పిల్లలకు చెర వీడింది ఉన్మాదిని కాల్చేసిన్రు!

అతని భార్యను కొట్టి చంపిన జనం

    23 మంది పిల్లల్ని కాపాడిన యూపీ పోలీసులు

    8 గంటలపాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్

    పోలీసులను అభినందించిన కేంద్ర మంత్రి అమిత్ షా

    రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన యూపీ సీఎం యోగి

పిల్లల బందీ ఇష్యూ సుఖాంతమైంది. గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగిన డ్రామా.. ఎట్టకేలకు ముగిసింది. ఉత్తరప్రదేశ్​లోని ఫరూఖాబాద్ జిల్లా కసారియా గ్రామంలో 23 మందిని బంధించిన సుభాష్ బాథమ్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్ చేశారు. చిన్నారులందరినీ సురక్షితంగా కాపాడారు. గ్రామస్తుల మూక దాడిలో సుభాష్ భార్య చనిపోయింది. రెస్క్యూ ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తి చేసిన యూపీ పోలీసులను కేంద్ర మంత్రి అమిత్ షా అభినందించారు. పోలీస్ టీమ్​కు రూ.10 లక్షల రివార్డును యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

అసలేమైందంటే..

‘‘గురువారం మధ్యాహ్నం తన కూతురి పుట్టినరోజు అని చెప్పి గ్రామంలోని పిల్లలను సుభాష్ బాథమ్ తన ఇంటికి పార్టీకి పిలిచాడు. పిల్లలు మధ్యాహ్నం సుమారు 3 గంటలకు అతడి ఇంటికి వెళ్లారు. చిన్నారులు రాగానే తలుపును లోపల నుంచి గడిపెట్టాడు’’ అని స్థానికులు చెప్పారు. అయితే పిల్లలు ఎంత సేపటికీ రాకపోవడంతో సాయంత్రం 5 గంటల సమయంలో ఓ మహిళ అక్కడికి వెళ్లింది. ఎంతసేపు కొట్టినా తలుపు తెరవలేదు. అక్కడి పరిస్థితిని చూసి చూసి పిల్లలందరినీ సుభాష్ బంధించాడని ఆమెకు అర్థమైంది. ఆమె స్థానికులకు, తర్వాత పోలీసులకు సమాచారం అందించింది.

బాంబులతో పేల్చేస్తా..

సమాచారం అందుకున్న పోలీసులు సుభాష్ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. పోలీసులు రావడం చూడగానే సుభాష్ ఫైరింగ్ ప్రారంభించాడని, కొన్ని నాటు బాంబులు కూడా వేశాడని స్థానికులు చెప్పారు. మాట్లాడేందుకు ప్రయత్నించిన వారిపై సుభాష్ కాల్పులు జరిపాడని, ఒక స్థానికుడు, 8 మంది పోలీసులకు బుల్లెట్ గాయాలు అయ్యాయని కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ చెప్పారు. ‘‘పిల్లలను వదిలిపెట్టాలంటే రూ.కోటి ఇవ్వాలని, తనపై ఉన్న హత్య కేసును కూడా విత్‌డ్రా చేసుకోవాలని అతడు డిమాండ్ చేశాడు’’ అని ఆయన తెలిపారు. అతడి డిమాండ్స్‌ను నెరవేరుస్తామన్న పోలీసులు.. పిల్లల్ని వదిలిపెట్టాలని కోరారు. చర్చలు జరుగుతుండగానే సుభాష్‌ మళ్లీ కాల్పులు జరిపాడు. ‘‘సుభాష్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడేందుకు అతడి ఇంటి వైపు వెళ్లా. ఆ సమయంలో తను నాపై కూడా కాల్పులు జరిపాడు. కాలుకు బుల్లెట్ తగిలింది”అని స్థానికుడు అనుపమ్ దూబే చెప్పాడు. ఆ సమయంలో సుభాష్ అందరినీ బెదిరిస్తూనే ఉన్నాడు. తన దగ్గర 30 కిలోల పేలుడు పదార్థాలు ఉన్నాయని, వాటిని పేల్చేస్తానని భయపెట్టాడు. అంతకుముందు 6 నెలల వయసున్న చిన్నారిని సుభాష్ తన ఇంటి బల్కానీ నుంచి పక్కింటి వారికి ఇచ్చాడని పోలీసులు చెప్పారు. అందరూ 6 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలేనని తెలిపారు.

పిల్లలను బేస్​మెంట్​లో దాచి..

సుభాష్ తన ఇంటి బేస్​మెంట్​లో పిల్లలను దాచాడని, సుమారు ఆరు సార్లు పోలీసులపై కాల్పులు జరిపాడని ఐజీ చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడుతానని డిమాండ్ చేశాడని, కానీ తీరా ఆయన వచ్చాక మాత్రం మాట్లాడేందుకు నిరాకరించాడని తెలిపారు. సుభాష్ కాల్పులు కొనసాగించడంతో పోలీసులు కూడా ఫైరింగ్‌ స్టార్ట్‌ చేశారు. దీంతో కాల్పుల్లో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. 1 గంటకు పోలీసులు, రెసిడెంట్లు ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. తప్పించుకునేందుకు సుభాష్ భార్య ప్రయత్నించింది. అప్పటికే కోపంతో ఊగిపోతున్న స్థానికులు ఆమెను చుట్టుముట్టి దాడి చేశారు. రాళ్లతో కొట్టారు. ఆస్పత్రికి తరలించగా రాత్రి చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున 1.20 హోం శాఖ అదనపు సీఎస్ అవినాశ్ అవస్థీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. పిల్లలందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు.

లక్నో నుంచి మానిటర్‌ చేసిన యోగి

ఫరూఖాబాద్​లో జరుగుతున్న పరిస్థితులను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. లక్నో నుంచే ప్రతిక్షణం మానిటర్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తి చేసిన పోలీసుల టీమ్​కు రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. వారందరికీ అప్రిసియేషన్ సర్టిఫికెట్ ఇస్తామని అదనపు సీఎస్ అవస్థీ చెప్పారు.

ఒక్కొక్కరికి రూ.కోటి అడిగారు: గ్రామస్తులు

సుభాష్ ప్లాన్ ప్రకారమే పిల్లలను బందీలుగా చేసుకున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. తనపై ఉన్న క్రిమినల్ కేసులను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశాడని, జిల్లా కలెక్టర్‌ పేరుతో ఒక లెటర్ కూడా పంపాడని చెప్పారు. పిల్లలను విడుదల చేయాలంటే ఒక్కక్కరికి రూ.కోటి చొప్పున ఇవ్వాలని అతడి భార్య రూబీ కతేరియా డిమాండ్ చేసిందని స్థానికులు చెప్పారు.

Latest Updates