప్రస్తావించారు. ‘ప్రభుత్వ సంక్షేమ కేటాయింపుల్లో 85 శాతం అవినీతిపరులు మింగేసి, కేవలం 15 శాతం మాత్రమే ప్రజలకు ఇస్తుంటారని రాజీవ్​ అనేవారు. మేము అలా కాదు, 85 శాతాన్ని ఢిల్లీ ప్రజలకు దక్కేలా చూస్తున్నాం’ అన్నారు కేజ్రీవాల్​.

అలాగే, ఎన్సీఆర్​లో కాలుష్యాన్ని అదుపు చేయడంకోసం కేంద్ర సర్కారు చేస్తున్న ప్రయత్నాల్నికూడా మెచ్చుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ ‘సరి–బేసి స్కీమ్​ అమలుని ప్రెస్​మీట్​లో ప్రకటించారు. ఆ సందర్భంగా సెంట్రల్​ గవర్నమెంట్​, ఢిల్లీ మునిసిపల్​ కార్పొరేషన్లు తమను వేలెత్తి చూపకుండా సహకరిస్తున్నాయని చెప్పుకొచ్చారు. వాహనాల నెంబర్లనుబట్టి ‘సరి–బేసి స్కీమ్​’ అమలు చేస్తారు. దీనివల్ల ఒరిగేదేమీ లేదని, ఇది సగం కాలిన రొట్టెలాంటి ప్రయోగమని సుప్రీంకోర్టు కామెంట్​ చేసింది. ఈ స్కీమ్​ అమలు చేసినప్పటికీ ఢిల్లీలో పొగ తగ్గలేదని, కాలుష్యం లెవెల్ 600కు మించే ఉందని అసంతృప్తి ప్రకటించి, రివ్యూ చేస్తానని తెలిపింది. అయితే, తన స్కీమ్​కి సెంట్రల్​ గవర్నమెంట్​ సహకరించిందని కేజ్రీవాల్​ చెప్పుకోవడం మీడియాని, పొలిటికల్​ సర్కిల్స్​ని ఆశ్చర్యంలో పడేసింది.

ఇంతకుముందయితే, మోడీ సర్కారు తీసుకున్న ఏ నిర్ణయాన్నయినా ఏకిపారేసేవారు, ఏదైనా మాట్లాడినా తప్పులు వెదికేవారు అరవింద్​ కేజ్రీవాల్​. తన ఆఫీసుమీద సీబీఐ రైడ్​ చేసినప్పుడు మోడీని ‘పిరికివాడు, మానసిక రోగి’ అని తిట్టిపోశారు. పీఓకేలోని మిలిటెంట్ల స్థావరాలపై సర్జికల్​ స్ట్రయిక్స్​ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించగానే… ‘ఆధారాలున్నాయా? అంతా బూటకం’ అని కొట్టిపారేశారు కేజ్రీ. లోక్​సభ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్​కి స్పెషల్​ స్టేటస్​కోసం అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో నిరసనకు దిగితే కేజ్రీవాల్​ సపోర్ట్​ చేశారు. పశ్చిమ బెంగాల్​లో శారదా చిట్​ఫండ్స్​ స్కాంలో అప్పటి కోల్​కతా పోలీసు కమిషనర్​ రాజీవ్​ కుమార్​ని సీబీఐ ప్రశ్నించాలనుకుంటే కూడా కేజ్రీవాల్​ తప్పుబట్టారు.  బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలపై కేంద్రం నిర్లక్ష్యంగా ఉందని, మోడీ ‘పాకిస్థాన్​ ప్రైమ్​ మినిస్టర్​’లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  ఇక, ఢిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​తో తరచు కయ్యానికి దిగే కేజ్రీవాల్​, ఇప్పడు చాలా సాఫ్ట్​గా ఉంటున్నారు. దీపావళికి జరిపిన ఒక లేజర్​ షో సక్సెస్​ కావడానికి లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్​ బైజాల్​ ఇచ్చిన సపోర్టే కారణమని మెచ్చుకున్నారు.

ఎదురు దెబ్బ భయమా!

