కరెంట్ షాక్‌తో భార్యభర్తల మృతి

అనాథైన 7 నెలల బిడ్డ

కురవి, వెలుగు: మహబూబాబాద్‌‌ జిల్లాలోని కురవి మండలం సీరోలు గ్రామంలో విద్యుత్ షాక్‌తో భార్య భర్తలు మృతిచెందారు. సీరోలు ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆలకుంట్ల ఉపేందర్(25), భవాని(22) దంపతులకు ఏడు నెలల కొడుకు ఉన్నాడు. మంగళవారం కూలి పని చేసుకుని భార్యభర్తలు సాయంత్రం ఇంటికి వచ్చారు. చీకటి పడుతున్నసమయంలో భవాని బట్టలు ఉతికి ఇంట్లోని తీగపై ఆరేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. కింద పడిపోతున్న ఆమెను రక్షించే ప్రయత్నంలో ఉపేందర్ పట్టుకోవడంతో ఇద్దరు షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయారు. బాబు ఏడుస్తుండగా ఇంటి పక్కన వారు గమనించే వచ్చి చూసేసరికి ఇద్దరూ చనిపోయి కనిపించారు.

Latest Updates