కూతురి పెళ్లి విషయం చెప్పలేదని భార్యను చంపేశాడు

తన ఇంట్లో జరిగే శుభకార్యం తనకు తెలియకుండా జరిగిందనే కోపంతో ఓ వ్యక్తి భార్య, కూతురిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య చనిపోగా…కూతురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ముంబైలో జరిగింది.

ముంబైలోని కళ్యాణ్‌కు చెందిన మోహన్‌ మహాజన్‌(52) తన భార్య మనీషాతో గొడవల కారణంగా విడిగా ఉంటున్నాడు. మనీషా కూతురు, కొడుకుతో కలిసి థాకర్‌ పాడలో నివాసముంటోంది. కొద్దినెలల క్రితమే మనీషా కూతురు గౌరీకి ఎంగేజ్మెంట్ జరిగింది. మరో వారంలో కూతురు పెళ్లి జరగబోతోందన్న విషయం తెలిసిన వ్యక్తుల ద్వారా మోహన్‌కు తెలిసింది. దీంతో ఆగ్రహించిన మోహన్‌.. మనీషా ఇంటికి వెళ్లి, కన్న కూతురి పెళ్లి విషయం తనకు ఎందుకు చెప్పలేదంటూ నిలదీశాడు. భార్యాభర్తల మధ్య వాగ్వివాదం జరిగింది.

ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన మోహన్‌ కత్తితో పలుమార్లు మనీషాను దారుణంగా పొడిచాడు. అడ్డువచ్చిన కూతురి గొంతును కూడా కత్తితో కోసి, అక్కడినుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులకు సమాచారమివ్వటంతో పాటు తీవ్రంగా గాయపడ్డ తల్లీకూతుర్లను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలోనే మనీషా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. గౌరీ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest Updates