దీనికి అందరూ ఊహిస్తున్న కారణం ఒక్కటే… త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ పార్టీకి ఎదురు దెబ్బ తగలవచ్చనే భయం. లోక్​సభ ఎన్నికల్లో ఢిల్లీ, చండీగఢ్​, బీహార్​, గోవా, పంజాబ్​, అండమాన్​ నికోబార్​ దీవులు, హర్యానా, ఒడిశా, ఉత్తరప్రదేశ్​ల్లో ఆప్​ మొత్తం 40 మంది కేండిడేట్లను దించింది. కానీ, పంజాబ్​లోని సంగ్రూర్​ నుంచి ఒకే ఒక్క ఎంపీ భగవంత్​ మాన్​ గెలిచారు. అయితే, ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లోనూ దక్షిణ ఢిల్లీ, వాయవ్య ఢిల్లీల్లో మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. 2014 ఎన్నికల్లో పంజాబ్​ నుంచి నలుగురు గెలిచి, లోక్​సభలో ఆప్​ ఎంపీలుగా అడుగుపెట్టారు.  2015లో ఢిల్లీ అసెంబ్లీలోని 70 సీట్లలో 67 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత గోవా, గుజరాత్​, హర్యానా అసెంబ్లీలకు పోటీ చేసినా ఒక్క చోటా గెలవలేదు. ఢిల్లీ మున్సిపల్​ ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బే తగిలింది.

ఈ లెక్కలన్నీ కేజ్రీవాల్​ కాన్ఫిడెన్స్​ని దెబ్బతీశాయంటున్నారు ఎనలిస్టులు. అదీగాక, ఆయన తరఫున గట్టిగా వాదించి, నిలబడేవాళ్లుకూ‌‌డా ఎవరూ మిగల్లేదంటున్నారు. అరవింద్​ కేజ్రీవాల్​ ఎదుగుదలలో సహకరించిన యోగేంద్ర యాదవ్​, అరుణారాయ్​, మేధా పాట్కర్​, కుమార్​ విశ్వాస్​, కిరణ్​ బేడీ, అధికార ప్రతినిధి అశుతోష్​ వంటివాళ్లంతా ఆ తర్వాత రోజుల్లో ఆయనకు దూరమయ్యారు.  ఆప్​ తరఫున ఎమ్మెల్యేలుగా నెగ్గిన కపిల్​ మిశ్రా, అల్కా లాంబ… కేజ్రీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించి, ఇతర పార్టీల్లో చేరిపోయారు. మరో మూడు నెలల్లో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. పార్టీలో అసంతృప్తిని పెంచుకుంటూ పోవడం, అన్ని పార్టీలనూ ఏదోక రకంగా అవమానించడం మంచిది కాదని కేజ్రీవాల్​ భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది కాలంలో జరిగిన అనేక అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్​తో జత కట్టడానికి పెద్ద పార్టీలేవీ ముందుకు రాకపోవడాన్ని ఎనలిస్టులు గుర్తు చేస్తున్నారు.

మితిమీరిన ఆత్మవిశ్వాసం

ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) పెట్టిన కొత్తలో అరవింద్​ కేజ్రీవాల్​ చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లు సాధించి పెద్ద పార్టీగా నిలబడింది. బీజేపీ, కాంగ్రెస్​లకు కూడా ఫుల్​ మెజారిటీ రాలేదు. కాంగ్రెస్​ సపోర్టుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కేజ్రీవాల్​. ఎన్సీఆర్​ వరకు జన లోక్​పాల్​ బిల్లు పెట్టాలనుకుంటే ఏ ఒక్కరూ సహకరించలేదు. దాంతో 49 రోజులకే సీఎం పోస్టును వదిలేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఏర్పడింది. 2014 లోక్​సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు సీట్లలో ఆప్​ ఒక్కటీ గెలవలేకపోయినా, సెకండ్​ ప్లేస్​లో నిలవగలిగింది. 2015లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 70 సీట్ల అసెంబ్లీలో 67 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించారు ఢిల్లీ ఓటర్లు. దీంతో ఆయన కాన్ఫిడెన్స్​ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది.

Latest Updates